దిల్లీలో కేసీఆర్ దూకుడు.. దేనికి సంకేతం?

కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాయని అంటుంటారు. ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు గమనిస్తే అది నిజమే అని ఎవరైనా అంగీకరిస్తారు. తాజాగా.. ఢిల్లీలో తెలంగాణ భవన్ కు శంకుస్థాపన చేస్తున్న కేసీఆర్ తీరు.. సైతం ఈ చర్చలో ముందుకు వస్తోంది. ఇదంతా.. భవిష్యత్ రాజకీయాలకు పునాదిగా భావించవచ్చా.. అన్న ప్రశ్నలు సైతం ఉదయిస్తున్నాయి. ఇందుకు రకరకాల కారణాలను రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు.

జాతీయ స్థాయిలో బీజేపీకి రోజు రోజుకూ బలం పెరుగుతున్నాకొద్దీ.. కాంగ్రెస్ పార్టీ బలం ఆ స్థాయిలో తగ్గుతూ వస్తోంది. అది ఎంతగా అంటే.. ఇటీవల బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రాని సందర్భంలో.. తమ ఓటమిని సైతం మరిచిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్.. బీజేపీ ఓడిపోయిందని సంబరపడుతూ వ్యాఖ్యలు చేసే స్థాయికి ఆ పార్టీ నాయకత్వ ఆలోచన శైలి చేరుకుంది. సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కు ఎదిగిన బీజేపీ బలాన్ని తక్కువగా అంచనా వేయడమే.. కాంగ్రెస్ ఆలోచన శైలికి నిదర్శనంగా నిలిచింది.

ఇదే సమయంలో.. బీజేపీకి ప్రత్యామ్నాయ వేదిక రావాలంటే.. అది కేవలం థర్డ్ ఫ్రంట్ ద్వారానే అన్న చర్చ ఉదయించింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో ఇప్పటికే ఈ పనులు జరుగుతున్నాయని జాతీయ స్థాయిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిలో.. బీజేపీ భావజాల వ్యతిరేక డీఎంకే, జేడీయూ వంటి పార్టీలు.. కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి.. ఉత్తరాదిలో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ వంటి పార్టీలతో జత కడితే.. కచ్చితంగా బీజేపీని ఎదుర్కోవచ్చన్న ప్రణాళిక జరుగుతున్నట్టు వార్తలు చాలా కాలంగానే వినిపిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో.. కేసీఆర్ ఢిల్లీపై స్పెషల్ కాన్సన్ ట్రేషన్ పెట్టడం ఆసక్తికి, సరికొత్త చర్చను ప్రారంభించింది. థర్డ్ ఫ్రంట్ అంటూ ఏర్పడితే.. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు మాదిరిగా.. ఇప్పుడు కేసీఆర్ 2024 నాటికి బలమైన నాయకుడిగా ఎదగాలని ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జాతీయ రాజకీయాల గురించి.. కేసీఆర్ చాలాసార్లు ప్రసంగాలు చేశారు. తనకు ఉన్న ఆసక్తిని వెలిబుచ్చారు. ఈ క్రమంలోనే.. తాజాగా ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సంకల్పించి ఉంటారని.. టీఆర్ఎస్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి.

అందుకే.. చూడాలి. ఏం జరగబోతోందో. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో కేసీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తారో. థర్డ్ ఫ్రంట్ కు తానే కేంద్రంగా మారబోతున్నారా.. లేదంటే బీజేపీతో కలిసి పరోక్షంగా అడుగులు వేస్తారా.. తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో ఎంతటి ప్రభావాన్ని చూపించబోతున్నారు.. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-