బద్వేల్‌ ఉపఎన్నికలో జాతీయ పార్టీలు..

బద్వేల్ ఉపఎన్నికలో పోటీ.. ఆ రెండు జాతీయపార్టీల మధ్యేనట. ఇదేంటి.. అధికారపార్టీని వదిలేసి.. ఉనికి కూడా లేని ఆ పార్టీల మధ్య పోటీ ఉందంటున్నారు అని అనుకుంటున్నారా? మీరే చూడండి. ఇంతకీ ఆ పార్టీలు పోటీ పడుతోంది గెలవడానికా…? ఓడిపోడానికా..?

పోటీకి సై అని కాలుదువ్వుతున్న బీజేపీ, కాంగ్రెస్‌..!

బద్వేల్ ఉపఎన్నికల బరి నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైదొలిగింది. మరణించిన శాసనసభ్యుల కుటుంబాల నుంచి అభ్యర్ధులు బరిలో ఉన్నప్పుడు పోటీ చేయకూడదన్న సాంప్రదాయానికి తమ పార్టీ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది టీడీపీ. అంతకుముందు జనసేన కూడా సేమ్ అలాంటి అభిప్రాయంతోనే పోటీ చేయబోవడం లేదని చెప్పేసింది. పొత్తులో ఉన్న జనసేన అర్ధాంతరంగా కాడి కింద పడేయడంతో ఏం చేయాలో పాలుపోని బీజేపీ.. మొత్తానికి ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ప్రధాన పార్టీలు సాంప్రదాయాలు, సానుభూతి అంటుంటే… కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పోటీకి సై అంటే సై అంటు తొడగొడుతున్నాయి.

బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు గొప్ప ఓటు బ్యాంకు ఉందా అంటే అదీ లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌కు అక్షరాల 2వేల 148 ఓట్లు పోలయ్యాయి. ఇక కేంద్రంలో రెండోసారి ఘనంగా అధికారంలోకి వచ్చిన బీజేపీకి వచ్చిన ఓట్లు 3 వేల 125 మాత్రమే. అదేఎన్నికల్లో జనసేనకు 4వేల 283 ఓట్లుపడ్డాయి. గెలిచిన వైసీపీకి 84వేల 955 ఓట్లు వస్తే… టీడీపీ 76 వేల 603 ఓట్లు సాధించింది. ఇదీ గత ఎన్నికల్లో పార్టీలు… వాటికి పోలైన ఓట్ల చరిత్ర. విచిత్రం ఏంటంటే.. బీజేపీకి దగ్గరగా.. కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా నోటాకు 3 వేల 31 ఓట్లు వచ్చాయి.

బీజేపీ, కాంగ్రెస్‌ లెక్కలు వేరే ఉన్నాయా?

ఏ రకంగా చూసినా బీజేపీ, కాంగ్రెస్‌లకు అక్కడ ఠికానా లేదని అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు పోరాడాల్సింది అధికార వైసీపీ మీద. రెండున్నరేళ్లలో లక్ష కోట్ల రూపాయలకుపైగా నగదును జనానికి బదిలీ చేసి.. 30 లక్షల మందికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చి, అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఆ పార్టీని తట్టుకోవడం ఈ రెండు పార్టీలకు అయ్యేపనేనా? అనే డౌట్ ఓటు లేని వారికి కూడా ఇట్టే వస్తుంది. కానీ.. ఇక్కడ ఈ రెండు జాతీయ పార్టీల లెక్కలు వేరుగా ఉన్నాయట.

2019లో టీడీపీ, జనసేనకు వచ్చిన ఓట్లపై ఆశ..!

టీడీపీ, జనసేన బరిలో లేవు. వైసీపీని వ్యతిరేకించే ఈ రెండు పార్టీల ఓట్లలో కొన్నైనా పోల్ అవుతాయని జాతీయ పార్టీలు అంచనాలు వేస్తున్నాయట. ఆ ఓట్లలో తమకే ఎక్కువ పడతాయని.. అవన్నీ లెక్క వేసుకుంటే తమ బలం పెరిగిందని చెప్పుకోవచ్చని చూస్తున్నాయట. టీడీపీ, జనసేన కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్‌లు తమకే ఎక్కువ ఓట్లు పడతాయంటే తమకే పడతాయనే లెక్కలు వేసుకుంటున్నారట.

బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వస్తే కాంగ్రెస్‌ వాయిస్‌ పెరుగుతుందా?

బీజేపీతో టీడీపీకి కయ్యం లేకున్నా.. లోపల మాత్రం కాషాయ శిబిరంపై గుర్రుగానే ఉందట ఆ పార్టీ కేడర్. తమ అధినేత పవన్ కల్యాణ్ వద్దన్నా వినకుండా పోటీ పెట్టిన బీజేపీ మీద జనసైనికులూ గుర్రుగా ఉన్నారనేది కాంగ్రెస్ లెక్క. ఈ లెక్క ప్రకారం టీడీపీ, జనసేన ఓట్లు బీజేపీకి పడే ఛాన్స్ ఏ మాత్రం లేదనేది కనుమరుగైన కాంగ్రెస్ అంచనా. అదే సమయంలో ఆ ఓట్లన్నీ తమకే పోల్ అవుతాయని చెబుతున్నారట. అంతేకాదు.. బీజేపీ కంటే తమకే ఓట్లు ఎక్కువ ఓట్లు పడ్డాయని గట్టిగా చెప్పుకోడానికీ బద్వేల్ ఉపఎన్నిక ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలోకి దిగారు. ఆమె పాత పరిచయాలు.. సీనియార్టీ కూడా తమకే ప్లస్‌ అవుతాయని చెబుతోందట కాంగ్రెస్.

దారులు వేరైనా ఎక్కువ ఓట్లు సాధించడమే లక్ష్యం?

బీజేపీది కూడా సేమ్ ఇలాంటి స్ట్రాటజీనేనట. అయితే ఎన్నికల్లో పోటీ చేయకున్నా మిత్రులు మిత్రులమే కాబట్టి జనసైనికుల ఓట్లు తమకే అనేది బీజేపీ ఆశ. అలాగే టీడీపీ ఓట్లు ఆ పార్టీకి బద్దశత్రువైన కాంగ్రెస్ కంటే తమకే పడతాయనే అంచనాతో ఉందట కమలం పార్టీ. ఆ పార్టీకి ఇంకో అంచనా కూడా ఉందట. బద్వేల్ అభ్యర్ధిగా యువకుడైన సురేష్‌ను నిలపడం కలిసి వస్తుందని చెబుతోంది. ఇదీ ఈ రెండు జాతీయ పార్టీల మధ్య ఉన్న బద్వేల్ పోటీ. రెండు వేర్వేరు దారులైన ఈ పార్టీలు గెలవడం కంటే ఓడిపోయినా… ఒకరికంటే ఒకరు ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం ఎలా అనేదానిపైనే పోటీ పడుతున్నారట.

-Advertisement-బద్వేల్‌ ఉపఎన్నికలో జాతీయ పార్టీలు..

Related Articles

Latest Articles