కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనూసూద్ సోదరి

కరోనా కష్టకాలంలో దేశప్రజలకు నటుడు సోనూసూద్ ఎన్నో సేవలు అందించాడు. ఒకానొక సమయంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయన సోదరి తాజాగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. సోనూసూద్ సోదరి మాళవికా సూద్ సోమవారం నాడు పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పంజాబ్‌లో ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మోగా నుంచి ఆమె పోటీ చేయనున్నారు.

సోనూసూద్ సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై పీసీసీ చీఫ్ సిద్ధూ స్పందించారు. పంజాబ్ ఎన్నికల వేళ ఆమె చేరికను గేమ్ చేంజర్‌గా అభివర్ణించారు. మాళవికా సూద్ చాలా యంగ్ అని…. అంతేకాకుండా ఆమె బాగా చదువుకున్నారన్నారని తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన మాళవికకు భవిష్యత్తులో ముందుకు సాగడానికి ఇవన్నీ తోడ్పడతాయన్నారు. ఇదే సమయంలో ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని మాళవికా సూద్ చెప్పారు. కాగా ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Related Articles

Latest Articles