ప్రధాని మోదీతో కేసిఆర్ భేటిపై పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ…

ఒక్క భేటీ వంద అనుమానాలకు కారణమైంది. పార్టీ కార్యాలయ శంకుస్ధాపనకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్…ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని కలిశారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్… అలాంటిదేం లేదు… కాళ్ల బేరానికి వచ్చారని బిజెపి విమర్శిస్తున్నాయి. కేసీఆర్ ఢిల్లీ టూర్ చుట్టూ పెద్ద చర్చే నడుస్తోంది.

మూడు రోజుల డిల్లీ పర్యటనకు బుధవారం బయలుదేరి వెళ్లారు సియం కేసిఆర్. సెప్టెంబర్ 2 న వసంత్ విహర్ లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసారు కేసిఆర్. ఆ తర్వాత షెడ్యూలు ప్రకారం మూడవ తేది హైదరాబాద్ కు సియం కేసిఆర్ రావాలి. కానీ, కేసిఆర్ షెడ్యూల్‌ లో మార్పులు జరిగాయి. సియం కేసిఆర్ కు శుక్రవారం మోదీ అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో భేటి అయ్యారు. డిల్లీలో ప్రధాని మోదీతో కేసిఆర్ భేటిపై పోలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. డిల్లీ పర్యటనతో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న విశ్లేషణలు మొదలయ్యాయి.

2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సియం కేసిఆర్ మళ్లీ అధికారంను చేజిక్కించుకున్నారు .అప్పడే ఫెడరల్ ఫ్రంట్ అలోచనతో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో భేటి అయ్యారు కేసిఆర్. దీంతో అప్పట్లో మోదితో కేసిఆర్ కు గ్యాప్ వచ్చిందన్న టాక్‌ నడిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిసెంబర్ నెలలో ప్రధాని మోదీతో భేటి అయ్యారు సియం కేసిఆర్. ఇటు ఫెడరల్ ఫ్రంట్ నినాదంతో సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది టిఆర్ఎస్. మళ్లీ కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 డిసెంబర్ లో కలిసారు కేసిఆర్. ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను ప్రస్తావించారు సియం కేసిఆర్‌.

అప్పట్లో ప్రధానితో కేసిఆర్ భేటిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేసిఆర్ కు మోదీ అపాయింట్ మెంట్ వెంటనే దొరకడంపై కూడా రకరకాల చర్చలు జరిగాయి. దీంతో, రాజ్యంగబద్దంగా కేంద్రంతో ఉండాల్సిన సంబంధాలను తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని టిఆర్ఎస్ నేతలు స్పష్టం చేసారు. తాజాగా మళ్లీ ప్రధానితో సియం కేసిఆర్ భేటిపై చర్చ మొదలైంది . ఇటు బిజేపి,టిఆర్ఎస్ ఒక్కటే అని విమర్శలు గుప్పిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఇటు తెలంగాణ బిజేపి నేతలు కూడా కేసిఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి. డిల్లీ నుంచి రాగానే టిఆర్ఎస్, బిజేపి ఒక్కటేనన్న భావన ప్రజల్లో కల్పించి లబ్ది పోందడానికి కేసిఆర్ ప్రయత్నిస్తారని బండి సంజయ్ అన్నారు.

మొత్తంగా తెలంగాణ సియం కేసిఆర్ డిల్లీ పర్యటనలో భేటిలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. విపక్ష పార్టీల నుంచి విమర్శలు స్టార్ట్ అయ్యాయి. మొత్తంగా ఒక్క భేటి …వంద అనుమానాలకు దారి తీసిందనే టాక్‌ నడుస్తోంది.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా తెలంగాణ బీజేపీ నాయకత్వం గుండెల్లో దడ మొదలవుతోందనే టాక్‌ కూడా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ డిల్లీ ఆకస్మిక పర్యటన సమయంలోనూ బీజేపీ కంగారు పడింది. దీనికి కారణం కేసీఆర్ వ్యూహమే! ఆయన పాలనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంతృప్తికరంగా ఉందనే అంశం పలుమార్లు వెల్లడైంది. రాజకీయంగా బీజేపీకి, టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీ అయినా టిఆర్ఎస్ పై కేంద్రం వైఖరికి, తెలంగాణలోని బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి మధ్య చాలా తేడా ఉంది. దీంతో తాజాగా ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కేసీఆర్ కలుసుకున్న వ్యవహారంపై బీజేపీ తెలంగాణ నాయకులు ఆరా తీస్తున్నారట.

Related Articles

Latest Articles

-Advertisement-