భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి పార్టీ నేతల షాక్‌..!

సొంత పార్టీ నేతల నిర్ణయం ఆ ఎమ్మెల్యేకు షాక్‌ ఇచ్చిందా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కేడర్‌ గుర్రుగా ఉందా? ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్మానం చేసేశారా? పార్టీ సంస్థాగత ఎన్నికలను బహిష్కరించడంతో.. ఎమ్మెల్యేకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందా? ఆయన ఎవరో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం.

ఎమ్మెల్యే పైళ్లకు పార్టీ శ్రేణుల నుంచే ఎదురుగాలి?

పైళ్ల శేఖర్‌రెడ్డి. భువనగిరి ఎమ్మెల్యే. ఈ అధికారపార్టీ శాసనసభ్యుడికి ఇన్నాళ్లూ ఎలా ఉన్నా.. ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో కేడర్‌ నుంచి ఎదురుగాలి వీస్తోందట. ఎమ్మెల్యే తమపార్టీకి చెందిన వారే అయినా.. ఆయన్ని వ్యతిరేకించడంలో గులాబీ శ్రేణులు ఏ మాత్రం సంకోచించకపోవడం టీఆర్ఎస్‌లో చర్చగా మారింది. ఇదే ఇప్పుడు భువనగిరి రాజకీయాలను వేడెక్కిస్తోంది.

హామీలు అమలు చేయలేదని జైనపల్లి టీఆర్ఎస్‌ శ్రేణులు గుర్రు!
సంస్థాగత ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం!

ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. నియోజకవర్గంలోని బీబీనగర్‌ మండలం జైనపల్లి గ్రామ టీఆర్ఎస్‌ నేతలు.. పార్టీ సంస్థాగత ఎన్నికలు బహిష్కరించారు. ఏదో ప్రకటన చేసి కామ్‌గా ఉండలేదు. ఏకంగా తీర్మానం చేయడంలో కలకలం రేగింది. జైనపల్లి నుంచి బీబీ నగర్‌, జైనపల్లి నుంచి కొండ మడుగు రహదారులకు మరమ్మతులు చేయించడంతో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నది ఇక్కడి టీఆర్ఎస్‌ శ్రేణుల ఆరోపణ. అందుకే టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు పార్టీకి చెందిన సర్పంచ్‌, కార్యకర్తలు తీర్మానమే చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి షాక్‌ అయ్యారట.

తీర్మానంపై 40 మంది గ్రామ టీఆర్ఎస్‌ ప్రతినిధుల సంతకాలు!

కేవలం రహదారుల మరమ్మతు పనులే కాకుండా బస్‌స్టాప్‌తోపాటు మరికొన్ని హామీలు అమలు కాలేదని తీర్మానంలో ప్రస్తావించారు గ్రామానికి చెందిన టీఆర్ఎస్‌ ప్రతినిధులు. కొత్త పార్టీ కమిటీ ఎన్నిక ఎలా ఉన్నా.. పాత కమిటీని కూడా తిరస్కరిస్తున్నట్టు ప్రకటించేశారు. ఈ తీర్మానంపై 40 మంది సంతకాలు చేసి.. దానిని నేరుగా ఎమ్మెల్యేకు పంపారట. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామం నుంచి 80 శాతం మంది అనుకూలంగా ఓటు వేసినా.. ప్రజలను పట్టించుకోలేదని గుర్రుగా ఉన్నారు స్థానిక పార్టీ నేతలు.

జైనపల్లి టీఆర్ఎస్‌ శ్రేణులపై ఎమ్మెల్యే పైళ్ల ఫైర్‌!

ఈ రగడలో జైనపల్లి టీఆర్ఎస్‌ శ్రేణులను బుజ్జగించాల్సింది పోయి.. వారిపైనే చింత నిప్పులు తొక్కారట ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి. ఆ గ్రామ సర్పంచ్‌తోపాటు అక్కడి పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారట. కొందరైతే ఎమ్మెల్యే స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వివాదం ఏ రూపంలో బయటకొచ్చినా.. తమ గ్రామ సమస్యలను రాష్ట్రానికంతా తెలిసేలా చేశారు జైనపల్లి టీఆర్ఎస్‌ శ్రేణులు. అవి పరిష్కారం అవుతాయో లేదో కానీ.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వారు చేసిన తీర్మానం పెద్ద చర్చకే దారితీసింది. ఇలాంటి సమయంలో సమస్య పెద్దది కాకుండా పార్టీ నేతలు సర్దుబాటు చేస్తారు. కానీ.. ఎమ్మెల్యే దానికి భిన్నంగా స్పందించడంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొందట. మరి.. ఈ ఎపిసోడ్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-