బైపాస్ చుట్టూ తిరుగుతున్న ఎచ్చెర్ల రాజకీయం…

ఓ ఐదేళ్ల క్రితం అక్కడ ఫ్లై ఓవర్ వస్తుందంటే అందరూ గగ్గోలు పెట్టారు.అప్పటి ఎమ్మెల్యే, ఎంపీ చొరవ తీసుకోవడంతో ఫ్లై ఓవర్‌ కాస్తా బైపాస్‌ గా మారింది. కట్ చేస్తే మళ్లీ సీన్ రిపీట్ అవుతోంది. ఇదే స్థానిక అధికారపార్టీ నేతలకు తలనొప్పిగా మారిందట. ముఖ్యంగా లోకల్‌ ఎమ్మెల్యే, ఎంపీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో పడిపోయారట. ఇంతకీ ఎచ్చెర్ల వైసీపీ నేతల్లో బైపాస్ కలవరానికి కారణమేంటి ?

శ్రీకాకుళం జిల్లాకు ముఖద్వారమైన ఎచ్చెర్లలో ఇప్పుడు రాజకీయమంతా బైపాస్ చుట్టూనే తిరుగుతోందట . ఎప్పుడో ఐదేళ్ల క్రితం చేసిన ప్రతిపాదనల్లో తాజాగా లెక్కలు మారిపోవడంతో రహదారి విస్తరణ కథ మళ్లీ మొదటికే రావడమే ఇందుకు కారణమట . జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం పరిధిలో గత ప్రభుత్వ హయాంలో ఫ్లై ఓవర్ నిర్మించాల్సి వచ్చింది . ఐతే నియోజకవర్గానికి కేంద్ర బిందువుగా ఉండే రణస్థలంలో ఫ్లై ఓవర్ రావడం వల్ల తమ ఉనికి పూర్తిగా కోల్పోతామని …ఇళ్లు , ఆస్తులు , వ్యాపారాలు నష్టపోతామని అప్పట్లో స్థానికులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈక్రమంలో అశోక్ గజపతిరాజు , అప్పటి కేంద్ర రహదారుల మంత్రితో మాట్లాడి ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రతిపాదనను తప్పించారు ఈ ఫ్లై ఓవర్ కు బదులుగా బైపాస్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించడంతో అందుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. దీంతో రణస్థలం మండలం దన్నానపేట నుంచి లావేరు మండలం రావివలస వరకూ మూడున్నర కిలోమీటలర్ మేర బైపాస్ ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి 66.30 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు.

బైపాస్‌ ప్రతిపాదనలతో ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. క్రయవిక్రయాలు కూడా ఓ రేంజ్ లో సాగాయట. ఐతే ఇంతవరకూ బాగానే ఉంది కానీ … భూసేకరణ జరిపి ఆరేళ్లవుతున్నా పరిహారం నిర్ణయించడంలో రేటు అధికమవ్వడంతో నేటి వరకూ బైపాస్ పనులు ప్రారంభం కాలేదు ఇక అప్పట్లో సేకరించిన భూమి మాత్రం ఇంకా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. పరిహారం కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం జరగలేదు . ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈ భూములను రైతులకు తిరిగి అప్పగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండటంతో ఇక బైపాస్ కు స్వస్తి పలికినట్లేననే చర్చ ఎచ్చెర్లలో జోరుగా సాగుతోందట .

ఇప్పుడు ఈ అంశమే రణస్థలం రాజకీయంలో రచ్చ రాజేస్తోందట. ప్రతిపాదనలు మారి రణస్థలం పట్టణం మీదుగానే ఉన్నఫ్లై ఓవర్ నిర్మాణానికి నేషనల్ హైవే అధికారులు సిద్ధమవుతున్నారట. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియకు కూడా వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయట. ఇప్పుడిదే స్థానికుల్లో కలవరం రేపుతోందట. ఫ్లై ఓవర్ నిర్మాణం అంటూ జరిగితే రణస్థలం పూర్వవైభవం కోల్పోవడం ఖాయమని ఇక్కడి వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారట. దీంతో ఎలాగైనా తమ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణం రాకుండా అడ్డుకునేందుకు ప్రజలతో పాటు పార్టీలకు అతీతంగా స్థానిక నాయకులు ఒక్కటవుతున్నారట. ఇందుకోసం ప్రత్యక్ష పోరాట కార్యాచరణ రూపొందించుకుంటున్నారట. బైపాస్ కోసం భూములు తీసుకున్న ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఫ్లై ఓవర్ వైపు మొగ్గుచూపడం పై మండిపడుతున్నారట. స్థానికంగా ఇంత జరుగుతున్నా ఎంపీ , ఎమ్మెల్యేలు సైలెంట్‌ గా ఉండటంపై వైసీపీ కార్యకర్తలకు కూడా ఫైర్ అవుతున్నారట.

ఐతే ఫ్లై ఓవర్ ను అడ్డుకునేందుకు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ లు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్న వేళ ఎచ్చెర్లలో మరో చర్చ కూడా నడుస్తోందట. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడం ఒక కారణమైతే, బైపాస్ క్రెడిట్ టీడీపీకి దక్కకూడదనే ఇలా చేస్తున్నారన్న గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయట.

అటు వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఢిల్లీ స్థాయిలో కేంద్రమంత్రిని కలిసి పరిస్థితిని విన్నవించడంలో విఫలమయ్యారని, బైపాస్ నిర్మాణం ఆగిపోవడానికి అధికారపార్టీ నేతలే కారణం అంటూ పుకార్లు షికార్లు చేయిస్తున్నారట. ఇదిలా ఉంటే బైపాస్ ఆగిపోతే అక్కడ భూములిచ్చినవారు, కొన్నవారు నష్టపోతారు. అలాగే ఫ్లై ఓవర్ కడితే రణస్థలం ఉనికి ప్రశ్నార్ణకంగా మారడంతో పాటు అక్కడి ప్రజలు, వ్యాపారులు నష్టపోతారు. అందుకే బైపాస్ ఆగిపోయి ఫ్లై ఓవర్ అంటూ మొదలైతే, స్థానికంగా రాజకీయంగా కూడా గట్టి దెబ్బే తింటామని వైసీపీ కేడర్‌ కూడా ఆందోళన చెందుతోందట..

Related Articles

Latest Articles

-Advertisement-