ఆ ఎమ్మెల్యేలు టోటల్ అన్ హ్యాపీ !

లెక్కలేనన్ని పథకాలు..నెలనెలా ఇంటికే డబ్బులు. ఇళ్లు, స్థలాలు..ఒకటేమిటి.. అసలు సిసలు సంక్షేమ రాజ్యం అంటే ఏంటో ఏపీలోనే చూడాలన్నట్టు ప్రభుత్వం ఉంది. అసంతృప్తి అనేదే లేని జనం మా దగ్గర ఉన్నారని అధికార పార్టీ ఘనంగా చెప్పుకుంటుంటే, పాపం ఎమ్మెల్యేలు మాత్రం లబోదిబో అంటున్నారట. ప్రజలంతా హ్యాపీగా ఉంటే ఎమ్మెల్యేలకు వచ్చిన ప్రాబ్లం ఏమిటనుకుంటున్నారా? అయితే చూడండి..

గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 2 సీటత్లు మినహీఆ అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ పథకాలు మహాజోరుగా అమలు చేస్తోంది. లక్షలాది ఇళ్లస్థలాల పంపిణీ మొదలు…అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. ప్రజలంతా హ్యాపీ. నేతలూ హ్యాపీ. కానీ, ఎమ్మెల్యేలు మాత్రం టోటల్ అన్ హ్యాపీ. నిన్న మొన్నటి వరకు వాళ్లూ హ్యాపీస్‌ అనుకున్నారు. కానీ, వాళ్లు నోళ్లు విప్పితే కానీ, అసలు ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడ్డట్టు. ఒక్కో ఎమ్మెల్యే తను పడుతున్న సమస్యలను ఏకరువు పెట్టారు.

గుంటూరు జిల్లా సమీక్ష సమావేశం డిఆర్సీలో అధికారుల నిర్లక్ష్యం పై నిప్పులు చెరిగారు అధికార పార్టీ ఎమ్మెల్యే లు… ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలని పట్టుదలతో పని చేస్తుంటే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఎమ్మెల్యేలకు సర్ది చెప్పలేక ఇన్చార్జి మంత్రి ఒక దశలో తీవ్ర అసహనానికి గురయ్యారు. నీటి విడుదల అంశంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా కళకళలాడుతుంటే కాల్వ ల పై నాకాబంది పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. గ్రామాలకు వెళ్తున్న శాసనసభ్యులను పిచ్చోళ్లలా చూస్తున్నారని సంచలన కామెంట్లు చేశారు బొల్ల బ్రహ్మనాయుడు.

అక్రమ రేషన్ మాఫియాపై సమావేశంలో నిప్పులు చెరిగారు మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. తమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రేషన్ మాఫియా తరలిస్తున్న బియ్యం పట్టు పడుతుందని ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఇస్తున్న రూపాయి బియ్యాన్ని మాఫియా కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అక్రమ అమ్మకాలకు పాల్పడుతుందని ఆవేదనచెందారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుండి డీలర్ వరకు అవినీతిమయం అయ్యారని వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది. ఎమ్మెల్యేగా తాను చెప్తున్నా సివిల్ సప్లై అధికారులు అంతులేని నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. మరోవైపు కృష్ణా వరదల వల్ల డెల్టా ప్రాంతంలో హార్టికల్చర్ పంటలకు జరిగిన నష్టానికి అధికారులు ఇప్పటికీ నష్టపరిహార లెక్కలు కట్టలేదని వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఏకంగా ఇంఛార్జి మంత్రి వద్దే ఎమ్మెల్యేలు చెప్పడం చర్చనీయాంశమైంది.

Related Articles

Latest Articles

-Advertisement-