కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. కారణం ఇదేనా..?

చిన్నా చితక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా సేవలు అందించినవారు కూడా ఎంతో మంది ఇప్పటికే రాజకీయాల్లో అడుగుపెట్టారు.. ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చినవారు చాలా మందే ఉన్నారు.. కొత్త ఇన్నింగ్స్‌లో చక్రం తిప్పినవారు కూడా ఉన్నారు.. కొందరు ఇప్పటికీ ప్రభుత్వాల్లో కీలకంగా పనిచేస్తుండగా.. మరికొందరు మొదట్లో కాస్త హడావిడి చేసినా.. రాజకీయరంగంలో రాణించలేక సైలెంట్‌గా ఉన్నవారు కూడా ఉన్నారు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు వదిలి నేతలైనవారు లేకపోలేదు.. ఈ మధ్యే ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్.. వీఆర్‌ఎస్‌ తీసుకుని ఆ తర్వాత బీజేపీలో చేరి చురుకుగా పనిచేస్తుండగా.. తాజాగా సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కూడా రాజీనామా చేశారు.. అయితే, ఆయన రాజీనామా చేసిన టైం చర్చకు దారితీసింది.

ఇప్పటికే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొందరి పేర్లు ఫైనల్‌ అయినట్టు సమాచారం అందుతున్నా.. అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.. ఇదే సమయంలో.. ఆశావహులు లాబీయింగు కూడా గట్టిగానే చేస్తున్నారు.. వారి వారి మార్గాల్లో ఎమ్మెల్సీ సీటు కోస ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో వెంకట్రామిరెడ్డి పేరును గులాబీ పార్టీ అధినేత పరిశీలిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. ఆయనకు దానిపై క్లారిటీ వచ్చిన తర్వాతే రాజీనామా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. వెంకట్రామిరెడ్డిపై ఆ ప్రచారం జరగడానికి కారణం కూడా లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఆయన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగినా కొన్ని పరిస్థితులు, లాబీయింగ్‌ ద్వారా అది సాధ్యం కాలేదట.. ఆ తర్వాత ఓ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలోనూ ఆయన పేరు పరిశీలించారట గులాబీ దళపతి.. ఇలా రెండు సార్లు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కోల్పోయారు.

అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయన రాజీనామా చేయడం.. ప్రభుత్వం ఆమోదం తెలపడంతో.. ఈ సారి ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలబరిలో దిగుతారనే ప్రచారం జోరందుకుంది.. మరి.. వెంకట్రామిరెడ్డి ప్రణాళికలు ఏంటో..? గులాబీ పార్టీ బాస్‌ మదిలో ఏముందో..? తెలియాలంటే.. ఈ రోజో.. రేపో తేలిపోవడం ఖాయం అంటున్నారు. కాగా, గతంలో సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ ఇలా బహిరంగంగా.. సీఎం కాళ్లకు మొక్కడమేంటన్న విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles