కాంగ్రెస్ నేతలు టైం వేస్ట్ చేస్తున్నారా? ఇంత హడావిడితో ఫలితం ఉంటుందా?

తెలంగాణ వేదికగా హుజూరాబాద్ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఉప ఎన్నికకు కారణమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ అభ్యర్థిగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పోటీగా.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. పోటాపోటీ వాడీవేడీ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేక మల్లగుల్లాలు పడుతోంది. కొన్నాళ్లపాటు కొండా సురేఖ పేరు బలంగానే వినిపించింది. కానీ.. ఆమె సుముఖంగా ఉన్నారా లేదా.. అన్నది కూడా సరైన స్పష్టత రాకుండా పోయింది.

ఇలాంటి సందర్బంలో.. కాంగ్రెస్ పార్టీ ఏకంగా కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. హుజూరాబాద్ లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు దరఖాస్తు చేసుకోవాలంటూ.. ప్రతిపాదన పెట్టింది. ఇది చూసి.. జనాల్లోనే కాదు.. స్వయానా కాంగ్రెస్ నేతల్లోనూ కాస్త అయోమయం నెలకొంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీలో ఏది చెబితే అదే ఫైనల్. ఇంతటి అవకాశం, ప్రభావం ఉన్నా కూడా.. ఎందుకు అభ్యర్థి విషయంలో ఇంత హడావిడి చేస్తున్నారు? అన్నది కాస్త అయోమయాన్నే కలిగిస్తోంది.

నిజమే. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినా సరే. ఆయన దూకుడుకు పగ్గాలు వేసే శక్తులు పార్టీలో చాలానే ఉన్నాయి. పైగా.. హుజూరాబాద్ అన్నది కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉంది. ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కు చాలా మందే సీనియర్లు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయి నాయకులు సైతం ఉన్నారు. వాళ్ల అభిప్రాయాలకు హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో సరైన ప్రాధాన్యం దక్కనట్టుగానో.. లేదంటే రేవంత్ ఉండగా మనకెందుకులే అన్న భావనలో ఉన్నారేమో.. అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఈ అయోమయాన్ని.. కాంగ్రెస్ పార్టీ సత్వరమే తగ్గించుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. రేవంత్ రాకతో కలిగిన జోష్ ను.. జయాపజయాలతో సంబంధం లేకుండా హుజూరాబాద్ వేదికగా ముందుకు తీసుకుపోకుంటే.. పార్టీలో లుకలుకలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అది రేవంత్ నాయకత్వానికి సైతం కాస్త ఇబ్బందిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే అభిప్రాయాన్ని.. కాంగ్రెస్ నేతలు ఆఫ్ ద రికార్డ్ గా వ్యక్తం చేస్తున్నారు. కాలయాపన ఆపి.. అభ్యర్థి విషయంలో త్వరగా స్పష్టత తీసుకువస్తే.. కార్యకర్తలుగా తమ వంతు పనిని ముందుకు తీసుకుపోతామని అంటున్నారు.

ఈ తరుణంలో.. ఈటల, గెల్లును ఢీ కొట్టగలిగే నేత కాంగ్రెస్ నుంచి ఎవరు కాబోతున్నారు? హుజూరాబాద్ లో హస్తం భవిష్యత్తును ఎవరు ప్రభావితం చేయబోతున్నారు? ఈ ప్రశ్నలకు.. సమాధానాలు ఎన్నాళ్లకు వస్తాయో చూడాల్సిందే.

Related Articles

Latest Articles

-Advertisement-