ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తగ్గిన లెఫ్ట్‌ ప్రభావం..?

ఒకప్పుడు కమ్యూనిస్ట్‌ ఉద్యమాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కంచుకోట. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించిన కామ్రేడ్స్‌కు ఈ ప్రాంతం అడ్డా. ఇప్పుడా వైభవం లేదు. ఉనికి కాపాడుకోవడానికే లెఫ్ట్‌ పార్టీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కమ్యూనిస్ట్‌లు ఖిల్లాలో ఎందుకీ దుస్థితి? ఎర్ర జెండా అలిసిందా? వెలిసిందా? లెట్స్‌ వాచ్‌!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎర్రజెండా రెపరెపల్లేవ్‌!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్ట్‌ ఉద్యమాలకు ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కేరాఫ్‌ అడ్రస్‌. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్‌సభతోపాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకప్పుడు సీపీఐ, సీపీఎం పార్టీలదే పట్టు. బలమైన నాయకత్వంతోపాటు కేడర్‌ కూడా అంతే బలంగా ఉండేది. కార్మికులకు ఎర్ర జెండా తప్ప మరో జెండా కనిపించేదే కాదు. అలాంటి చోట ఇప్పుడు ఎర్ర జెండా రెపరెపలే లేవు. ఉద్ధండులైన వామపక్ష నాయకులు సైతం చరిత్రకే పరిమితం అయ్యారు.

గతంలోలా నేతల పోరాటాలు లేవా?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్‌ నియోజకవర్గాలు సీపీఎం డెన్‌లు. దేవరకొండ, మునుగోడు సీపీఐ కోటలు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఏ పోరాటాలు చేయాలన్నా.. ఉద్యమాలు మొదలుపెట్టాలన్నా ఉభయ కమ్యూనిస్ట్‌ పార్టీలు నల్లగొండవైపే చూసేవి. ఇప్పుడు నామమాత్రంగా మిగిలిపోయాయి సీపీఐ, సీపీఎంలు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హవా మొదలైన తర్వాత సీపీఎం కోటకు బీటలు వారాయనే చెప్పాలి. ఇప్పుడు అక్కడ లెఫ్ట్‌ వాసనలే లేవు. మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి ప్రాతినథ్యం వహించినా.. మునుపటి పోరాట పటిమ లేదు.
నోముల నర్సింహయ్య నకిరేకల్‌ నుంచి లెఫ్ట్‌ పార్టీల తరఫున గెలిచి.. తర్వాత టీఆర్ఎస్‌లో చేరడంతో ఆయనతోనే అక్కడ ఎర్రజెండాకు కాలం చెల్లిపోయింది.

నాయకులను తయారు చేసుకోలేని సీపీఐ!
సీపీఎంను దెబ్బకొట్టిన సమైక్య నినాదం!

దేవరకొండ నుంచి CPI ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రనాయక్‌ తర్వాతి కాలంలో టీఆర్ఎస్‌లో చేరిపోయారు. మునుగోడులోనూ సరైన నాయకత్వం లేకుండా పోయింది. ఈ రెండు చోట్లా సీపీఐ ద్వితీయ శ్రేణి నాయకులకు తయారు చేసుకోలేదనే విమర్శ ఉంది. రవీంద్రనాయక్ వంటి నేతలు వెళ్లిపోతే తర్వాత ఎవరన్నది ప్రశ్నగా మిగిలిపోయింది. పొత్తులు.. ఎత్తులు.. వ్యూహాలు సైతం సీపీఐని దెబ్బతీశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్య నినాదం ఎత్తుకోవడంతో CPM చతికిలపడింది. వీటన్నింటికీ తోడు నిలకడలేని రాజకీయ నిర్ణయాలు… రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడం కూడా ఈ రెండు పార్టీల ఉనికిని ఉమ్మడి జిల్లాలో ప్రశ్నార్థకం చేశాయి.

ఎన్నికల్లో నిలకడ లేని వైఖరితో నష్టపోయారా?
గతంలోలా ఉద్యమాలు చేపట్టడం లేదు!

సాధారణ ఎన్నికలు వస్తే ఏదో ఒక పెద్దపార్టీతో కలిసి సాగడం.. ఉపఎన్నికలో అనుసరించిన వైఖరి లెఫ్ట్‌ పార్టీలకు కష్టాలు తెచ్చాయంటారు జిల్లాలోని కామ్రేడ్స్‌. హుజుర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో వామపక్ష పార్టీల తీరును ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. పైగా కమ్యూనిస్ట్‌లకు ఉద్యమాలే ఊపిరి.. స్ఫూర్తి. గతంలో చేసిన ఉద్యమాల గురించి చెప్పుకోవడమే తప్ప.. కొత్తగా చేపట్టినవి నిల్‌. కార్మికుల్లోనూ పట్టు సడలుతోంది. ఇప్పుడు ఉద్యమాలంటే ఇతర పార్టీల తర్వాతే లెఫ్ట్‌ పార్టీల పేరు వినిపిస్తోంది. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడం.. కేడర్‌ను పెంచుకోవడం మానేశారనే విమర్శలు ఎర్ర శిబిరాలలోనే ఉన్నాయట. దీంతో మా తాతలు మీసాలకు సంపెంగి నూనె రాసుకునేవారన్నట్టుగా పరిస్థితి దిగజారిందని బాధపడుతున్నారట కొందరు వామపక్ష పార్టీల నాయకులు.

Related Articles

Latest Articles