ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ బలరాం పోస్టుకు పొగ పెట్టిన నేతలు…

ఆ జిల్లాలో ఆయన చెప్పినట్టు చేయకపోతే అంతేనట. ప్రజాప్రతినిధులతో పొసగకపోతే.. ఎంతటి వారికైనా పొగపెట్టేస్తారట. ఆ ఆస్పత్రి డైరెక్టర్‌ విషయంలో అదే జరిగిందని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. అదే ఇప్పుడు ఆదిలాబాద్‌ జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

సమస్య ముదిరి డైరెక్టర్‌ కుర్చీ కదిలింది!

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి ఇటీవల కాలంలో ఎక్కువగా వివాదాల్లో ఉంటోంది. డైరెక్టర్‌గా ఉన్న బలరాం నాయక్‌ను మార్చి కొత్తగా డాక్టర్‌ కరుణాకర్‌ను వేయడంతో మరోసారి చర్చల్లోకి వచ్చింది. ముక్కుసూటిగా ఉండటం వల్లే బలరాం పోస్టుకు నేతలు ఎసరు పెట్టారన్నది ఒక టాక్‌. రిమ్స్‌లో రాజకీయాలకు ఆస్కారం ఇవ్వలేదన్నది ఒక వర్గం చెప్పేమాట. విధి నిర్వహణ పట్ల సరిగా లేనివారిని ఉపేక్షించకపోవడంతో.. ఆయన వల్ల ఇబ్బంది పడినవాళ్లు.. రాజకీయ నేతలను ఆశ్రయించేవారు. ఆ విధంగా సమస్య ముదిరి.. నేతల జోక్యంతో డైరెక్టర్‌ సీటుకు కిందకు నీళ్లు తెచ్చారని ప్రచారం జరుగుతోంది.

సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేపై డైరెక్టర్‌ ఫైర్‌!
డైరెక్టర్‌ను తప్పించేవరకు విశ్రమించని ఎమ్మెల్యే!

ఆ మధ్య కరోనాపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నపై డైరెక్టర్‌ బలరాం నాయక్‌ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఎమ్మెల్యే పేరు చెప్పి అడిగిన వారికి రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు ఇవ్వకపోవడంవల్లే తనను టార్గెట్‌ చేశారని ఆరోపించారు కూడా. ఆ ఘటన తర్వాత ఎమ్మెల్యేకు.. డైరెక్టర్‌కు మధ్య బాగా గ్యాప్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో డైరెక్టర్‌ అంటే గిట్టని వారు ఎమ్మెల్యే పంచన చేరారు. నాటి సమీక్షా సమావేశంలో జరిగిన సంఘటనలపై కామ్‌గానే ఉన్నట్టు కనిపించిన రామన్న.. తెర వెనక పెద్ద మంత్రాంగమే నడిపించారట. బలరాం నాయక్‌ను డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించేవరకు విశ్రమించలేదట ఎమ్మెల్యే.

ఎమ్మెల్యే ఆశించినట్టు డైరెక్టర్‌ పనితీరు లేదా?

కాలం తీరిన మందుల రగడ.. సిబ్బంది చేసిన ధర్నాలు.. స్టాఫ్‌కు ఇచ్చిన మెమోలను.. ఇతర సంఘటనలను కలిపి డైరెక్టర్‌ బలరాం నాయక్‌కు వ్యతిరేకంగా ఒక ఫైల్‌ సిద్ధం చేశారట. ఆ తర్వాతే ఇక్కడి నుంచి సాగనంపారని తెలుస్తోంది. సాధారణంగా నియోజకవర్గాలలోని అధికారులు తాము చెప్పినట్టే వినాలని ఎమ్మెల్యేలు ఆశిస్తారు. కొన్నిసార్లు నిబంధనలను పక్కన పెట్టాలని కోరతారు. ఆ విధంగా పనిచేసేవారినే ఏరికోరి తమ నియోజకవర్గాలకు తెచ్చుకుంటారు. రిమ్స్‌ డైరెక్టర్‌ నుంచి కూడా అలాంటి పనితనమే ఎమ్మెల్యే ఆశించినట్టు తెలుస్తోంది. అయితే ముక్కుసూటిగా వెళ్లే బలరాం నాయక్‌ ఎమ్మెల్యేను ఖాతరు చేయలేదని చెబుతున్నారు. ఆ విధంగా మొదలైన వివాదం.. చినికి చినికి గాలివానగా మారింది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా ఈ వివాదంలో ఎమ్మెల్యే పైచెయ్యి సాధించినట్టు చెబుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-