కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క గేర్‌ మార్చారా…?

నిన్న మొన్నటి వరకు నియోజకవర్గానికే పరిమితమైన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు గేర్‌ మార్చారట. మొత్తం కోల్‌ బెల్ట్‌ను చుట్టేసి.. అక్కడ పాగా వేయాలని వ్యూహం రచించారట. అధికారపక్షం బలంగా ఉన్న చోట.. ఆ విపక్ష ఎమ్మెల్యే ఎత్తుగడలు వర్కవుట్ అవుతాయా?

ఉత్తర తెలంగాణలో సీతక్క కీలక పాత్ర పోషిస్తారా?

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క. ములుగు నియోజకవర్గం తప్ప ఇతర ప్రాంతాల్లో పెద్దగా ఫోకస్‌ పెట్టింది లేదు. గిరిజన తండాల్లో చురుకుగా పర్యటించడానికి ప్రాధాన్యం ఇస్తారామె. కనీసం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించిన సందర్భాలు తక్కువే. కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపిస్తే.. ములుగులోనే చేసేవారు. కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాల వల్లో లేక పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదనో కామ్‌గానే ఉండిపోయారు సీతక్క. కానీ.. ఇకపై ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారట. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చగా మారింది.

ఆదిలాబాద్‌ టు ఖమ్మం వరకు సీతక్క మార్క్‌ పాలిటిక్స్‌!

ఎమ్మెల్యే సీతక్క.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వర్గంలోని వ్యక్తిగా అందరికీ తెలిసిందే. రేవంత్‌ కొత్తగా పగ్గాలు చేపట్టడంతో ఎమ్మెల్యే సైతం యాక్టివ్‌ పాత్ర పోషించడానికి సిద్ధమైనట్టు చెబుతున్నారు. ఆ మధ్య సీతక్కకు కాంగ్రెస్‌లో దక్కే ప్రాధాన్యం గురించి రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు కొందరు నాయకులు. మారిన పరిణామాల తర్వాత ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు ఆమె పార్టీలో కీ రోలో పోషిస్తారని టాక్‌. అయితే ఆ పాత్ర ఏంటన్నదే ఇప్పుడు చర్చగా మారింది.

సింగరేణిలో పట్టు సాధించేందుకు సీతక్క సారథ్యంలో వ్యూహం!

తెలంగాణలో దాదాపు సగం వరకు సింగరేణి కవర్‌ చేస్తుంది. కోల్‌బెల్ట్‌లో కాంగ్రెస్‌కు పెద్దగా పట్టులేదు. ఈ దఫా మాత్రం నల్ల బంగారు నేలపై కాంగ్రెస్‌ పట్టు సాధించేందుకు ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక ఫోకస్‌ పెడతారని సమాచారం. సింగరేణి ఎన్నికల బాధ్యతలు ఆమెకు అప్పగిస్తారని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో.. కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘం INTUCని గెలిపించే బాధ్యత సీతక్కకు అప్పగించబోతున్నారట. ఈ ప్రాంతంతో ఆమెకు ఉన్న పాత పరిచయాలను ఈ విధంగా ఉపయోగించుకుంటారని సమాచారం.

సింగరేణి ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ గెలుపే టాస్క్‌!

త్వరలో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో INTUCని గెలిపించడం.. పెద్ద టాస్క్‌గా భావిస్తున్నారట కాంగ్రెస్‌ నాయకులు. సింగ‌రేణి గ‌నులున్న భూపాల‌ప‌ల్లి, ఇల్లందు, కొత్తగూడెం, మ‌ణుగూరుతోపాటు మిగ‌తా ప్రాంతాల్లోని కార్మికుల‌తో సీత‌క్కకు పోరాటాలపరంగా ప్రత్యక్ష సంబంధాలున్నాయి. మంద‌మ‌ర్రి, గోదావ‌రిఖ‌ని, మంచిర్యాల‌, చెన్నూరు, రామ‌గుండంలోనూ ఎమ్మెల్యే పట్టు సాధిస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట. గతంలో అసెంబ్లీలో సింగరేణి కార్మికుల గురించి సీతక్క మాట్లాడిన అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మరి.. కొత్త బాధ్యతల్లో ఎమ్మెల్యే సీతక్క ఏ మేరకు రాణిస్తారో.. కాంగ్రెస్‌ జెండాను రెపరెపలాడిస్తారో లేదో కాలమే చెప్పాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-