బండి సంజయ్‌ యాత్రలో కొత్త కమలాలు..!

బండి సంజయ్‌ సంగ్రామ యాత్రలో కొత్త కమలాలు కనిపిస్తున్నాయా? పాత వాసనలు.. పాతకాలపు పోకడలకు చెక్‌ పెట్టారా? లేక వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారా? మారిన పరిణామాలు పార్టీసారథికి.. బీజేపీకి వర్కవుట్‌ అవుతాయా?

సంజయ్‌ యాత్రలో కనిపిస్తున్న సిత్రాలపై చర్చ!

యాత్ర అనే పేరు లేకుండా బీజేపీని ఊహించలేం. రథయాత్ర ద్వారా దేశంలో పార్టీ బలోపేతం కావడంతో.. ఇప్పుడు తెలంగాణలో బీజేపీని పటిష్ఠం చేయడానికి ప్రజా సంగ్రామ యాత్రను నమ్ముకున్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. ఆగస్టు 28న మొదలైన ఈ పాదయాత్రపై ఇప్పుడు పార్టీవర్గాల్లో చర్చ మొదలైంది. గతంలో తెలంగాణలో వివిధ యాత్రలు, కార్యక్రమాలు చేసినప్పుడు ఎదుర్కొన్న అనుభవాలు.. ఇప్పుడు కనిపిస్తున్న సిత్రాలు చూసి కాషాయ శిబిరంలో చెవులు కొరుక్కునేవారు ఎక్కువయ్యారు.

యాత్ర కోసం స్థానికంగానే ఖర్చు భరిస్తున్నారట!

గతంలో బీజేపీ ఏదైనా కార్యక్రమానికి పిలుపిస్తే.. నియోజకవర్గాల్లోని కమలనాథులు.. హైదరాబాద్‌ ఆఫీస్‌ వైపు చూసేవారట. కార్యక్రమానికయ్యే ఖర్చు.. పార్టీ సామాగ్రి ఎప్పుడు పంపుతారు? ప్లానింగ్‌ ఏంటి అని నిత్యం టచ్‌లో ఉండేవారట. ఇక యాత్ర పేరుతో రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గాలకు వెళ్లగానే.. ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు వెళ్లి స్వాగతం పలికేవారు. కలిసి నడిచేవారు. బండి సంజయ్‌ సంగ్రామ యాత్ర మాత్రం దానికి భిన్నంగా సాగుతోందన్నది పార్టీ వర్గాల టాక్‌. యాత్ర ఖర్చు దగ్గర నుంచి.. ఏర్పాట్ల వరకు ఎవరూ పార్టీ ఆఫస్‌వైపు చూడటం లేదట. ఎక్కడికక్క నిధుల సమీకరించి పని కానిచ్చేస్తున్నట్టు సమాచారం. దీనికితోడు ఇటీవల కాలంలో బీజేపీలో చేరిన నాయకులు స్థానికంగా ఖర్చును భరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపైనే ఎక్కువగా చర్చించుకుంటున్నారు పార్టీ నేతలు.

సంజయ్‌ యాత్రలో కొత్త కమలనాథులదే సందడి!

ఇక సంజయ్‌ యాత్రలో కనిపిస్తున్న చిత్రాలు కూడా పార్టీ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నాయట. కొత్త నాయకులు సంజయ్‌తోపాటు నడుస్తున్నారు. ఫలానా ఊరు పేరు చెబితే.. అక్కడ బీజేపీ నాయకులు ఎవరో పార్టీ వర్గాలకు ఇట్టే తెలిసిపోయేది. ఇప్పుడు కొత్త వారి చేరికలతో సారథి చుట్టూ వారే కనిపిస్తున్నారు. సంజయ్‌ ఎదుట తమ సత్తా చాటేందుకు బలప్రదర్శనకు దిగుతున్నారు. దీంతో ఈ కొత్త కమలాలు ఎవరా అని సంప్రదాయ బీజేపీ వర్గాలు ఆరా తీసే పరిస్థితి ఉంది. కొత్త కాపులు ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో పార్టీకి సాయం పడతారా? లేక.. ఏదో ఆశించి కాషాయ కండువా కప్పుకొన్నవారు.. చివరకు ఆశించింది దక్కకపోతే హ్యాండిస్తారా అన్నది సంప్రదాయ కమలనాథులను కలవర పరుస్తోందట.

బీజేపీలో పాత ముఖాలకు ప్రాధాన్యం తగ్గినట్టేనా?

ప్రస్తుతం నియోజకవర్గాల్లోని బీజేపీ కమిటీలలో కొత్త ముఖాలు ఎక్కువయ్యాయి. పాత ముఖాలకు ప్రాధాన్యం తగ్గిపోతోందన్న ఫీలింగ్‌ ఉందట. మరి.. కొత్త కమలాలు ప్రస్తుతం ఉత్సాహంగా ఉన్నా.. రానున్న రోజుల్లో బీజేపీ బలోపేతానికి ఎంత వరకు సాయం పడతాయో చూడాలి.

-Advertisement-బండి సంజయ్‌ యాత్రలో కొత్త కమలాలు..!

Related Articles

Latest Articles