చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రి పదవి…?

నామినేటెడ్‌ పోస్టుల పందేరం ముగియడంతో ఎమ్మెల్యేల ఫోకస్‌.. కేబినెట్‌ బెర్త్‌లపై పడింది. రెండున్నరేళ్ల ప్రక్షాళన గడువు దగ్గర పడేకొద్దీ.. తాడేపల్లి వైపు ఆశగా చూస్తున్నారు. కేబినెట్‌లో ఉన్నవారు టెన్షన్‌ పడుతుంటే.. కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారు ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఈ అంశమే హాట్‌ టాపిక్‌.

తాడేపల్లి వైపు ఆశగా చూస్తోన్న ఎమ్మెల్యేలు

అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో 13 చోట్ల గెలిచింది వైసీపీ. ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. ఇద్దరికి జిల్లా నుంచి కేబినెట్‌లో చోటు దక్కింది. ఆ ఇద్దరిలో ఒకరు డిప్యూటీ సీఎం. ఇదే జిల్లా నుంచి సీఎం జగన్‌కు సన్నిహితులు.. పార్టీకోసం బాగానే ఫైట్‌ చేశారని ప్రచారంలో ఉన్నవారు కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. కానీ.. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌లో మార్పులు.. చేర్పులు ఉంటాయని సీఎం జగన్‌ చెప్పడంతో ఆ క్షణం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడా సమయం దగ్గర పడుతోంది. ఆశావహులు తాడేపల్లివైపు చూస్తున్నారు.

ఈ దఫా కేబినెట్‌లో చోటు ఖాయమని లెక్కలు

చిత్తూరు జిల్లా నుంచి నారాయణ స్వామి డిప్యూటీ సీఎంగా.. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. వైసీపీలో కీలకం.. బలమైన నేత అయిన పెద్దిరెడ్డి కంటే.. నారాయణస్వామిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆయన కుర్చీ పదిలమా కాదా అని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. కేబినెట్‌లో చోటు ఆశిస్తున్న వారిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా ఉన్నారు. నాడు వీరికి మంత్రి పదవులు దక్కకపోవడంతో వివిధ పదవులు ఇచ్చి సంతృప్తి పరిచారు.చెవిరెడ్డిని తుడా ఛైర్మన్‌తోపాటు విప్‌ను చేశారు. రోజాకు APIIC ఛైర్మన్‌ గిరి ఇచ్చారు. భూమన టీటీడీ ఛైర్మన్‌ పదవి ఆశించినా దక్కలేదు. ఇప్పుడు మాత్రం కేబినెట్‌లో చోటు ఖాయమని బలంగా నమ్ముతున్నారు ఈ ముగ్గురు నేతలు.

ఏపీఐఐసీ ఛైర్మన్‌ పోస్ట్‌ నుంచి తప్పించడమే రోజాకే పాజిటివ్‌ సంకేతమా?

తాజాగా నామినేటెడ్‌ పోస్టుల పందేరం పూర్తి చేసింది వైసీపీ. ఈ సందర్భంగా రోజా దగ్గర ఉన్న APIIC ఛైర్మన్‌ పదవిని వేరొకరికి కట్టబెట్టారు. దీంతో ఆమెకు మంత్రివర్గంలో చోటు ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అందుకే APIIC ఛైర్మన్‌ పోస్ట్‌ను వెనక్కి తీసుకున్నారని.. ఇంతకంటే సంకేతం ఇంకేం కావాలని రోజా మద్దతుదారులు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే మంత్రి కావాలని చూస్తున్న ఇతర పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సైలెంట్‌గా తాడేపల్లి వెళ్లి.. పార్టీలో కీలక నేతలను.. వీలైతే ముఖ్యమంత్రిని కలిసి తమ మనసులో మాటను చెప్పి వస్తున్నారు.

కలిసొచ్చే సమీకరణాలు.. పరిణామాలేంటి?

ఇటీవల ఆనందయ్య కరోనా మందు పంపిణీ ద్వారా నిత్యం చర్చల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. ఆ ఎపిసోడ్‌ తనకు ప్లస్‌ అవుతుందని అనుకుంటున్నారట. భూమన కరుణాకరెడ్డి కూడా నో డ్రగ్స్‌ తిరుపతి పేరుతో చేపట్టిన ప్రచారం కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న రోజా కూడా ఇటీవల మీడియాలో ఫోకస్‌ తగ్గకుండా చూసుకుంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై గతంలోలా స్పందిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు నామినేటెడ్‌ పోస్టుల పందేరం సందర్భంగా మారిన సమీకరణాలను తమకు కలిసొచ్చేవిగా చెప్పుకొంటున్నారు ఆమె అనుచరులు.

గడువు దగ్గర పడేకొద్దీ ఎమ్మెల్యేలలో బీపీ పెరుగుతోందా?

జిల్లా నుంచి ఈ ముగ్గురు నాయకులే కాకుండా.. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వంటి వారు కూడా మంత్రిపదవులపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో రెండున్నరేళ్ల గడువు దగ్గర పడేకొద్దీ ఆశావహుల్లో బీపీ పెరుగుతోంది. మరి.. తాడేపల్లి నుంచి ఎవరికి పిలుపు వస్తుందో.. కొత్త లెక్కలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-