ఏపీ బీజేపీ బలోపేతంపై దెబ్బ

కేంద్రంలో వరుసగా రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఏపీలో మాత్రం బీజేపీ నామమాత్రంగానే ఉంది. ఉమ్మడి ఆంధప్రదేశ్ లో కాస్తోకూస్తో బలంగా ఉన్న బీజేపీ రాష్ట్రవిభజనతో రెండు ప్రాంతాల్లోనూ పుంజుకునే పనిలో పడింది . తెలంగాణలో మాత్రం బీజేపీ క్రమంగా బలపడుతుండగా.. ఏపీలో మాత్రం ఎదుగుబొదుగు లేకుండా ఉందనే టాక్ విన్పిస్తోంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ కొత్త బీజేపీ అధ్యక్షులను బీజేపీ అధిష్టానం నియమించింది. తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూకుడుగా వెళుతోంది. ఏపీలో కొత్త అధ్యక్షుడిగా సోమువీర్రాజు నియామకమైన కొత్తలో బీజేపీలోని టీడీపీ కోవర్డులను ఏరిపారేశారు. వరుసగా కాపు నేతలను కలుస్తూ కొంత హడావుడి చేశారు. ఆ తర్వాత మాత్రం ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారిపోయింది.

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏపీ బీజేపీ సరైన డైరెక్షన్లో ఉపయోగించుకోవడం లేదనే వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో అధిష్టానం సైతం ఏపీని లైట్ తీసుకున్నట్లు కన్పిస్తోంది. పార్టీలో ఉన్న కొందరు సీనియర్లకు రాజ్యంగ పదవులు కట్టబడుతూ కథ నడిపిస్తుంది తప్పా పార్టీని పెద్దగా విస్తరించడం లేదు. ఇలాంటి సమయంలోనే ఆ పార్టీకి చెందిన ఓ కీలక నేత ఆకస్మాత్తుగా మృతిచెందడం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది.. బీజేపీకి రాష్ట్ర స్థాయిలో, విశాఖలో జిల్లాలో కీలక నేతగా లోకుల గాంధీ ఉన్నారు. ఆయన ఐఐటీ పట్టభద్రుడు, ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న సమయంలోనే బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. చాలాకాలంగా బీజేపీలో పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలో కీలక నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో బీజేపీకి లోకుల గాంధీ పెద్ద గొంతుకయ్యారు. సాధారణంగా గిరిజనులు బీజేపీకి దూరంగా ఉంటారు. వారి విశ్వాసాలు నమ్మకాలు వేరు.. బీజేపీ ఐడియాలజీ వేరు. అయితే ఆ గ్యాప్ ను దూరంచేస్తూ గిరిజనాన్ని బీజేపీవైపు ఆకర్షించడంలో లోకుల గాంధీ సక్సస్ అయ్యారు. ఈక్రమంలోనే ఆయన బీజేపీ పాడేరు అసెంబ్లీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి 17వేల పై చిలుకు సాధించారు. 2019లోనూ ఆయన పోటీ చేయగా జగన్ వేవ్ లో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన ఏజెన్సీలో పార్టీ విస్తరణకు బాగా కృషి చేశారు. మన్యంలోనే ఉంటూ ఆయన వారి కష్టాలను ప్రభుత్వం దృష్టికెళ్లేవారు. ఈక్రమంలోనే కూడా సాధారణ గిరిజనులు వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు బలి అయినట్లే లోకుల గాంధీ కూడా బలి అయ్యారు. ఇదొక్కటి చాలు ఆయన అసలైన గిరిజన నేత అని చెప్పడానికి అని స్థానికులు చెబుతున్నారు.

లోకుల గాంధీ అంతిమ యాత్రకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ డియోధర్.. రాజ్య సభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వంటి వారు వచ్చారంటే బీజేపీ ఎంతలా తల్లడిల్లుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మైదాన ప్రాంతాల్లో బీజేపీ అంతంత మాత్రంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పార్టీకి బలంగా ఉన్న లోకుల గాంధీ లాంటివారిని పార్టీ కోల్పోవడం బీజేపీకి తీరని లోటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-