టీడీపీలో ఆ నలుగురు నేతలకు చంద్రబాబు టానిక్ బాగా పనిచేసిందా?

మూడేళ్ల క్రితం వరకు ఆ జిల్లాలో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కకావికలం. నాడు కీ రోల్‌ పోషించిన నాయకులు పత్తా లేకుండా పోయారు. అధినేత ఆదేశాలతో ఫీల్డ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ నలుగురు పోరాటాలకు సిద్ధమయ్యారని టాక్‌. ఇంతకీ ఎవరా నాయకులు?

స్వయంకృతాపరాధంతో హారతి కర్పూరమైన టీడీపీ ప్రతిష్ట!

గుంటూరు జిల్లాను గతంలో తమ అడ్డాగా చెప్పుకొన్న టీడీపీ.. వైసీపీ గాలిలో ఆ అడ్రస్‌ను గల్లంతు చేసుకుంది. వైఎస్‌ హయాంలో 2004, 2009 ఎన్నికల్లో ఒకసారి.. 2019 ఎన్నికల్లో జగన్‌ హవాలో మరోసారి సైకిల్‌ జిల్లాలో కుదేలైంది. మధ్యలో 2014లో ఊపిరి తీసుకున్నా.. అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. టీడీపీ స్వయంకృతాపరాధంతో పార్టీ ప్రతిష్ట హారతి కర్పూరమైంది.

అప్పట్లో చంద్రబాబు పాదయాత్రకు అండగా ఉన్నారు!

2012లో టీడీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో చంద్రబాబు చేపట్టిన ఆత్మగౌరవ యాత్రను గుంటూరుజిల్లా నేతలు ముందుండి నడిపించారు. పల్నాడులో యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావులు యాత్రను పర్యవేక్షిస్తే.. డెల్టాలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబులు చూసుకున్నారు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉండటంతో నాటి పరిస్థితులను ఇటీవలే చంద్రబాబు దగ్గర ప్రస్తావించారట టీడీపీ నేతలు. దీంతో పల్నాడు వేదికగా ప్రజా పోరాటాన్ని చేపడితే దానికి వస్తానని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. అప్పట్లో పాదయాత్రలో అండగా ఉన్న నాయకులే మరోసారి సాయం పట్టాలని అధినేత కోరారట.

చంద్రబాబు హితోక్తులు పనిచేశాయా?

చంద్రబాబు చేసిన హితోక్తులు పనిచేశాయో ఏమో.. యరపతినేని శ్రీనివాసరావుతోపాటు.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తిరిగి యాక్టివ్‌ అయ్యారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఇద్దరూ డైరెక్ట్‌గా స్పాట్‌కు వెళ్లి కేడర్‌కు ధైర్యం చెబుతున్నారు. ఇద్దరూ కార్యకర్తలతో సమావేశాలు పెట్టి రాజకీయంగా వేడి పుట్టించే కామెంట్స్‌ చేస్తున్నారు.

ఎన్నికల వరకు ఇదే స్పీడ్‌ కొనసాగిస్తారా?

మాజీ మంత్రులు నక్కా ఆనందబాబుకు మాజీ మంత్రి ఆలపాటి రాజా తోడు కావడంతో డెల్టాలో టీడీపీ బలం పెంచే వ్యూహాలు రచిస్తున్నారట. పల్నాడులో ఆ ఇద్దరు.. డెల్టాలో ఈ ఇద్దరు నేతల దూకుడు చూసిన తర్వాత చంద్రబాబు టానిక్‌ బాగానే పనిచేసిందని కేడర్‌ నుంచి కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైగా సమయం ఉండటంతో అప్పటి వరకు ఇదే స్పీడ్‌ కొనసాగిస్తారా లేదా అన్నది ప్రశ్న. పైగా చంద్రబాబు కోసం కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారా లేక క్షేత్రస్థాయిలో ఉండి పోరాటం చేస్తారా అన్నదానిపై కొందరిలో సందేహాలు ఉన్నాయట. జిల్లాలో గత ఎన్నికల్లో రెండుచోట్లే టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఒకరు వైసీపీకి జై కొట్టారు. ఈ తరుణంలో ఆ నలుగురి ప్రయోగం ఏ మేరకు టీడీపీకి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-