వైసీపీలో గ్రూపులు ఎక్కువై అధికారులపై ఒత్తిడి పెరిగిందా…?

ఆ జిల్లాలో మొన్నటి వరకు ఒక్కరే పెత్తనం చేసేవారు. అధికారులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అధికార పార్టీలో గ్రూపులు పెరిగి.. ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. తిరుగుబాటులు మొదలయ్యాయి. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఎవరూ పట్టించుకోవడం లేదని అధికారపార్టీ నేతలు జూలు విదిల్చారా?

పదేళ్లు అధికారంలో లేం. పవర్‌లోకి వచ్చాక చెబుతాం. రెండేళ్ల క్రితం వైసీపీ నేతల వాయిస్‌ ఇది. కానీ.. సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గ్రామ, మండల స్థాయి వైసీపీ నాయకులకు పెద్దగా పనిలేకుండా పోయింది. ప్రజలకు ఏ పని కావాలన్నా వాలంటీర్లు, సచివాలయాలు ఉన్నాయి. దీంతో పార్టీ నాయకులను పట్టించుకునేవారే లేకుండా పోయారు. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇకపైనా ఇలాగే ఉంటే లాభం లేదని అనుకున్నారో ఏమో అనంతపురం జిల్లా వైసీపీ నేతలు ఒక్కసారిగా జూలు విదిలిస్తున్నారు.

చెప్పిన పని చేయకపోతే ఏసీబీకి పట్టిస్తామని బెదిరింపులు!

మండలస్థాయిలో జరిగే ప్రతిపనిలో తమ పెత్తనం ఉండాలన్నది వైసీపీ నేతల వాదన. అయితే పార్టీలోనే గ్రూపులు ఎక్కువై అంతా కలిసి అధికారులపై పడుతున్నారు. కదిరి నియోజకవర్గంలోని తలుపుల మండలంలో వైసీపీ గ్రూపు రాజకీయాలవల్ల ఒత్తిళ్లు పెరిగి అధికారులు తట్టుకోలేని పరిస్థితి వచ్చిందట. చెప్పినట్టు చేయకపోతే బెదిరించడం కామనైపోయిందట. పని చేయకపోతే ఏసీబీకి పట్టిస్తామని కూడా వార్నింగ్‌లు ఇస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నారు ఉద్యోగులు.

సామూహిక సెలవులు పెట్టిన తలుపులు మండల ఉద్యోగులు!

వాలంటీర్లను మార్చాలని ఒత్తిడి చేయడం.. పనులను తాము చెప్పిన వారికే ఇవ్వాలని వైసీపీ నాయకులు భీష్మిస్తున్నారట. దీంతో ఎంపీడీవో సహా సిబ్బంది అంతా సామూహిక సెలవు పెట్టేశారు. ఈ చర్య కలకలం రేపింది. రాజకీయ ఒత్తిళ్లతో పనిచేయలేక పోతున్నామని జడ్పీ సీఈవోకు రాసిన లేఖలో ఉద్యోగులు స్పష్టం చేశారు కూడా. ఉన్నతాధికారుల జోక్యంతో సెలవులను ఉద్యోగులు ఉపసంహరించుకున్నా.. స్థానికంగా వైసీపీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్ల తీవ్రతకు ఈ ఘటన అద్దం పడుతోంది.

వేధింపులు ఆపి.. విషం ఇవ్వాలన్న కదిరి టీపీవో

కదిరి మున్సిపాల్టీలోనూ అధికార పార్టీ నేతల అజమాయిషీ మామూలుగా లేదట. కౌన్సిల్ మీటింగ్ లో వైసీపీ కౌన్సిలర్లు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అధికారుల అవినీతి కారణంగా చెడ్డపేరు వస్తోంని ఆరోపించారు కౌన్సిలర్లు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తున్నా టీపీవో చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వెంటనే స్పందించిన టీపీవో రహమాన్ తాను అవినీతికి పాల్పడి ఉంటే నిరూపించాలని కోరారు. తనపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ వేధించడం కంటే.. కాస్త విషమివ్వండి చస్తా అని టీపీవో వాపోయారు. దీనికి కౌన్సిలర్లు మరింత భగ్గుమన్నారు. మమ్మల్నే బెదిరిస్తావా.. చెట్టుకు కట్టేస్తాం అని హెచ్చరించారు. ఈ పరిణామం ఉద్యోగులలో అలజడి సృష్టిస్తోంది.

వైసీపీ నేతల గ్రూప్‌వార్‌.. ఉద్యోగులపై ఒత్తిళ్లు!

నేతల మధ్య ఉన్న గ్రూప్‌వార్‌.. ఆధిపత్య పోరును తమపై చూపెడితే ఎలా అన్నది ఉద్యోగుల ప్రశ్న. తలుపులు, కదిరి ఘటనలు రాజకీయవర్గాల్లోనూ చర్చగా మారింది. గతంలోలా ఉద్యోగులు సహించే పరిస్థితి లేదు. మరి.. ఈ సమస్యను సర్దుబాటు చేసేందుకు జిల్లా పార్టీ నేతలు చొరవ తీసుకుంటారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-