జీతాలకే డబ్లుల్లేవు… మళ్లీ మూడు రాజధానులా?: సోము వీర్రాజు

జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు పరిధి నుంచి తప్పించుకోవడం కోసమే మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతిలోనే ఉంటుందని జగన్ చెప్పారని.. ఈ మాట జగన్ అన్నారో లేదో వైసీపీ నేతలంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని సోము వీర్రాజు హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు పెట్టేందుకు అసలు ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.

Read Also: బిగ్ బ్రేకింగ్…. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకున్న సర్కార్

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవని.. ఇంకా మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు. రాజధాని విషయంలో మళ్లీ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ తికమకకు గురిచేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాయలసీమ నుంచి ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేశారని.. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఒక్క హైకోర్టు ఏర్పాటు చేస్తే కర్నూలు రాజధాని అయిపోతుందా అని నిలదీశారు. రాయలసీమపై జగన్‌కు అంత ప్రేమ ఉంటే హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అసలు ఏపీ రాష్ట్రానికి వైసీపీ సర్కారు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు బండ బూతులు మాట్లాడుతూ నేతల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడేందుకే సమయం కేటాయిస్తున్నారని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.

Related Articles

Latest Articles