అన్నవరం ఆలయంలో కుమ్ములాటలు..!

అది పవిత్ర పుణ్యక్షేత్రం. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన పాలకవర్గం.. అధికారుల మధ్య నిత్యం పోరాటాలు.. కుమ్ములాటలు. అక్రమాలకు అంతే లేకుండా పోయింది. కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతున్నా సొంత లాభానికే ప్రాధాన్యం ఇస్తున్నారట. వారెవరో.. ఆ ఆలయం ఏదో ఈ స్టోరీలో చూద్దాం.

ఆలయానికి ఆదాయం పోతున్నా పట్టదు!

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయంలో.. వ్యాపారులతో కుమ్మక్కైన కొందరు స్వార్థపరులు దేవుడికే శఠగోపం పెడుతున్నారు. కేవలం షాపుల నుంచే 3 కోట్ల పాత బకాయిలు ఉన్నా.. వసూలు చేసే ధైర్యం పాలకవర్గానికి లేదు.. ఇక్కడ పనిచేస్తున్న అధికారులకు సమస్య పట్టదు. బకాయిల వసూళ్లపై కోర్టు ఆదేశాలు ఉన్నా.. దానిని అడ్డం పెట్టుకుని లక్షలు వెనకేసుకుంటున్న పెద్ద మనసులు రత్నగిరి కొండపై చాలామంది ఉన్నారట. రెండేళ్లకోసారి కొండపై దుకాణాలు పొందేందుకు టెండర్లు పిలుస్తారు. కొత్తవాళ్లు వేలంలో పాల్గొనకుండా ధరావత్తు సొమ్ము పెంచేస్తారు. లీజు సమయం ముగియడానికి 3 నెలల ముందు వేలం నిర్వహించాల్సి ఉన్నా.. కాలాతీతం చేసి దుకాణాలు మూత పడేలా చేస్తారు కానీ.. దానివల్ల ఆలయానికి వచ్చే ఆదాయం పోతున్నా ఏమీ పట్టదు. ఆలయ పాలకవర్గంలో ఛైర్మన్‌కు, సభ్యులకు పడదు. అలాగే పాలకవర్గంలోని కొందరితో అధికారులకు పొసగదు. ఈ కుమ్ములాటలే ఆలయ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తున్నాయి.

దుకాణాల అద్దె బకాయిలు వసూలు చేయకుండా చేతివాటం!

గతంలో ఎవరైతే ఆలయానికి బకాయిపడ్డారో వారి పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గత ఈవో. ఆ బకాయిలు అలాగే ఉన్నాయి. కానీ.. కొత్తగా వచ్చిన అధికారులు ఆ ఫ్లెక్సీలను తీయించేశారు. ఎందుకలా చేశారో ఆ సత్యదేవుడికే తెలియాలి. కరోనా కారణంగా ఆలయ పరిధిలోని దుకాణాలను 243 రోజులపాటు మూసివేశారు. అయితే 82 రోజులు మినహాయించి.. మిగతా రోజులకు అద్దె కట్టాల్సిందేనని దేవస్థానం స్పష్టం చేసింది. దీనిపై కోర్టుకెళ్లారు వ్యాపారులు. న్యాయస్థానం కూడా 82 రోజులు మినహాయించి.. మిగతా రోజులకు అద్దె కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. కానీ.. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు సమస్య ఉండిపోయింది. కోర్టు ఆదేశాల తర్వాత చర్యలు చేపట్టకుండా వ్యాపారులు పెద్ద మొత్తంలోనే అధికారులకు సమర్పించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కొబ్బరిముక్కల వేలం పాటలోనే రూ.కోటి ఆదాయానికి గండి!

కోర్టు ఆదేశాలు.. లేదా ఆలయ నిబంధనల ప్రకారం చర్యలు చేపడితే దుకాణాల నుంచి వచ్చే ఆమ్యామ్యాలు ఏమీ ఉండవు. అందుకే అద్దెలో కొంత వెసులుబాటు కల్పించి.. మరికొంత తమ జేబుల్లో వేసుకునేందుకు కుట్ర చేశారట అవినీతి అధికారులు. వేలానికి నోటిఫికేషన్లు ఇవ్వడం.. వాటిని రద్దు చేయడం కుమ్మక్కులో భాగమేనని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. భక్తులు సమర్పించిన కొబ్బరిముక్కల వేలం పాట మూడు పర్యాయాలు వాయిదా పడి.. దాదాపు కోటి రూపాయల ఆదాయానికి గండి పడింది. మరో 5 నెలల్లో అన్నవరం ఆలయ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. దీంతో తమకు కలిసి వచ్చే అంశాలపై తప్ప.. మరే విషయాలను సభ్యులు పట్టించుకోవడం లేదట. మరి.. సత్యదేవుడి సన్నిధిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-