అతడి క్యారెక్టర్ నచ్చదు.. అందుకే అల్లుడిని చేసుకోలేదు: సోము వీర్రాజు

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అల్లుడు నరసింహంపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ వార్తలపై సోము వీర్రాజు స్వయంగా స్పందించారు. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని… వీరిలో పెద్దమ్మాయికి తాను పెళ్లిచేయలేదని వివరణ ఇచ్చారు. తనకు ఇద్దరే అల్లుళ్లు ఉన్నారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తన పెద్దమ్మాయి తానే పెళ్లిచేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. ఆమె పెళ్లిచేసుకున్న వ్యక్తికి తాను కాళ్లు కడిగి కన్యాదానం చేయలేదని… కాబట్టి అతడిని తన అల్లుడిగా ఎప్పటికీ గుర్తించలేనన్నారు. ఎందుకంటే అతడి క్యారెక్టర్ తనకు నచ్చదన్నారు. గతంలో తానే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదన్నారు. ఆ వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధం లేదని సోము వీర్రాజు తెలిపారు.

Read Also: సోము వీర్రాజు అల్లుడిపై ఫోర్జరీ కేసు

కాగా సోము వీర్రాజు కుమార్తె సూర్యకుమారి భర్త నరసింహంపై రెండు రోజుల కిందట చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్బీఐ బ్యాంకులో నరసింహం లోన్ తీసుకున్నాడని రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సోమువీర్రాజు అల్లుడు నరసింహంపై ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఈ వ్యవహారంపై సోమువీర్రాజు కుమార్తె సూర్యకుమారి కూడా స్పందించారు. తన తండ్రికి, లోన్ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. తన తండ్రితో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. పెళ్లి తర్వాత తన తండ్రి ఇప్పటివరకు తమ ఇంటికి రాలేదన్నారు. బిజినెస్ లావాదేవీల్లో భాగంగానే తాము లోన్ తీసుకున్నామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే తన భర్తపై కేసు పెట్టారని… పోలీసులు ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని సూర్యకుమారి పేర్కొన్నారు.

Related Articles

Latest Articles