చింతమనేనికి కేసులతో జింతాత జిత జిత..!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి జింతాత జిత జిత అవుతోందా? కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవా? కేసులపై కేసులు వచ్చి పడుతున్నాయా? ఒకప్పుడు పోలీసులు.. కేసులంటే భయపడని ఈ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఖాకీలను చూస్తే వంగి వంగి దండాలు పెడుతున్నారా? ఇంతకీ చింతమనేనిలో మార్పు వచ్చిందా లేక రాజకీయ మార్పులకు అనుగుణంగా ఆయనే ట్యూన్‌ అయ్యారా?

చింతమనేనికి జింతాత జిత జిత అవుతోందా?

రెండున్నరేళ్లు వెనక్కి వెళ్లితే.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తీరు వేరు. గిట్టనివారు ఎదురు పడినా.. ఆయనకు గిట్టనపని ఎవరు చేసినా చింత నిప్పులు తొక్కేవారు. అందరిముందు అధికారులకు చీవాట్లు పెట్టేవారు. దాంతో ఆయన పేరు చెబితేనే ప్రభుత్వ అధికారులతోపాటు.. పోలీసులు హడలిపోయేవారు. కానీ.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని తెలుసుకోవడానికి చింతమనేనికి ఎంతో టైమ్‌ పట్టలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చింతమనేకి జింతాత జిత జిత అయిపోతోంది. కంటిపై కునుకే లేదట.

నాడు పోలీసులపై కాలు దువ్వారు.. నేడు దండాలు పెడుతున్నారు!

2019 ఎన్నికలకు ముందు చింతమనేనిపై 25 కేసులు ఉంటే.. ఈ రెండున్నరేళ్లలో మరో 25 కేసులు వచ్చి పడ్డాయి. కేసుల్లో హాఫ్‌ సెంచరీని దాటేశారు ఈ మాజీ ఎమ్మెల్యే. తహశీల్దార్‌ వనజాక్షిపై దాడి.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై రుబాబు.. బెవరేజెస్‌లో పనిచేస్తున్న ముఠా కార్మికులపై దౌర్జన్యం ఒక ఎత్తు అయితే.. 2019 ఎన్నికల సమయంలో దళితులపై ఆయన చేసిన కామెంట్స్‌ దుమారం రేపాయి. అప్పట్లో వీటిపై కేసులు నమోదైనా పెద్దగా జంకలేదు ఈ మాజీ ఎమ్మెల్యే. కేసులు లేకపోతే రాజకీయ నాయకుడే కాదన్నట్టుగా చింతమనేని తీరు ఉండేది. అలాంటిది 2019 తర్వాత పెడుతున్న కేసులకు బెంబేలెత్తిపోతున్నారట. ఏకంగా పోలీసులకు దండం పెట్టేస్తున్నారు. ఒకప్పుడు పోలీసులపై కయ్యానికి కాలు దువ్విన చింతమనేని ఇప్పుడు మీకో నమస్కారం మహాప్రభో అంటున్నారట.

ఇప్పటికే 66 రోజులు జైలులో ఉన్నారు!

ఎన్నికల్లో ఓడాక.. దాదాపు 17 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు.. పాత కేసులు కలిపి దాదాపు 66 రోజుల జైలు జీవితం అనుభవించారు చింతమనేని. ఏపీ డీజీపీ మాత్రం చింతమనేనిపై 1995 నుంచి ఇప్పటి వరకు 85 కేసులు ఉన్నాయని వెల్లడించారు. తాజాగా పెరిగిన నిత్యావసరాల ధరలను నిరసిస్తూ విశాఖ ఏజెన్సీలో చింతమనేని ధర్నా చేస్తే.. అక్కడికి వచ్చి అరెస్ట్‌ చేశారు పోలీసులు. దాంతో ఈ టీడీపీ నేతకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిందట. నక్సలైట్ల కంటే పోలీసుల నుంచే తనకు ముప్పు ఉందని కామెంట్స్‌ పాస్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌ చేస్తారేమోనని బెంబేలెత్తిపోయారట. పైగా దెందులూరు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో మూడు మండలాల పరిధిలోని పోలీస్‌ స్టేషన్లలో చింతమనేనిపై కేసులు నమోదయ్యాయి. ఇక మిగిలింది ఒక్క పీఎస్సే. అందులో కూడా కేసు కన్ఫామ్‌ అని టాక్‌.

సింపతి వస్తుందని టీడీపీ శ్రేణులు సంబరాలు!

మొత్తానికి చింతమనేనిపై నమోదవుతున్న కేసులపై వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే.. టీడీపీ వర్గాలు కూడా మరో లెక్క వేసుకుంటున్నాయట. అంతా మా మంచికే.. అరెస్ట్‌లతో సింపతి వర్కవుట్‌ అవుతుందని భావిస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. అసలాయనకు మాత్రం ఎదురవుతున్న చిక్కులు అర్థం కావడం లేదట. అందుకే ఆయన పోలీసులకు పెడుతున్న దండాలపై సెటర్లు పేలుతున్నాయి.

Related Articles

Latest Articles

-Advertisement-