నటీనటుల డ్రగ్స్‌ కేసులో ఈడీ ఏం తేల్చింది…?

డ్రగ్స్‌ కేసులో సినీ నటులను ప్రశ్నిస్తున్న ఈడీ ఏం తేల్చింది? గంటలకొద్దీ సాగుతున్న క్వశ్చన్‌ అవర్‌లో ఎలాంటి సిత్రాలు జరుగుతున్నాయి? వందల కొద్దీ ప్రశ్నలకు జవాబులు లభిస్తున్నాయా? చివర్లో నటీనటులను ఏ విషయంలో ఈడీ అధికారులు ప్రత్యేకంగా రిక్వస్ట్‌ చేస్తున్నారు?

ఈడీ అధికారుల అనుమానాలకు ఆధారాలు దొరికాయా?

డ్రగ్స్‌ కేసులో హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు క్యూ కట్టారు. విచారణ పేరుతో గంటల కొద్దీ కబడ్డీ ఆడుతోంది ఈడీ. నోటీసులు అందుకున్నవారు ఇప్పటి వరకు వచ్చి వెళ్లారు. వారంతా తమ ఆర్థిక లావాదేవీలు.. బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను ఎంక్వైరీ అధికారుల ముందు పెడుతున్నారు. ఉదయం ఈడీ ఆఫీస్‌కు వచ్చిన యాక్టర్లను సాయంత్రం వరకు గ్రిల్‌ చేస్తున్నారు అధికారులు. ఈ క్వశ్చన్‌ అవర్‌లో ఈడీ అధికారులు అనుమానించిన అంశాలు వెలుగు చూశాయా? నటీ నటులు చెప్పిన సమాధానం సంతృప్తికరంగా ఉందా? అన్నది ప్రశ్నలుగానే ఉండిపోయాయి. ఏ అంశాలపై ప్రశ్నిస్తున్నారో బయటకు వస్తోంది కానీ.. ఈడీ అధికారుల అనుమానాలకు ఆధారాలు దొరికాయో లేదో మిస్టరీగానే ఉంటోంది.

అన్నేసి గంటలు ఏం ప్రశ్నిస్తున్నారు?

పూరీ జగన్నాథ్‌, చార్మి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, రవితేజ, నవదీప్‌ తదితరులు ఇంటరాగేషన్‌ పూర్తయింది. ఈ కేసులో ఇతరులు ఎవరినైనా పిలిస్తే ఇంత హైప్‌ వచ్చేది కాదు. కానీ.. విచారణకు వచ్చిన వాళ్లంతా సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు కావడంతో ప్రచారం ఎక్కువైంది. వీరిలో కొందరు గతంలో డ్రగ్స్‌ కేసులో నేరుగా విచారణ ఎదుర్కొన్నారు. వారినే ఇప్పుడు ఈడీ పిలవడంతో.. రకరకాల సందేహాలు షికారు చేస్తున్నాయి. ఇదే సమయంలో అన్నేసి గంటలపాటు ఈడీ ఆఫీసులో నటీ నటులు ఏం చేస్తున్నారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే వీరికి ఇది కొత్త అనుభవం. పైగా జనాల్లోకి వస్తే క్రేజ్‌ మరోలా ఉంటుంది. నటులను దగ్గర నుంచి చూసేందుకు అభిమానులు పోటీపడతారు. ఇప్పుడు ఈడీ ఆఫీస్‌లోనూ అదే జరుగుతోందని ప్రచారం మొదలైంది.

చివరల్లో ఒక గంట ఫొటో షూట్‌!
ఫొటోల కోసం ఈడీ అధికారులు, సిబ్బంది క్యూ..!

విచారణకు వస్తున్న నటీనటులకు ఈడీ అధికారులు, సిబ్బంది అభిమానులు అవునో కాదో కానీ.. వారిని దగ్గరగా చూసి ఎంతో సంతోషిస్తున్నారట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నావళి ఒక ఎత్తు అయితే.. చివర్లలో వెళ్లిపోయే ముందు ఒక గంట ప్రత్యేకంగా ఫొటో షూట్‌ కోసం కేటాయిస్తున్నారట. అధికారులు సిబ్బంది నటీనటులతో ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతున్నారట. వీటికి సంబంధించిన ఫొటోలు బయటకు రాకుండా గట్టిగానే అధికారులు కట్టడి చేస్తున్నారట. షెడ్యూల్‌ ప్రకారం ఫలానా నటీ లేదా నటుడు విచారణకు వస్తుంటే.. వాళ్లు తిరిగి వెళ్లే ముందు ఈడీ ఆఫీస్‌లోని అందరూ ఠంచనుగా ఫొటోల కోసం క్యూ కట్టేస్తున్నారట. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. ఇన్ని రోజుల విచారణలో ఏం తేల్చారో అన్న ప్రశ్నలు షికారు చేస్తున్న సమయంలోనే ఈ ఫొటో షూట్‌లపై ప్రచారం జరగడంతో అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన వారు మాత్రం ఈడీ మార్క్‌ విచారణ ఇదేనా అని నోరెళ్ల బెడుతున్నారట.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-