కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు

అయోధ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఆయన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా హిందూత్వాన్ని ర్యాడికల్ ఇస్లాంతో పోల్చడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు సల్మాన్ ఖుర్షీద్‌పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు నైనిటాల్‌లోని సల్మాన్ ఖుర్షీద్ నివాసానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఆయన ఇంటి అద్దాలు పగులగొట్టి, తలుపులకు నిప్పుపెట్టారు. అయితే దుండగులు తన ఇంటిపై దాడి చేసిన ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read Also: కుమారుడి పెళ్లి కోసం రోడ్డు వేయించిన తండ్రి

ఇది హిందూయిజం కానే కాదు అనడానికి ఈ విధ్వంసమే ఉదాహరణ అని సల్మాన్ ఖుర్షీద్ సదరు పోస్టులో పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని ఈ దాడి ఘటనే చెబుతోందని వివరించారు. సిగ్గు అనే పదం కూడా సిగ్గుపడేలా ఈ చర్య ఉందన్నారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోల్లో ఒక వీడియోలో కొందరు బీజేపీ జెండా ఊపుతూ ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కాగా సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. దేశం పట్ల తనకున్న విజన్‌ను గర్వించదగ్గ రీతిలో అంతర్జాతీయ వేదికలపైనా చాటిన రాజనీతిజ్ఞుడు సల్మాన్ ఖుర్షీద్ అని పేర్కొన్నారు. రాజకీయ అసహనంతో ఇలా దాడులు చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Related Articles

Latest Articles