బండి సంజయ్‌కు ముందుంది ముసళ్ల పండగేనా…?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కొత్త సవాళ్లు ఎదురు కాబోతున్నాయా? సంగ్రామ యాత్రలో చివరి వరకు అదే ఊపు ఉంటుందా? కమలనాథులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? వారి ముందు ఉన్న ప్రశ్నలేంటి?

సంగ్రామ యాత్రపై బీజేపీ వర్గాల్లో టెన్షన్‌!

సంగ్రామ యాత్ర పేరుతో రోడ్డక్కారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. ఈ యాత్రపై పార్టీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఢిల్లీ నాయకత్వం కూడా ఎన్నో లెక్కలు వేసుకుంటోంది. కేడర్‌ను ఉత్సాహ పర్చేందుకు ఆరంభ కార్యక్రమానికి ఇంఛార్జులు వచ్చారు. మధ్యలో కేంద్ర నాయకత్వం పంపే ప్రతినిధులు వచ్చి ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చార్మినార్‌ దగ్గర సంగ్రామ యాత్ర ప్రారంభం ఆశించిన స్థాయి కంటే బాగా జరిగిందన్నది పార్టీ నేతలు చెప్పేమాట. ఇప్పుడు ఆ ఆరంభమే వారిని కలవర పెడుతోందట. అదే కాషాయ శిబిరంలో చర్చగా మారింది.

జనం సమీకరణపై పెద్ద ఎత్తున దృష్టి

ప్రస్తుతం బండి సంజయ్‌తోపాటు సంగ్రామ యాత్రలో పాల్గొనే కార్యకర్తలు.. వెంట నడిచే వారి గురించి పెద్ద ఎత్తునే లీడర్స్‌ సమీకరణ చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కడికక్కడ టార్గెట్లు ఫిక్స్‌ చేశారట. సంజయ్‌ వచ్చిన ప్రాంతంలో ఏ స్థాయిలో సమీకరణ ఉండాలి. ఎంత మందిని తీసుకురావాలి. వచ్చిన వాళ్లు ఎంత దూరం నడవాలో. వివిధ కమిటీలు పర్యవేక్షణ చేస్తున్నాయి. సంగ్రామ యాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు షెడ్యూల్‌ ప్రకారమే పనులు జరుగుతున్నా.. కమలనాథుల్లో ఎక్కడో టెన్షన్‌ పట్టుకుందట.

హైదరాబాద్‌ తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ లభిస్తుందా?

హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్క ప్రాంతాల్లో బీజేపీకి బలమైన కేడర్‌ ఉంది. అందువల్ల సంజయ్‌ సంగ్రామ యాత్రకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నాయి. ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌ బోర్డర్‌ దాటి. గ్రామీణ ప్రాంతాల్లోకి యాత్ర ఎంట్రీ ఇస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి. హైదరాబాద్‌ తరహాలో సంగ్రామ యాత్రకు ఆదరణ లభిస్తుందా లేదా అని మల్లగుల్లాలు పడుతున్నారట కమలనాథులు. ఇప్పుడు యాత్రలో ఉన్నంత మందిని చివరకు వరకు కొనసాగించకపోతే.. ప్రతికూల ప్రచారం మొదలయ్యే ప్రమాదం ఉంది. అది మరోలా చర్చకు దారితీయొచ్చు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లోకి యాత్ర వెళ్లే కొద్దీ వ్యూహం మార్చుకునే పనిలో ఉన్నారట నాయకులు.

సంగ్రామ యాత్ర ఊపు చివరి వరకు కొనసాగించడం సవాలేనా?

హైదరాబాద్‌లోనూ.. యాత్ర నగరం దాటే క్రమంలో సంజయ్‌ చేస్తున్న విమర్శలకు అధికారపార్టీతోపాటు కాంగ్రెస్‌ నుంచి రియాక్షన్లు వచ్చాయి. వైరిపక్షాలు స్పందించడాన్ని తమ సక్సెస్‌గా చెప్పుకొంటున్నారు బీజేపీ నేతలు. రేపన్న రోజున యాత్రకు ఆదరణ లేకపోతే.. ప్రత్యర్ధి పార్టీలు చేసే వ్యంగ్యాస్త్రాలకు సమాధానాలు చెప్పుకోవాలని ఆందోళన చెందుతున్నారట. సంగ్రామ యాత్ర ఒకటి రెండు రోజుల్లో ముగిసేది కాదు. చివరి వరకు ఇదే ఊపు కొనసాగించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సంజయ్‌తోపాటు బీజేపీకి చాలా అవసరం. లేదంటే ఇన్నాళ్లూ చేసిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆందోళన చెందుతున్నారట పార్టీ నేతలు. అందుకే బండి సంజయ్‌ సంగ్రామ యాత్రకు ముందు ముందు ఎదురయ్యే సవాళ్ల గురించే పార్టీ వర్గాల్లో ఎక్కువ చింతన మొదలైందట.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-