నాడు గ్రాఫిక్స్ అని తిట్టి… నేడు భూములు తాకట్టు పెట్టబోతున్నారు: సోమిరెడ్డి

అమరావతి కార్పొరేషన్ పేరుతో జగన్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. అమరావతి రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని… కార్పొరేషన్ పేరులోనే క్యాపిటల్ సిటీ అని పేర్కొని కొత్త కుట్రకు తెరలేపారని విమర్శించారు.

రాజధాని పరిధిలో ఎలా ముందుకెళ్లాలన్నా తమ అనుమతి అవసరం అని స్పష్టం చేసిన హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తుందని సోమిరెడ్డి ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని రైతులు కోరుకుంటున్నట్లు 29 గ్రామాలను ఒకే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక అధికారులు ఓటు హక్కు ఉన్నవారే అభిప్రాయాలు తెలపాలంటున్నారని.. మరి పులివెందులలో ఓటుహక్కు ఉన్న జగన్ అమరావతిపై నిర్ణయాలు ఎలా తీసుకుంటారని నిలదీశారు.

అమరావతి పరిధిలో ఎకరా రూ.7 కోట్లు విలువ చేస్తుందని చెప్తూ 480 ఎకరాల తాకట్టుకు ఇప్పటికే ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసిందని సోమిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తేనే రైతుల త్యాగం చేసిన 34 వేల ఎకరాల విలువ రూ.2 లక్షల కోట్ల పైబడి ఉంటుందన్నారు. నాడు స్మశానం, గ్రాఫిక్స్ అని తిట్టిన ప్రభుత్వ పెద్దలు.. నేడు రూ. 2 లక్షల కోట్ల పైబడిన అమరావతి భూములను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండానే వారి భూముల తాకట్టుపై జగన్ కన్నుపడటం దుర్మార్గమన్నారు. రైతులు పెట్టే అన్నం తింటున్న జగన్ వారినే మానసిక క్షోభకు గురిచేస్తున్నారని.. రైతుల మనోవేదనకు వ్యతిరేకంగా వెళ్తే జగన్‌ను దేవుడు కూడా క్షమించడని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

Read Also: సీఎం జగన్‌కు నారా లోకేష్‌ బహిరంగ లేఖ

Related Articles

Latest Articles