సోనియా గాంధీ @ 21 ఇయర్స్‌!

2010లో సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ రికార్డు నెలకొల్పారు. అయితే అధ్యక్షురాలిగా ఆమె ప్రయాణం అక్కడే ఆగలేదు. మరో ఏడేళ్లు కంటిన్యూ అయింది. అంటే వరసగా 19 ఏళ్లు ఆమె కాంగ్రెస్‌ అధినేత్రిగా పార్టీని నడిపారు. తిరిగి 2019లో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష పగ్గాలు స్వీకరించాల్సి వచ్చింది.

జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ -ఈ నలుగురూ కలపి పార్టీని ఎన్నేళ్లు నడిపించారో..సోనియా గాంధీ ఒక్కరే దాదాపు అన్నేళ్లు సారధ్యం వహించారు. ఇప్పటికి సోనియా గాంధీ కాంగ్రెస్ చీఫ్‌గా సుమారు 21 సంవత్సరాలు పనిచేశారు. కనీసం మరో 12 నెలలు ఆ పదవిలో కొనసాగుతారు. ఆగస్టు 21 -సెప్టెంబర్ 30 మధ్య పార్టీ ఎన్నికలు జరుగుతాయని..కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని అక్టోబర్ 16 న కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ ప్రకటించింది. అప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా తానే కొనసాగుతానని సోనియా గాంధీ ప్రకటించారు. మీడియా ద్వారా తనతో మాట్లాడినందుకు అసమ్మతి వాదుల నోళ్లను ఈ ఒక్క ప్రకటనతో మూయించారు. పూర్తి కాలం అధ్యక్షురాలినని ఆమె వారికి గుర్తుచేశారు. దీంతో మరో ఏడాది పాటు కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరం వినిపించే అవకాశం లేదు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎక్కువ కాలం కాంగ్రెస్‌ అధ్యక్షులుగా పనిచేసింది గాంధీ నెహ్రూ కుటుంబీకులే. ఈ కుటుంబం నుంచి ఐదుగురు భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠం అధిరోహించారు. ఇదే సమయంలో నెహ్రూ-గాంధీ వెలుపల నుంచి పద మూడు మంది ఆ పదవిని చేపట్టారు. జే.బీ. కృపలానీ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, పురుషోత్తం దాస్ టాండన్, యూఎన్‌ దేవర్‌, నీలం సంజీవ రెడ్డి, కామరాజ్‌ నాడార్‌, నిజలింగప్ప, జగ్జీవన్ రామ్, శంకర్ దయాల్ శర్మ, డీకే బరూవా, కాసు బ్రహ్మానందం రెడ్డి, పివి నరసింహారావు, సీతారాం కేసరి పార్టీని నడిపించారు. ఐతే, 135 ఏళ్ల భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రలో అత్యధిక కాలం పార్టీ అధ్యక్షురాలిగా పనిచేసిన ఘనత మాత్ర సోనియా గాంధీకే దక్కుతుంది.

భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్ర్యానికి ముందు, తరువాత కాంగ్రెస్‌లో కీలక నాయకుడు. 1929 లో తొలిసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. అతను 1930, 1936-37, 1951-54 లో మొత్తం ఎనిమిదేళ్ల పాటు పార్టీకి సారధ్యం వహించారు. నెహ్రూ తరువాత ఆయన కూతురు ఇందిరా గాంధీ 1959 లో తొలిసారి పార్టీ అధ్యక్షురాలయ్యారు. తరువాత 1978-1984 మధ్య పార్టీని నడిపించారు. ఆమె మొత్తం ఏడేళ్లు మళ్లీ నడిపించారు. ఇందిర మరణానంతరం ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ పార్టీ అధ్యక్షుడయ్యారు. 1985 నుంచి 1991 లో మరణించే వరకు ఆయన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నారు.

మధ్యలో పీవీ నరసింహరావు ఐదేళ్లు, సీతారామ్ కేసరి రెండేళ్లు మినహాయిస్తే ..1998 – 2017 మధ్య కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోనియా తిరుగులేని ఆధిపత్యం కొనసాగించారు. 2017 లో రాహుల్ గాంధీ ఆమె నుండి బాధ్యతలు స్వీకరించే సమయానికి ఎక్కువ కాలం పనిచేసిన పార్టీ అధ్యక్షరాలుగా గుర్తింపు పొందారు. 2919లో రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఆమె తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. 543 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 52 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. పార్టీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ రాజీనామా చేశారు.

సొనియా గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షరాలు కావటం కష్టం కాకపోవచ్చు. కానీ ఆ పదవిలో ఆమె ప్రస్థానం నల్లేరు మీద నడక ఏమాత్రం కాదు. రాజకీయాల్లో జీరో అనుభవం నుంచి వచ్చిన ఆమె భారత రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. నిజానికి ఆమె పాలిటిక్స్‌లోకి వస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ రావాల్సి వచ్చింది. ఒక్కసారి ఎంటరైతే బయటపడటం అంత సులభం కాదు. ఈ విషయం ఆమెకు కూడా తెలుసు.

భర్త రాజీవ్‌ గాంధీ హత్య ఆమెను తీవ్ర కలవరానికి గురిచేసింది. ఒక దశలో పిల్లలతో ఇటలీ వెళ్లిపోవాలని అనుకున్నారని కూడా అంటారు. రాజీవ్‌ మరణం తరువాత చాలా కాలం ఇంటికే పరిమితమయ్యారు. మరణించిన కుటుంబ సభ్యలు జయంతి, వర్థంతి కార్యక్రమాలలోనే ఆమె కనిపించేవారు. రాజీవ్‌ మరణానంతరం పివి నరసింహరావు ప్రధాని అయ్యారు. పార్టీ అధ్యక్షుడు కూడా ఆయనే. ఐతే, ఎందుకో గానీ పీవీ గాంధీ ఫ్యామిలీని పెద్దగా పట్టించుకోలేదు. ఇది పీవీ-సోనియా మధ్య అంతరానికి దారితీసింది. పార్టీలోని గాంధీ విధేయం వర్గం పీవీని అనేక రకాలుగా చికాకులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో అనేక పరిణామాలు సంభవించాయి. అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి.

1996 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి గాంధీ వీర విధేయులకు అవకాశంగా మారింది. దాంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. తరువాత ఆయన స్థానంలో సీతారాం కేసరి వచ్చారు. 1998 ఎన్నికలకు పార్టీ ఆయన నేతృత్వంలో వెళ్లింది. ఓటమిపాలైంది. దీంతో తిరిగి గాంధీ కుటుంబమే దిక్కన్న వాదన పెరిగింది. సోనియా అధ్యక్ష పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్‌ పెరిగింది. ఎందుకంటే పార్టీ బతకాలంటే సోనియా గాంధీ తప్ప మరో ఆప్షన్ లేదు. కానీ ఆమె రాజకీయాల పట్ల నిరాసక్తతతో ఉన్నారు.

రాజీవ్ హత్య కేసు విచారణ నత్త నడకన సాగుతుండటం,కాంగ్రెస్ క్షీణదశకు చేరుకుంటుండటం,నెహ్రూ-గాంధీ వారసత్వంపై దాడి… ఇవన్నీ సోనియా రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన అవసరాన్ని కల్పించాయి. కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు చేపట్టడాన్ని రాజీవ్ గాంధీ పట్ల,దేశం పట్ల తనకున్న ప్రేమకు కొనసాగింపుగా ఆమె భావించారు. అలా 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచార ర్యాలీల్లో పాల్గొనడం ద్వారా సోనియా క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు.

తొంబయ్యో దశకం రెండవ సగంలో భారత రాజకీయాలలో సంకీర్ణ యుగం ప్రారంభమైంది. అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోనియా పార్టీ పగ్గాలు చేపట్టేనాటికి సంకీర్ణ రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. వాజ్‌పాయి నేతృత్వంలోని ఎన్డీయే పాలిస్తున్న రోజులు. ఆ కష్ట కాలంలో పార్టీ సమర్థవంతంగా నడిపించి 2004లో యూపీఏ సంకీర్ణ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారామె. నిజానికి ఆమే ప్రధాని అవుతారని బావించారు. కానీ శరద్‌ పవార్‌, సంగ్మా వంటి వారు అడ్డం తిరిగారు. చివరకు విధిలేక డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఎంపికచేయాల్సి వచ్చింది.

2009 ఎన్నికల్లో మరో సారి కూటమిని విజయతీరాలకు చేర్చారు. ఐతే యూపీఏ -2 కాలంలో మన్మోహన్‌ ప్రభుత్వం అనేక కుంభకోణాలతో అపఖ్యాతి పాలైంది. దాంతో 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రభంజనంలో కాంగ్రెస్‌ కొట్టుకుపోయింది. 125 ఏళ్ల పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని పరాజయం అది. 2019 ఎన్నికల్లో కూడా దాదాపు అదే పరిస్థితి.

ఒకప్పుడు దేశం నలుమూలల తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కాంగ్రెస్‌ ఓట్ల శాతం నేడు 20కి పడిపోయింది. రెండు మూడు రాష్ట్రాలకే అధికారం పరిమితమైంది. దాంతో కుమారుడు రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలన్న ఆమె కల తీరలేదు. ఏదేమైనా ప్రస్తుతం హస్తం పార్టీ గతంలో ఎన్నడూ లేనంత ఒడుదుడుకులకు లోనవుతోంది. అధికారం ఉన్నప్పుడు సోనియా కళ్లలోకి చూసి మాట్లాడటానికి భయపడిన వారు ఇప్పుడు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఐనా, ఆమె వారిని ఏమీ అనలేదు. పైగా స్నేహ హస్తం చాటారు. అందరం కలిసి పార్టీని బలోపేతాం చేద్దామని పిలుపునిచ్చారు.

మరో ఏడాది పాటు తానే అధ్యక్షురాలని తేల్చి చెప్పారు. దీంతో పార్టీలో కొంత కాలంగా వినిపిస్తున్న అసమ్మతి స్వరం ఆగింది. ఐతే, ఇదే సమయంలో పార్టీ ప్రక్షాళన దిశగా రాహుల్‌ గాంధీ చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆమె సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఆరెస్సెస్ -బీజేపీ ని సమర్థవంతంగా ఎదుర్కోవటం పాత తరం నేతలతో సాధ్యం కాదన్న భావనలో తల్లీ కొడుకులు ఉన్నారు. ఈ స్థితిలో సీనియర్లో పంచాయితీని తెగేదాక లాగవద్దని సోనియా బావిస్తున్నారు. పైగా వచ్చే ఏడాది అతి ముఖ్యమైన యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. కూతురు ప్రియాంక రాజకీయ భవిష్యత్తును కూడా ఆ ఎన్నికలు తేలుస్తాయి.

ఏరకంగా చూసినా రాజకీయంగా గాంధీ కుటుంబానికి.. సోనియా గాంధీ నాయకత్వానికి ఇది అత్యంత క్లిష్ట దశ. అందుకే ఆమె ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇన్నేళ్ల పార్టీ అధ్యక్ష అనుభవంలో ఇది ఆమెకు నిజంగా పరీక్షా సమయమే. ప్రతికూల పరిస్థితులను అధిగమించి మరోసారి కాంగ్రెస్‌ను బలమైన శక్తిగా మలచగలరా అన్నది ప్రశ్న!!

-Dr.Ramesh Babu Bhonagiri

Related Articles

Latest Articles