ఏపీలో సీపీఐ నేతలు గేర్ మారుస్తున్నారు.. ప్రూఫ్ ఇదే..!

అవకాశం ఉన్న ఏ చోటునూ వదలకుండా విస్తరించుకుంటూ పోయేందుకు సీపీఐ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ లోనూ తమ వాణి వినిపించేందుకు.. అక్కడ సైతం జనాల్లో ఎంతో కొంత పట్టును పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే అమరావతి పోరాటంలో సీపీఐ నేతలు కాస్త క్రియాశీలకంగా ముందుకు పోతున్నారు. ఇతర సమస్యలపైనా.. ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు.

తాజాగా.. ఆ పార్టీ జాతీయ నాయకత్వం సైతం ఆంధ్రాపైనే దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ పెంచే దిశగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది. సీపీఐ జాతీయ మహాసభలను విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించింది. అన్నీ కుదిరితే.. కరోనా వంటి అడ్డంకులు ఎదురుకాకుంటే.. ముందుగా అక్టోబరు 2 నుంచి 4 వరకు.. పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అందులో ఈ సభల తేదీలను ఖరారు చేయనున్నట్టు తెలిపింది.

ఈ నెలలో 20 నుంచి 30 వరకు.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో తమ పార్టీ సైతం భాగస్వామ్యం పంచుకుంటుందని నేతలు చెబుతున్నారు. ఈ ఆందోళనలు అయిపోయాక.. ఆంధ్రాలో నిర్వహించాల్సిన సభలు, అందులో ప్రస్తావించాల్సిన జాతీయ, స్థానిక సమస్యలు.. చేయబోయే పోరాటాలను నిర్ణయించనున్నట్టు తెలిపారు. అంతే కాదు.. సెప్టెంబర్ 25 నాటికి మహిళా బిల్లు పార్లమెంటులో పెట్టి 25 ఏళ్లవుతుంది.

ఆ సందర్భాన్ని కూడా.. మహిళా రిజర్వేషన్ డే అన్న పేరుతో నిర్ణయిస్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా తెలిపారు. ఇదంతా చూస్తుంటే.. సీపీఐ నేతలు తమ పార్టీని జనాల్లోకి తీసుకుపోయేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నారన్నది అర్థమవుతోంది. కానీ.. ఇతర పార్టీల ముందు.. కమ్యూనిస్టు పార్టీ వాదనలు, బలాబలాలు ఎంతవరకూ ప్రభావితాన్ని చూపిస్తాయి.. రాష్ట్రంలో ప్రజలు ఆ పార్టీ వైపు చూస్తారా.. అన్నది ఆసక్తికరంగా మారాయి.

Related Articles

Latest Articles

-Advertisement-