ఏపీ ఫార్ములా: జగన్, చంద్రబాబుల ‘గెలుపే’ నిర్ణయిస్తుంది..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, నవ్యాంధ్రలుగా ఏర్పడ్డాక రాజకీయంలో స్పష్టమైన మార్పు వచ్చేసింది. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించగా.. ఏపీ మాత్రం లోటుబడ్జెట్ రాష్ట్రంగా మిగిలిపోయింది. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పినా.. అది నీటిమీద రాతలుగా మిగిలిపోయింది. హైదరాబాద్ ను తానే నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో కనీసం ఏపీకి రాజధానిని కూడా నిర్మించకపోవడం శోచనీయంగా మారింది. తన పాలనలో సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకునే బాబు అభివృద్ధి చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారనే విమర్శ వైసీపీ నుంచి ఉంది. ఏపీని సింగపూర్, జపాన్ చేస్తానన్న బాబు చివరికీ ఏపీ ప్రజలకు మొండిచేయి చూపించారంటారు. అమరావతి, పోలవరం పనుల్లో ‘బాహుబలి’ని మించి గ్రాఫిక్స్ చూపించారని.. ఎన్నికల నాటికి అమరావతి కాస్తా భ్రమరావతిగా మారడంతో ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పారని విమర్శిస్తుంటారు. అందుకే టీడీపీకి గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం 23సీట్లకే పరిమితమైంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి ప్రభంజనం సృష్టించింది. బాబు వైఫ్యలానికితోడుగా జగన్ చరిష్మా ఆ ఎన్నికల్లో పని చేసింది. దీంతో ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ 151సీట్లు గెలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి దాదాపు రెండేన్నరేళ్లు గడుస్తోంది. ఈ రెండున్నేరళ్లలోనూ వైసీపీ సర్కారు సంక్షేమానికే పెద్దపీట వేసింది. రాబోయే రోజుల్లోనూ ఆయన సంక్షేమానికే పెద్ద ఖర్చు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించే అవకాశం ఉంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు సామాన్యులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఏపీలో జగన్ సంక్షేమ పథకాలు వారికి లబ్ధి చేకూరాయి. ఈక్రమంలోనే ఆయన సంక్షేమంపై పెద్దఎత్తున ఖర్చుపెడుతున్నా.. ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రావడం లేదు సరికాదా? ప్రస్తుత సమయంలో ఆయన చేస్తుంది కరెక్ట్ అనే వాదనలు విన్పిస్తున్నాయి.

లోటుబడ్జెట్లో ఉన్న ఏపీని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా గట్టెక్కిస్తారా? ప్రశ్న తలెత్తుతోంది. అందినకాడల్లా అప్పులు చేస్తూ ప్రజలకు పంచిపెడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇకపై అభివృద్ధిపై ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి మరో మూడేళ్ల సమయం ఉండటంతో ఆయన ఏపీలో పెద్దఎత్తున అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు ఐదేళ్లలో అమరావతిని గాలికొలేయగా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను పట్టాలెక్కించారు.

కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మూడు రాజధానులు ద్వారా ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు. ఈక్రమంలోనే కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వేలకోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ మూడేళ్లలో జగన్ మూడు రాజధానులను పట్టాలెక్కిస్తేనే రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. లేదంటే బాబు మాదిరిగానే ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి సైతం చూడాల్సి వస్తుందనే టాక్ విన్పిస్తోంది.

టీడీపీ హయాంలో సంక్షేమాన్ని విడిచి అభివృద్ధిపై ఫోకస్ పెట్టగా.. జగన్మోహన్ మాత్రం సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి తర్వాత అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే రాబోయే ఎన్నికల్లో గెలుపు చంద్రబాబు, జగన్ ఇద్దరిలో ఎవరి ఫార్మూలా పనిచేస్తుంది? ఏపీ ప్రజలు ఎవరిని డిసైడ్ చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఏపీ ప్రజలు సంక్షేమం, అభివృద్ధిలో తొలి ప్రాధాన్యం ఎవరికి ఇస్తారన్నది వేచిచూడాల్సిందే..!

Related Articles

Latest Articles

-Advertisement-