డిప్యూటీ సీఎం నారాయణస్వామికి జలగండం తప్పదా…?

ఆ డిప్యూటీ సీఎంను రెండు నీటి ప్రాజెక్టులు తెగ ఇబ్బంది పెడుతున్నాయట. మంత్రి పదవి చేపట్టగానే వెంటనే పూర్తి చేస్తామని చిటికెలు కూడా వేశారట. చూస్తుండానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఎక్కడి గొంగళి అక్కడే. అమాత్యుల వారికి కూడా చికాకు మొదలైందట. ఇంతకీ ఎవరా మంత్రి? అధికారంలో ఉండి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?

కృష్ణాపురం, ఎన్టీఆర్‌ జలాశయాలను అభివృద్ధి చేస్తానని హామీ..!

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే. ఇక్కడ వరసగా గెలుస్తూ వస్తున్న ఆయనకు నియోజకవర్గంలో ఇచ్చిన కీలక హామీలు వెంటాడుతున్నాయి. గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఏ మీటింగ్‌ జరిగినా.. ఏ సభలోనైనా ఆయన నోటి నుంచి వచ్చే మాట.. నియోజకవర్గంలోని కృష్ణాపురం.. ఎన్టీఆర్‌ జలాశయ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తానని. ఎన్టీఆర్‌ జలాశయానికి మరమ్మతులు చేయాలని ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన. కృష్ణాపురం ప్రాజెక్టు అభివృద్ధి అయితే నారాయణస్వామికి తీరని కలలా మిగిలిపోయిందట.

కాల్వల్లో పూడిక పెరిగి చెరువులకు నీళ్లు వెళ్లడం లేదు..!

1975లో కార్వేటి నగరం మండలంలో మధ్య తరగతి రిజర్వాయరైన కృష్ణాపురం ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు నిండితే నియోజకవర్గంలో 50పైగా గ్రామాలకు నీరు అందిస్తుంది. ప్రాజెక్టు నిర్మించిన కొత్తలో నీటి నిల్వతో కళకళలాడిన జలాశయం.. తరువాత రోజుల్లో పాలకుల నిర్లక్ష్యం కారణంగా కళా విహీనంగా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి చాలా ఏళ్లు గడుస్తోంది. ప్రాజెక్టకు ఇరువైపుల ఉన్న కుడి, ఎడమ కాలువలు కోసం నిర్మించిన గోడలు మొత్తం పగిలిపోయాయి. రెండు కాలువల్లో పూడిక పెరిగి నియోజకవర్గంలోని 32 చెరువులకు నీళ్లు వెళ్లడం కష్టంగా ఉంది. వర్షాలకు జలాశయం నిండినా ప్రతిసారీ నీరంతా వృథాగా తమిళనాడుకు పోతోందని స్థానికుల ఆవేదన. ఈ రెండు ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితిల్లోనూ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి వరసగా గెలుస్తున్నారు నారాయణస్వామి. టీడీపీ హయాలో చేయలేకపోయినా.. వైసీపీ అధికారంలోకి రావడం.. డిప్యూటీ సీఎం కావడంతో ఆ పనులన్నీ చిటికలో చేసేయొచ్చని అనుకున్నారట.

చూస్తుండగానే రెండున్నరేళ్ల పదవీకాలం గడిచిపోయింది…!
ఒకవైపు వెంటాడుతోన్న పదవీగండం..!

జలాశయాల విషయంలో నారాయణస్వామి ఒకటి తలిస్తే.. ఇప్పుడు ఇంకొకటి జరుగుతోందట. నిధుల కోసం పలుమార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి మాట్లాడినా.. ఎలాంటి కదలిక లేదు. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. రైతులు ఎక్కడికక్కడ ఈ అంశంపై నిలదీసే పరిస్థితి. దీంతో ఎందుకు నిధులు విడుదల కావడం లేదో తెలియడం లేదని వాపోతున్నారట డిప్యూటీ సీఎం. అసలే రెండున్నరేళ్ల కేబినెట్‌ ప్రక్షాళనలో మంత్రి పదవి ఉంటుందో… ఉండదో అనే టెన్షన్‌ ఆయన్ని వేధిస్తోంది. జలాశయాల పనులు జరక్కపోతే జనాల్లో వ్యతిరేత వస్తుంది. అందుకే ఎవరికీ చెప్పుకోలేక లోలోన తెగన మథన పడుతున్నారట డిప్యూటీ సీఎం.

-Advertisement-డిప్యూటీ సీఎం నారాయణస్వామికి జలగండం తప్పదా...?

Related Articles

Latest Articles