తొంభై ఏళ్ళ యువకుడు… సింగీతం!

(సెప్టెంబర్ 21న సింగీతం శ్రీనివాసరావు పుట్టినరోజు)

ప్రయోగాలు చేయడం గొప్పకాదు. వాటిని సఫలీకృతం చేసుకుంటేనే గొప్ప. చిత్రసీమలో సింగీతం శ్రీనివాసరావు పలు ప్రయోగాలు చేసి గొప్పగా నిలిచారు. వయసులో ఏముంది, మనసులోనే అంతా ఉందంటూ కాలంతో పరుగులు తీస్తున్న పడచువాడు సింగీతం. ఆయన ఆలోచనలన్నీ వర్తమానంలోనే భవిష్యత్ ను చూపిస్తూ ఉంటాయి. సింగీతం ఆలోచనల్లో 30 ఏళ్ళ క్రితం పురుడు పోసుకున్న ‘ఆదిత్య 369’ మన దేశంలో తొలి టైమ్ మిషన్ మూవీగా నిలవడమే కాదు, ఈ తరం వారినీ ఆలోచింప చేస్తోంది. దీనిని బట్టే సింగీతం పరుగు ఎలాంటిదో ఊహించవచ్చు. కేవలం దర్శకునిగానే కాదు, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా, సంగీత దర్శకునిగా, గీత రచయితగా, గాయకునిగా, నటునిగానూ తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు సింగీతం. ఇప్పటికీ ఉత్సాహంగా ఉరకలు వేయగలరు సింగీతం. అదీ ఆయన ప్రత్యేకత అని అంగీకరించాల్సిందే!

చిత్రసీమలో సింగీతం…
సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. సింగీతం ఇంటిలోనే విద్య విలసిల్లేది. ఆయన తండ్రి ఓ స్కూల్ ప్రధానోపాధ్యాయులు. తల్లి వయోలిన్ లో ప్రవీణురాలు. దాంతో చదువుల్లోనూ, కళల పట్ల చిన్నతనంలోనే సింగీతంకు ఆసక్తి కలిగింది. చిన్నప్పటి నుంచీ కొత్తగా ఆలోచించాలన్నదే సింగీతం బాణీ. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నారు. అక్కడ లైబ్రరీలో దొరికిన పుస్తకమల్లా చదివేసేవారు. నాటకాలపై ఆసక్తి పెంచుకున్నారు. పలు నాటకాలు రాశారు. ఆయన రాసిన నాటకాల్లో “బ్రహ్మ, అంత్యఘట్టం” ఎన్నదగినవి. డిగ్రీ పూర్తయ్యాక కొంతకాలం ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేశారు. ఆ సమయంలో తన విద్యార్థులతో తాను రాసిన నాటకాలు వేయించేవారు. అలా దర్శకత్వంపై మక్కువ పెరిగింది. కొంతకాలం ‘తెలుగు స్వతంత్ర’లో రచనలు చేశారు. ఆ తరువాత పట్టుదలతో చిత్రసీమలో అడుగుపెట్టారు. దిగ్దర్శకుడు కేవీ రెడ్డిని ఆశ్రయించారు. సింగీతంలోని చురుకుతనం చూసిన కేవీ రెడ్డి తన అసోసియేట్ గా అవకాశం కల్పించారు. ఈ నాటికీ మేటి చిత్రంగా నిలచిన కేవీ రెడ్డి ‘మాయాబజార్’ చిత్రానికి సింగీతం తొలిసారి పనిచేశారు. ఆ తరువాత నుంచీ కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రాలకు అసోసియేట్ గా ఉన్నారు. ప్రముఖ కవి పఠాభి కన్నడలో ‘సంస్కార’ చిత్రాన్ని రూపొందించే సమయంలో సింగీతం శ్రీనివాసరావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా తీసుకున్నారు. అలా కన్నడ చిత్రసీమతోనూ అప్పుడే అనుబంధం ఏర్పడింది.

పలు ప్రయోగాలు…
కేవీ వద్ద పనిచేసే రోజుల్లో సింగీతం శ్రీనివాసరావును యన్టీఆర్ ‘చిన్న గురూ’ అంటూ ఉండేవారు. సింగీతంను దర్శకునిగా చేయాలని యన్టీఆర్ కూడా ప్రయత్నించారు. ఎందువల్లో కలసి రాలేదు. 1972లో ‘నీతి-నిజాయితీ’ చిత్రంతో సింగీతం దర్శకునిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రాన్ని బళ్ళారికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, సంజీవరెడ్డి నిర్మించారు. ‘నీతి-నిజాయితీ’కి మంచి పేరు వచ్చిందే కానీ, ఆర్థికంగా లాభాలు చూడలేకపోయింది. రెండవ చిత్రంగా ‘ధిక్కట్ర పార్వతి’ రూపొందించారు. ఈ సినిమాకు ఉత్తమ తమిళ చిత్రంగా నేషనల్ అవార్డు లభించింది. అయితే బాక్సాఫీస్ సక్సెస్ మాత్రం సింగీతంతో దోబూచులాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రంగనాథ్, శారద జంటగా ‘జమీందార్ గారి అమ్మాయి’ చిత్రం రూపొందించారు సింగీతం. ఈ సినిమా ఫరవాలేదనిపించింది. తరువాత వచ్చిన ‘ఒక దీపం వెలిగింది’ కూడా ఆకట్టుకోలేకపోయింది. సింగీతం దర్శకత్వంలో రూపొందిన ఐదవ చిత్రం ‘అమెరికా అమ్మాయి’. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత సింగీతం తెరకెక్కించిన “తరం మారింది, పంతులమ్మ, అందమె ఆనందం, సొమ్మొకడిది సోకొకడిది!” వంటి చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. మధ్యలో కొన్ని సినిమాలు పరాజయం పాలయినా, ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. సింగీతం అంటే ప్రయోగాలు చేస్తారనే ముద్ర అప్పుడే పడింది. ఈ నేపథ్యంలోనే ఉషాకిరణ్‌ మూవీస్ సంస్థ ఆయన దర్శకత్వంలో ‘మయూరి’ రూపొందించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు సింగీతంకు మంచి పేరూ సంపాదించి పెట్టింది.

కమల్ తో సింగీతం…
‘మయూరి’ విజయంతో సింగీతంకు మరిన్ని ప్రయోగాలు చేయాలన్న అభిలాష అధికమయింది. 1988లో టాప్ హీరోస్ అందరూ ఫార్ములా మూవీస్ తో రంగురంగుల దుస్తులు ధరించి పాటల హోరులో సాగిపోతున్నారు. తమిళ స్టార్ కమల్ హాసన్ హీరోగా సింగీతం మాత్రం ‘పుష్పక విమాన’ అనే మూకీ చిత్రాన్ని రూపొందించారు. కమల్ హాసన్ సైతం ప్రయోగాలంటే ఆసక్తి చూపించేవారే కాబట్టి, సింగీతం ఆలోచనకు సై అన్నారు అలా ‘పుష్పకవిమానం’ ఎక్కి అన్ని భాషల వారినీ విజయవంతంగా పలకరించారు. సింగీతం, కమల్ కాంబోలో “విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు కథ” వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో కమల్ పలు పాత్రలు పోషించడం విశేషం. బాక్సాఫీసు వద్ద కూడా ఈ చిత్రాలు జయకేతనం ఎగురవేశాయి.

బాలకృష్ణతో సింగీతం…
తమిళంలో కమల్ తో ప్రయోగాలు చేసిన సింగీతం శ్రీనివాసరావుకు తెలుగులో అలా సాగడానికి బాలకృష్ణ దొరికారు. మాస్ హీరోగా సాగుతున్న బాలకృష్ణతో సింగీతం తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ మంచి విజయం సాధించడమే కాదు, ఈ నాటికీ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో భూతభవిష్యత్వర్తమాన కాలాల్లో టైమిషన్ లో పయనించి వినోదం పంచేలా చేశారు. ఇందులోనే బాలకృష్ణతో శ్రీకృష్ణదేవరాయలు వంటి చారిత్రక పాత్ర పోషింపచేశారు. ఆ తరువాత బాలకృష్ణతో ‘భైరవద్వీపం’ వంటి భారీ జానపదం తీసి ఘనవిజయం సాధించారు. ఆపై ‘శ్రీకృష్ణార్జున విజయం’లో బాలయ్యను శ్రీకృష్ణ, అర్జున పాత్రల్లో చూపించి మురిపించారు. ఇలా మూడు సినిమాలతోనే బాలకృష్ణతో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలు చేసిన ఘనత కూడా సింగీతం సొంతమయింది.

కన్నడనాట…
సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాల మత్తులో సక్సెస్ రేటు చిత్తయింది. కానీ, దర్శకునిగా ఆయన పేరు మారుమోగి పోయేలా చేశాయి ఆ ప్రయోగాలు. కన్నడ, తమిళ సినిమా రంగాల్లోనూ సింగీతం తెరకెక్కించిన చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. తెలుగులో బాలకృష్ణతో, తమిళంలో కమల్ తోనూ, కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ తోనూ సింగీతం చేసిన ప్రయోగాలు జనాన్ని విశేషంగా అలరించాయి. ఓ సందర్భంలో సింగీతం కన్నడ చిత్రాలకే అంకితమయ్యారు అనిపించింది. ఏడేళ్ళలో 14 సినిమాలు ఆయన దర్శకత్వంలో రూపొందగా, వాటిలో 9 చిత్రాలు కన్నడలోనే తెరకెక్కాయి. ఈ చిత్రాలను రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ నిర్మించడం విశేషం!

బహుముఖ ప్రజ్ఞ!
సింగీతం శ్రీనివాసరావు నిర్మాతగా కొన్ని కన్నడ, తమిళ చిత్రాలు రూపొందాయి. ఇక తన ‘భైరవద్వీపం’ చిత్రంలో “విరిసినదీ వసంతగానం…” పాటతో గీతరచయిత అయ్యారు. కన్నడలో రాజ్ కుమార్ నటించిన ‘భాగ్యాద లక్ష్మీ బారమ్మా’ చిత్రానికి దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించారు. రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘సంయుక్త’ చిత్రానికి దర్శకత్వం చేయకపోయినా పాటలకు స్వరకల్పన చేశారు సింగీతం. ‘మైఖేల్ మదన కామరాజు కథ’లో ఆరంభంలోనే “కథ చెబుతా… కథ చెబుతా…” అంటూ బైస్కోప్ చూపించే మనిషిగా పాట పాడుతూ నటించారు సింగీతం. “మయూరి, భైరవద్వీపం” చిత్రాల ద్వారా ఉత్తమ దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారాయన. అలాగే “మయూరి, బృందావనం” చిత్రాల ద్వారా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గానూ ఆయనకు నంది అవార్డులు లభించాయి. 2012 బి.యన్.రెడ్డి నేషనల్ అవార్డుకూ ఆయన ఎంపికయ్యారు. సింగీతం తెరకెక్కించిన అనేక చిత్రాలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితమయ్యాయి. ఇప్పటికీ తన ఆలోచనలకు అక్షరరూపం ఇస్తూ ఉంటారు సింగీతం. ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ రూపొందించబోయే చిత్రానికి సింగీతం దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు. అలాగే ‘ఆదిత్య 369’ సీక్వెల్ గా రూపొందబోయే ‘ఆదిత్య 999’కు కూడా సింగీతం స్క్రిప్ట్ లో పాలు పంచుకున్నారు.

వయసుతో నిమిత్తం లేకుండా నవతరంతోనూ వారి భావాలకు అనుగుణంగా సాగుతున్నారు సింగీతం. 90 ఏళ్ళు అన్నవి తన శరీరానికే కానీ, మనసుకు కాదు అంటారు సింగీతం. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ మరింత హాయిగా సాగాలని ఆశిద్దాం.

-Advertisement-తొంభై ఏళ్ళ యువకుడు… సింగీతం!

Related Articles

Latest Articles