కేబినెట్‌ ప్రక్షాళనపై స్పీకర్‌ తమ్మినేని ఫోకస్‌…?

మొన్నటి ఎన్నికల్లో ఆయన గెలవగానే మంత్రి అయిపోతారని అనుచరులంతా ఫిక్స్‌ అయిపోయారు. ఎన్నో లెక్కలేసుకున్నారు. కట్ చేస్తే ఊహించని విధంగా స్పీకర్ కుర్చీలో కూర్చోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ ఆశ అలాగే ఉండిపోవడంతో… మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారట. రేసులో ఉన్నానని చెప్పడానికి సంకేతాలు పంపుతున్నారట.

కేబినెట్‌లో చోటుకోసం మళ్లీ ఆశ!

2019 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని తమ్మినేని సీతారామ్‌ చేసిన ప్రచారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కలిసి వచ్చింది. ఈ సీనియర్‌ పొలిటీషియన్‌కు సీఎం జగన్‌ కేబినెట్‌లో చోటు కల్పిస్తారని తమ్మినేని అనుచరులు ఎంతో ఆశపడ్డారు. కానీ పార్టీ అధినేత నిర్ణయంతో అనూహ్యంగా స్పీకర్ ఛైర్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. తమ్మినేని పంచ్ డైలాగ్‌లకు బ్రేక్‌ పడినట్లేనని అంతా అనుకున్నారు. ఆయన మాత్రం సందర్భమొస్తే చాలు.. టీడీపీని, ప్రతిపక్షనేత చంద్రబాబును వదిలిపెట్టడం లేదు. ఉతికి ఆరేస్తున్నారు. కేబినెట్‌లో 90 శాతం మందిని తోసేసి ఇలా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడంలో ఏ నేతా తమ్మినేని బీట్ చేయలేకపోతున్నారనే చర్చ ఈ రోజుకీ నడుస్తోంది. ఇప్పుడు కేబినెట్‌ ప్రక్షాళనలో ఎలాగైనా కేబినెట్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నారట.

ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కటే హడావిడి!

రెండున్నరేళ్లే ఆతర్వాత.. మరొకరికి అవకాశం ఇస్తానని జగన్ చెప్పిన మాటలను ఇప్పుడు తమ్మినేని గుర్తు చేసుకుంటున్నారట. పంచాయతీ ఎన్నికల్లో సైలెంట్ అయిపోయిన తమ్మినేని కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. గతంలో ఇళ్లపట్టాల పంపిణీకి బ్రేక్ పడిన సమయంలో చంద్రబాబుపై ఓ రేంజ్‌లోకామెంట్స్ చేసి చర్చల్లో నిలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నానన్న సంకేతాలు అధిష్ఠానానికి చేరేలా రోజూ మొక్కలు నాటడం.. సచివాలయాల సందర్శన, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, నాడు – నేడు స్కూల్స్ పునః ప్రారంభోత్సవాల పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకూ తెగ హడావిడి చేసేస్తున్నారు.

సీఎం నుంచి సిగ్నల్స్ వచ్చేశాయ్‌ అని అనుచరులు ప్రచారం!

ఇటీవల ఉపాధిహామీ కూలీలతో ఏకంగా పొలంగట్లపైనే ఓ రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన తీరు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఇంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. కేవలం తమ్మినేని మాత్రమే డైలీ ఫ్రేమ్‌లో కనిపిస్తుండటం వెనక బలమైన కారణం అదేనని చెవులు కొరుక్కుంటున్నారు. మొన్నా మధ్య గుళ్లూ, గోపురాలు తిరిగేసి వచ్చిన తమ్మినేని పనిలో పనిగా సీఎం జగన్‌ను కూడా కలిసొచ్చారట. అధినేత ముందు తన మనసులో మాట బయటపెట్టారని.. ఆయన కూడా సానుకూలంగా చూద్దాం అన్నా అనేశారని.. ఆమదాలవలసలో కేడర్ కోడై కూస్తోంది. సిగ్నల్స్ వచ్చేశాయ్ అందుకే తమ నాయకుడు వేగం పెంచారని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు.

కౌంటర్‌ అటాక్‌లపై వైసీపీలో చర్చ?

తమ్మినేని కూడా ప్రతిపక్షంపై రోజువారీ విమర్శల వేగాన్ని పెంచారు. ప్రభుత్వం అప్పులు చేసేస్తోందని.. ప్రతిపక్షపార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్‌ను తనదైన శైలిలో గట్టిగానే తిప్పి కొడుతున్నారు. అగ్రిగోల్డ్ చెక్కుల పంపిణీ తర్వాత కూడా చంద్రబాబును , టీడీపీ నేతలను టార్గెట్ చేసి తమ్మినేని ఇస్తున్న కౌంటర్ ఎటాక్ జిల్లా వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. కేబినెట్‌ ప్రక్షాళనకు టైమ్‌ దగ్గర పడుతున్న సమయంలో తమ్మినేని చేస్తున్న ఈ వర్కవుట్‌ ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-