చంద్రబాబుకు మళ్లీ జూనియర్‌ ఎన్టీఆర్‌ సెగ…

టీడీపీ అధినేతకు మళ్లీ జూనియర్‌ ఎన్టీఆర్‌ సెగ తగిలింది. జిల్లాల పర్యటనలో పార్టీ జెండాలతోపాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ జెండాలు రెపరెపలాడాయి. గతంలో కుప్పం.. ఇప్పుడు మచిలీపట్నం. ఊరు మారినా కేడర్‌ రూపంలో చేస్తున్న హడావిడి సేమ్‌ టు సేమ్‌. పార్టీలో రచ్చ రచ్చ అవుతోంది. ఇంతకీ ఆ ప్రచారం వెనక ఎవరున్నారు? టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్‌ వాచ్‌!

చంద్రబాబు మచిలీపట్నం పర్యటనలో జూనియర్‌ ఎన్టీఆర్‌ జెండాలు

2019లో ఓటమి తర్వాత టీడీపీకి ఏపీలో కష్టకాలం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. పార్టీలో ఉన్నవారు ఎవరో.. యాక్టివ్‌గా ఎవరు ఉన్నారో తెలియదు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఏ మేరకు పుంజుకుంటుందో అన్న చర్చ పార్టీలో అంతర్లీనంగా నడుస్తోంది. ఇలాంటి సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీలోకి రావాలని కొందరు.. ఆయన ప్రచారం చేయాలని మరికొందరు కోరస్‌ అందుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఎక్కడికి వెళ్లితే అక్కడ జూనియర్‌ ఎన్టీఆర్‌ జెండాలు.. ఫ్లెక్సీలు.. బ్యానర్లు ప్రదర్శించడం పార్టీలో కలకలం రేపుతోంది. ఈ పరిణామాలు పార్టీ అధినేతకు మింగుడు పడటం లేదని టాక్‌. చంద్రబాబు మచిలీపట్నం పర్యటనలో జూనియర్‌ ఎన్టీఆర్‌ జెండాలు రెపరెపలాడటంతో పార్టీలో ఈ అంశంపై మళ్లీ రచ్చ మొదలైంది.

ఆ మధ్య బుచ్చయ్య నోటి వెంట జూనియర్‌ మాట!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తరఫున ఒకసారి ఎన్నికల్లో ప్రచారం చేశారు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఆ తర్వాత ఆయన ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే పొలిటికల్‌ ఎంట్రీపై మీడియా ప్రశ్నించడంతో.. ఇది సమయం.. సందర్భం కాదని చర్చకు ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారాయన. మరో సినీ ఫంక్షన్‌లో అభిమానులు నినాదాలు చేయడంతో అసహనం వ్యక్తం చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిప్రాయం ఎలా ఉన్నా.. టీడీపీలో మాత్రం అతనిపై చర్చ ఆగడం లేదు. ఆ మధ్య టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం రోజున జూనియర్‌ ఎన్టీఆర్‌ వస్తారంటూ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య ప్రకటించి సంచలనం రేపారు.

కుప్పంలో చంద్రబాబు ఎదుటే జూనియర్‌ ఎన్టీఆర్‌కు మద్దతుగా నినాదాలు

జూనియర్‌ ఎన్టీఆర్‌ అంశం చర్చ వరకే ఆగితే ఇంత రచ్చ అయ్యేది కాదు. కానీ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలే ఆసక్తిగా ఉన్నాయి. ఆ మధ్య చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు పెట్టారు. జెండాలు, బ్యానర్లతో ఆయన పర్యటించే మార్గాలను నింపేశారు. స్వయంగా చంద్రబాబు ఎదుటే జూనియర్‌ ఎన్టీఆర్‌కు మద్దతుగా నినాదాలు హోరెత్తించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అంశంపై నాడు చంద్రబాబు నుంచి ఎలాంటి రియాక్షన్‌ లేదు. ఆ తర్వాత హీరో పుట్టినరోజున మరోసారి కుప్పంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ జెండాలు భారీ ఎత్తున ఎగరేశారు. కుప్పంలో ఇదంతా ఎవరు చేస్తున్నారో నివేదిక కావాలని స్థానిక పార్టీ నాయకులను ఆదేశించారు చంద్రబాబు. కుప్పం నుంచి నివేదిక ఇచ్చారో లేదో కానీ.. ఇప్పుడు మచిలీపట్నం వెళ్లిన చంద్రబాబుకు మళ్లీ ఆ సెగ తప్పలేదు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి రచ్చ చేస్తోంది ఎవరు?
ఆ సామాజికవర్గానికి చెందిన కొందరు వీటి వెనక ఉన్నారా?

అసలు టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి రచ్చ చేస్తోంది ఎవరు? పార్టీలోని వ్యక్తులే ఈ తరహా పోకడలకు ఊతం ఇస్తున్నారా? లేక ఆ సామాజికవర్గానికి చెందిన కొందరు వీటి వెనక ఉన్నారా? ఎవరూ బ్యాకప్‌ లేకపోతే.. ఈవిధంగా చంద్రబాబు ఎదుటే ధైర్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ జెండాలు ఎగరేయరన్నది కొందరి అభిప్రాయం. టీడీపీ అధినేత ఎక్కడికి వెళ్లితే అక్కడ జూనియర్‌ ఎన్టీఆర్‌ జెండాలు ఎగరేస్తున్నారంటే ఎవరో ఆర్గనైజ్‌డ్‌గానే ఇదంతా చేస్తున్నారని అనుమానిస్తున్నారట. పాత్రధారులు.. సూత్రధారులు ఎవరైనా.. టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ జెండాలు రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-