సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌ సంస్మరణ సభ

రండి.. మాట్లాడుకుందాం..! పన్నెండేళ్ల తర్వాత నాటి వైఎస్‌ మంత్రివర్గంలో ఉన్నవారికి.. YSతో సన్నిహితంగా మెలిగినవారికి పిలుపులు వెళ్తున్నాయి. రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ఆత్మీయ సమ్మేళనం అని చెబుతున్నా.. కార్యక్రమం వెనక ఉద్దేశాలు ఏంటన్నది ఆసక్తిగా మారింది.

సెప్టెంబర్‌ 2న ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు. ఒకవైపు హుజురాబాద్ ఉపఎన్నిక. ఇంకోవైపు టీపీసీసీ అధ్యక్షుడి వరస బహిరంగసభలు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర. ఇదే టైమ్‌లో 12 ఏళ్ల క్రితం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ సహచరులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు వైఎస్‌ విజయమ్మ. సెప్టెంబర్ 2న వైఎస్‌ వర్ధంతి సందర్భంగా హైటెక్స్‌లో ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఆహ్వానితల జాబితాలో ఏపీ, తెలంగాణ నేతలు ఉన్నారు.

సమావేశానికి మండలి మాజీ ఛైర్మన్‌ చక్రపాణి నేతృత్వం!

పార్టీలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని విజయమ్మ ఆహ్వానాలలో తెలియజేశారు. కేవలం నాటి కేబినెట్ మంత్రులే కాకుండా.. వైఎస్‌కు అత్యంత ఆప్తులు, నమ్మకస్తులను కూడా ఇన్వైట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో స్పీకర్‌గా పనిచేసిన సురేష్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్‌తోపాటు మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నారట. ఈ సమావేశానికి ఉమ్మడి శాసనమండలి మాజీ ఛైర్మన్‌ చక్రపాణి నేతృత్వం వహిస్తున్నట్టు సమాచారం. ఏపీ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వస్తున్నారట. అలాగే రిటైర్డ్‌ ఐపీఎస్‌లు.. ఐఏఎస్‌లకు ఆహ్వానాలు వెళ్లాయట. సినీవర్గం నుంచి హీరో నాగార్జునతోపాటు డైరెక్టర్లు పూరీ జగన్నాథ్‌, వీవీ వినాయక్‌ల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయట.

ఆత్మీయ సమ్మేళనం సంకేతాలేంటి?

ఈ ఆత్మీయ సమ్మేళనం ఇప్పుడు రాజకీయ ఊహాగానాలకు అవకాశంగా మారింది. తెలంగాణలో షర్మిల పెట్టిన YSR తెలంగాణ పార్టీ వెళ్లూనుకోవడానికి చూస్తోంది. ఇదే టైమ్‌లో ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. నాటి షర్మిల పార్టీ ఏర్పాటు సభకు విజయమ్మ కూడా వచ్చారు. అందుకే ఇప్పుడు విజయమ్మ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. నాడు.. వైఎస్‌తో కలిసి కాంగ్రెస్‌లో పనిచేసిన వారు ఇప్పుడు వేర్వేరు పార్టీలలో ఉన్నారు. వారంతా వస్తే.. ఎలాంటి సంకేతాలు ఇస్తుంది. కేవలం వైఎస్‌ సన్నిహితుల ఆత్మీయ సమ్మేళనానికే సమావేశం పరిమితం అవుతుందా? లేక ఇతరత్రా రాజకీయ చర్చకు వేదిక అవుతుందా అన్నది ప్రశ్న.

ప్రశాంత్‌ కిశోర్‌ సూచనలతోనే ఆత్మీయ సమ్మేళనం?

ఆహ్వానితుల జాబితాలో ఉన్న కొందరు తాము రాలేమని చెప్పేశారట. కానీ తమ సహకారం ఉంటుందని చెప్పారట. ఆ సహకారం ఏంటన్నదే మిస్టరీ. పైగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన సూచనల్లో భాగంగానే ఆత్మీయ సమ్మేళం ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతోంది. పీకే బృందంలోని శిష్యురాలు ఒకరు ప్రస్తుతం షర్మల పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. ఒకవేళ పీకే సూచనల మేరకే సెప్టెంబర్‌ రెండు భేటీ ఏర్పాటు చేసి ఉంటే తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలి. భేటీకి ఎంత మంది వస్తారు అన్నదీ చర్చే. అందుకే అందరి దృష్టీ సెప్టెంబర్‌ 2 నాటి ఆత్మీయ సమ్మేళనంపై ఉంది.

Related Articles

Latest Articles

-Advertisement-