నిత్యం కురిసే పాటల ‘సిరివెన్నెల’..

తెలుగు చిత్రసీమలో వెలసిన పాటలతోటలో ఎన్నెన్నో తేనెల వానలు కురిశాయి. అన్నీ తెలుగువారికి పరమానందం పంచాయి. ఈ తోటపై ‘సిరివెన్నెల’ కురిపించిన ఘనత మాత్రం సీతారామశాస్త్రిదే అని అందరూ అంగీకరిస్తారు. సీతారామశాస్త్రి పాటల్లోని పదబంధాలకు తెలుగు జనం ఆరంభంలోనే బందీలయిపోయారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వందల పాటల్లో సిరివెన్నెల కురుస్తూనే ఉంది. నింగిలోని చంద్రుడు కురిపించే వెన్నెల ప్రపంచానికంతా పరిచయమే, నేలపైని చెంబోలు సీతారాముడు కురిపించే సిరివెన్నెల మాత్రం తెలుగువారికి మాత్రమే సొంతం. ఒకటా రెండా సీతారామశాస్త్రి పాటల సందడిలోకి ఓ సారి తొంగిచూశామో, ఆ పాటల మాధుర్యం తలపుల మునకలో అంత త్వరగా తెలవారదు.

శైలి…
ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి తరహాలోనే సీతారామశాస్త్రి పూర్వకవుల బాణీని అనుసరిస్తూ సాగారు. అందువల్లే సీతారామశాస్త్రి గీతాల్లో ప్రబంధకవుల పంథా కనిపిస్తుంది. భక్తకవుల భక్తీ వినిపిస్తుంది. పదకవితల పరిమళమూ వీస్తుంది. శ్రీనాథుని శృంగారమూ ధ్వనిస్తుంది. వేమన వేదాంతమూ వినగలము. భావకవుల హృదయపు లోతులూ కనగలము. కాలానికి అనుగుణంగా సీతారాముని పాటల్లో అన్యదేశ్యాలూ అందంగానే అనిపిస్తాయి. ఆత్రేయ, వేటూరి తరువాత అధిక సంఖ్యలో ‘సింగిల్ కార్డ్’ చూసిన రచయితగా సిరివెన్నెల నిలిచారు. అయితే ఆయన జనం మదిని గెలిచిన తీరు అనితరసాధ్యమనే చెప్పాలి.

‘నంది’ నర్తనం!
వస్తూనే “విధాత తలపున ప్రభవించిన అనాది జీవనవేదం…” వినిపించారు సీతారామశాస్త్రి, ఆ వేదనాదం మోదం పంచింది, ఎల్లరి ఆమోదం పొందింది. అప్పటి నుంచీ సీతారాముని పాట కోసం తెలుగు సినిమానే కాదు, ప్రేక్షకులూ ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు తగ్గ పదబంధాలతో పరవశింప చేసి, ‘నంది’ వర్ధనాలు అందుకోవడంలో తనకు తానే సాటి అనిపించారు. సీతారామశాస్త్రి కంటే ముందు ఎందరో కవిపుంగవులు తెలుగుపాటకు జనం మదిలో పట్టం కట్టారు. వారి పాటకు ప్రభుత్వం పట్టం కట్టే సమయానికి కొందరి ఇంటనే ‘నంది’ వర్ధనాలు పూశాయి. సీతారాముని రాకతో వరుసగా మూడేళ్ళు ఆయన పలికించిన పాటలకు పులకించి, నంది నడచుకుంటూ వెళ్ళింది. ఇప్పటి దాకా ‘నంది’ అవార్డుల్లో ‘హ్యాట్రికానందం’ పొందిన ఘనత సిరివెన్నెలదే! సీతారాముడు ఏకాదశ రుద్రుల ప్రియభక్తుడు కాబోలు పదకొండు సార్లు ఆయన ఇంట ఇప్పటికి నంది నాట్యం చేసింది. సహస్రఫణి శేషశయనునీ స్మరించే సీతారాముని ఇంట భవిష్యత్ లోనూ ‘నంది’ నర్తనం మరింతగా కొనసాగనుందేమో!

పండితపామరుల రంజింపచేసి…
“ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం…” అంటూ పండితుల ప్రశంసలు పొందిన సీతారాముని కలం, “తెల్లారింది లెగండోయ్… కొక్కురోకో…” అంటూ పల్లవించి పామరులకు మేలుకొలుపు పాడింది. “తెలవారదేమో స్వామీ… నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలవేలు మంగకూ…” అంటూ పదమందుకుంటే పదకవితాపితామహుడే మళ్ళీ దిగివచ్చాడా అనిపించింది. “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని… అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని…” అంటూ ఆవేశంగా సీతారాముని కలం ఘీంకరించినప్పుడు ఎందరో మేధావులలో మథనం మొదలయింది. “అందెల రవమిది పదములదా…” అంటూ ఆరంభించగానే శ్రోతల ఆనందం అంబరమంటింది. “అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా?” అంటూ సిరివెన్నెల ప్రశ్నించినప్పుడు కొన్ని ముఖాలు ఆశ్చర్యం పూసుకున్నాయి, మరికొన్ని ఆందోళన వేసుకున్నాయి. ఇంకొన్ని అవునంటూ ఆ వెన్నెలలో చిందులువేశాయి. వీధుల్లో విప్లవించే గళంలా కనిపిస్తూ, వేదంలోని నాదాన్ని వినిపిస్తూ, “దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని…” అంటూ భరోసానూ ఇచ్చింది సిరివెన్నెల కలం. నీదీ నాదీ అంటూ ఏదీ లేదు ఉన్నదంతా ఒక్కటే, అది అందుకోవాలంటే “జగమంత కుటుంబం నాదీ…ఏకాకి జీవితం నాది…” అన్న సత్యాన్నీ తెలిపింది. ఇందులో విరాగం కనిపించినా, యువతకు ప్రోత్సాహమిచ్చేలా “ఎందుకొరకు… ఎంతవరకు…” అంటూ కోరుకున్న ‘గమ్యం’వైపు సాగమనీ సీతారాముని కలం బోధించింది.

ఆ బాటలోనే…
సీతారాముని పాటల్లో సంప్రదాయ రీతులే అధికంగా కనిపిస్తాయని అంటారు. మరి “బోటనీ పాఠముంది… మేటనీ ఆట ఉంది… దేనికో ఓటు చెప్పరా…” అంటూ ఆయన పలికించిన వైనాన్ని చూస్తే, ఈ తరం గీత రచయితలు ఎందరు సిరివెన్నెలలో చిందులు వేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. నవనాగరికం నాట్యం చేస్తున్న రోజుల్లో ‘పరభాషా పదాలను’ వీడి పోలేము. ముఖ్యంగా ఇంగ్లిష్ ప్రభావం నుండి తప్పించుకోలేము. అందువల్లే సందర్భానుసారంగా సీతారామశాస్త్రి సైతం “కో అంటే కోటి…” పదాలు పలికించారు. పరికించి చూస్తే ఈ సిరివెన్నెలలో ఎన్నెన్నో బాణీలు దొరుకుతాయి. వాటిని ఏరుకొనే ప్రయత్నంలోనే ఎందరో సీతారాముని పాటను పట్టుకొని, తెలుగు సినిమా పాటలతోటలోకి ప్రవేశిస్తూనే ఉన్నారు. అందరిపైనా ఆగకుండా ఈ ‘సిరివెన్నెల’ కురుస్తూనే ఉంది. తెలుగువారి మది మురిసిపోతూనే ఉంది. “వేడుకకు వెలలేదు… వెన్నెలకు కొలలేదు…” అన్నట్టు సీతారాముని ‘సిరివెన్నెల’ను ఎంతగా తలచుకున్నా కొంతే అవుతుంది. తలచుకున్న ప్రతీసారి ఆనందం మన సొంతం కాక మానదు.

Related Articles

Latest Articles