అమర ప్రేమికుడు.. భార్యకు గుడి కట్టిన సిద్దిపేట వాసి

బతికి ఉన్నప్పుడు ఏ భర్తయినా..భార్యను ప్రేమిస్తాడు. ఐతే..చనిపోయిన తర్వాత కొంతమంది భర్తలు మాత్రమే భార్య జ్ఞాపకాల్లో మునిగి తేలుతుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే చంద్రగౌడ్. ఇంతకీ..ఆయన మరణించిన తన భార్యను ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా?
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్‌పల్లికి చెందిన చంద్రగౌడ్, రాజమణి భార్య భర్తలు. చంద్రగౌడ్ వృత్తిరీత్యా నిజామాబాద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి రిటైర్ అయ్యాడు. వీరికి ఇద్దరు కొడుకులు..ఒక కూతురు. చంద్రగౌడ్‌కు భార్య అంటే ఎంతో ప్రేమ. ఆమెను కంటికి రెప్పలా చూసుకునే వాడు. ఐతే…ఆరేళ్ల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందింది.

తనతో జీవితం పంచుకున్న భార్యను మర్చిపోలేకపోయాడు. ఆమెపై ఉన్న ప్రేమకు చిహ్నంగా ఆలయం కట్టించాడు. ఒక భర్త..భార్య చనిపోయిందని బాధపడకుండా విగ్రహం రూపంలోనే ఆమెను చూసుకుంటున్నాడు. ఆలయం నిర్మించడమే కాకుండా ఆమె పేరు మీద ఆశ్రమం ఏర్పాటు చేశాడు. తాను బతికి ఉన్నంతకాలం తన జీవితం భార్యకు అంకితం అంటున్నాడు భర్త చంద్ర గౌడ్. ఆమె జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన వ్యవసాయ క్షేత్రంలోనే భార్య కోసం గుడి కట్టించాడు. ఆ గుళ్లో పూజలు చేసుకుంటూ పేదలకు సాయం చేస్తున్నాడు.

ఆమె జయంతి వేడుకలను సైతం ఘనంగా నిర్వహిస్తుంటాడు. పిల్లలు నిజామాబాద్‌లో ఉంటున్నా వారి దగ్గరకు వెళ్ళకుండా గుడిలోనే ఉంటూ ఆమెతో గడిపిన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నాడు. ఇక…తల్లిదండ్రులకు సైతం గతంలో గుడి కట్టించాడు చంద్రగౌడ్. తన భార్య ఎంతో చేసిందని ఆమె సజీవంగా లేకపోయినా ఆమె ఆత్మ తనతోనే ఉంటుందని చెపుతున్నాడు. రోజు ఎవరి సాయం లేకుండానే గుడిని శుభ్రం చేస్తాడు. తనే స్వయంగా పూలు తెచ్చి అలంకరిస్తాడు. పిల్లలు సైతం అప్పుడప్పుడూ వచ్చి తల్లిని గుర్తు చేసుకుంటారు. భార్య చనిపోయిన కొన్ని రోజుల పాటు చంద్రగౌడ్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఆమెనే స్మరించుకుంటూ గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. చంద్రగౌడ్ ఆలోచనలకు గ్రామస్తులు సైతం సంబరపడిపోతున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-