భద్రాచలం టీఆర్‌ఎస్‌లో ఇసుక దుమారం..!

అక్కడ అధికారపార్టీ నేతలకు ఇసుకే బంగారం. ఇసుకపై వచ్చే ఆదాయమే వారికి కీలకం. అటువైపు ఎవరైనా తొంగి చూసినా.. మోకాలడ్డినా సెగలు.. భగభగలు తప్పవు. ఎత్తుకు పైఎత్తులు వేయడంలో వెనకాడరు రాజకీయ నేతలు. ప్రస్తుతం అలాంటి ఓ పంచాయితీ అధికారపార్టీతోపాటు.. అధికారవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

భద్రాచలం ఇసుక ర్యాంప్‌పై దుమారం..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక రాజకీయ నాయకులకు, కొందరు అధికారులకు ప్రధాన ఆదాయ వనరు. ఇసుకపై వచ్చే రాబడి పోకుండా.. తమకు అనుకూలురైన అధికారులకు ఇక్కడ పోస్టింగ్‌లు ఇప్పించుకుంటారు నేతలు. భద్రాచలంలో గోదావరి నదిపై కొల్లుగూడెం దగ్గర ఇసుక ర్యాంప్‌ ఉంది. ఈ ర్యాంప్‌పై ఒక్కసారిగా వివాదం రేగింది. అది కాస్తా చినికి చినికి గాలి వానలా మారుతోంది. ర్యాంప్‌ను వశపర్చుకోవడానికి ఎవరు ఎత్తులు వారు వేస్తున్నారు.

ఇసుక కోసం ఎమ్మెల్సీ వర్సెస్‌ డీసీవో..!

భద్రాచలం పరిధిలో మూడు సొసైటీలు ఉన్నాయి. ఇందులో ఒక సొసైటీకి టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఎంత చెబితే అంత. అది పేరుకు గిరిజన సొసైటీ అయినా.. పెత్తనం బాలసానిదే అని ప్రచారం. ప్రస్తుతం ఇసుక ర్యాంప్‌ ఏ సొసైటీ పరిధిలో లేదు. దానిని బాలసాని ఆశీస్సులు ఉన్న సొసైటీకి అప్పగించాలని జిల్లా సహకార అధికారి వెంకటేశ్వరరావుపై ఒత్తిళ్లు వచ్చాయట. కానీ.. ఎక్కడో తేడా కొట్టింది. సదరు అధికారికి.. ఎమ్మెల్సీకి మధ్య పొసగలేదు. అది కాస్తా రచ్చ కెక్కడంతో చర్చగా మారింది.

జడ్పీ మీటింగ్‌లో ఇసుక రగడ..!

ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో తనపై వస్తున్న ఒత్తిళ్లను ఏకరవు పెట్టారు సహకార అధికారి వెంకటేశ్వరరావు. నేరుగా ఎమ్మెల్సీనే టార్గెట్‌ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. అక్కడే ఉన్న బాలసాని డీసీవోపై చిందులేశారు. కలెక్టర్‌ అనుదీప్‌ జోక్యం చేసుకోవడంతో అక్కడికి సమస్య సద్దుమణిగింది. ఈ గొడవ జరిగిన నాలుగు రోజుల తర్వాత డీసీవో వెంకటేశ్వరరావుపై విచారణ కోసం అదే శాఖకు చెందిన ఉన్నతాధికారులు వచ్చారు. డీసీవోపై ఏవో ఆరోపణలు ఉన్నాయని ఆకాశరామన్న ఉత్తరం వచ్చిందట. ఆరోపణల నిజానిజాలను తేల్చేందుకు వచ్చినట్టు సెలవిచ్చారు ఉన్నతాధికారులు. దీని వెనక ఎమ్మెల్సీ బాలసానే ఉన్నారని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.

డీసీవోకు హైదరాబాద్‌ స్థాయిలో అండ ఉందా?

ఈ వివాదంలో మరో గమ్మత్తు ఉంది. డీసీవో వెంకటేశ్వరరావుకు హైదరాబాద్‌ స్థాయిలో ఎవరో అండగా ఉన్నారట. రాజధాని ఆశీస్సులతోనే బాలసానికి వ్యతిరేకంగా మరో సొసైటీని సదరు అధికారి తెరపైకి తెచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు సొసైటీలలో ఇన్నాళ్లూ పోటీలో లేని ఒక సొసైటీ ఒక్కసారిగా చర్చల్లోకి రావడం వెనక హైదరాబాద్‌ స్థాయి సిఫారసులు ఉన్నట్టు టాక్‌. అందుకే జడ్పీ సమావేశంలో ఎమ్మెల్సీని నేరుగా టార్గెట్ చేసినట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఇప్పడీ సమస్య ఎమ్మెల్సీ బాలసాని వర్సెస్ డీసీవో వెంకటేశ్వరరావు అన్నట్టుగా మారిపోయింది.

గట్టిగానే పావులు కదుపుతున్న బాలసాని వ్యతిరేకులు..!

ఈ ఏడాది చివరి నాటికి బాలసాని ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిపోతుంది. తర్వాత మరో ఛాన్స్‌ ఇస్తారో లేదో తెలియదు. అందుకే ఆయన ప్రత్యర్థి వర్గాలు ఇసుక విషయంలో గట్టిగానే పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. మరి.. ఈ ఇసుక దుమారంలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.

-Advertisement-భద్రాచలం టీఆర్‌ఎస్‌లో ఇసుక దుమారం..!

Related Articles

Latest Articles