రూటు మార్చిన ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు…!

ఆయన నిన్నమొన్నటి వరకు నోటికి పనిచెప్పేవారు. సడెన్‌గా ఉత్తరాలతో కొత్త రూటు ఎంచుకున్నారు. సీఎమ్‌కు వారానికో లేఖ రాసిపారేస్తున్నారు. ఈ లెటర్ల వెనక ఆంతర్యం ఏదైనా.. లేఖల ప్రభావం భారీగానే ఉందని లెక్కలు వేసుకుంటున్నారట. ఆయన ఎవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

నోటికి పని తగ్గించి… లేఖలు రాస్తున్న వీర్రాజు..!

సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు. ఆయన కామెంట్స్‌ సంచలనంగా మారిన సందర్భాలు అనేకం. కాకపోతే వీర్రాజు వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నాయనే విమర్శలు వచ్చాయి. ఇటీవలే ఆలయాల పరిరక్షణ పేరుతో ఏపీలోని గుళ్లను చుట్టేసి వచ్చారు. వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కర్నూలులో రోడ్డుపై భైఠాయించారు.. అరెస్టయ్యారు. ఇప్పుడు రూటు మార్చేశారు వీర్రాజు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైనా అడగాలని అనుకుంటే సీఎం జగన్‌కు లేఖలు రాసి పడేస్తున్నారు. నోటికి పని తగ్గించి.. రాతకు పనిపెట్టారు ఈ కమలనాథుడు. అదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చగా మారింది.

20 రోజుల్లో ఐదు లేఖాస్త్రాలు..!

సీఎం జగన్‌కు వారానికో లేఖ రాస్తున్నారు వీర్రాజు. రాజకీయ అంశాలు, పాలనలో నిర్ణయాలపై లేఖల ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఆర్ధిక శాఖ లెక్కలు తేల్చాలని కొద్ది రోజుల క్రితం లేఖాస్త్రం సంధించారు. సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మరో లెటర్‌ రాశారు. గణేష్ ఉత్సవాలపైనా ఆయన సీఎంను లేఖ ద్వారా ప్రశ్నించారు. కొందరిపై ఉన్న పోలీసు కేసుల ఎత్తివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా వీర్రాజు లేఖ పంపారు. ఇక మత్స్యకారుల సమస్యపై తాజాగా ఒక లేఖను విడుదల చేశారు బీజేపీ చీఫ్. ఈ 20 రోజుల్లోనే ఐదు లేఖలు రాశారు వీర్రాజు.

లేఖలు ప్రభావం చూపుతున్నాయని బీజేపీ నేతల భావన!

సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి లేఖలు ఉపయోగపడతాయి. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేఖ రాస్తే దానిపై చర్చ ఉంటుంది. టీడీపీ నుంచి ఇలా అనేక లేఖలు ప్రభుత్వానికి వెళ్తుంటాయి. చంద్రబాబు ఆయా అంశాలపై జిల్లా ఎస్పీలకు కూడా లేఖలు రాస్తున్నారు. అయితే బాబు లేఖలను సర్కార్‌ పెద్దగా లక్ష్య పెట్టడం లేదు. ఏపీలో ఆర్థిక వ్యవహారాలపై పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ పెద్ద చర్చే తీసుకొచ్చారు. కేంద్రం కూడా వివరణ కోరింది. కానీ వీర్రాజు లేఖ రాసిన రెండు మూడు రోజులకే ప్రభుత్వం ఆర్థిక అంశాలపై సమగ్ర ప్రకటన చేసింది. దీంతో తమ లేఖలు ప్రభావం చూపుతున్నాయని బీజేపీ నేతలు భావిస్తున్నారట. తాము అడిగితే సర్కార్‌ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని అనుకుంటున్నారట.

బదులిస్తే ఓకే.. లేకపోతే విమర్శలకు ఆస్కారం?

ఇకపైనా ప్రజా సమస్యలపై లేఖాస్త్రాలు ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రతి సమస్యపై రోడ్డెక్కి నిరసనలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని వారి వాదన. ప్రజల్లో అటెన్షన్‌ తీసుకురావడానికి లేఖలు ఉపయోగ పడతాయని లెక్కలు వేస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తే తమవల్లే అని చెప్పుకోవడానికి.. బదులివ్వకపోతే విమర్శించడానికి అవకాశం దక్కినట్టే అన్నది కమలనాథుల వ్యూహం. కొత్తలో ఈ లేఖలపై ప్రభుత్వం సమాధానం ఇచ్చినా.. భవిష్యత్‌లో కూడా అదేవిధంగా స్పందిస్తుందా అన్నది డౌటేనని పార్టీలో మరికొందరి అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-