రివ్యూ: షేంగ్ – ఛీ అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్

హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ను విశేషంగా ఆదరించే తెలుగువారు చాలామందే ఉన్నారు. వారి కోసమే అనేకానేక చిత్రాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. అలా మార్వెల్ కామిక్ బుక్స్ నుండి వెండితెరపైకి వచ్చింది ‘షేంగ్ – ఛీ అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్’ సినిమా. ఈ సూపర్ హీరో మూవీ శుక్రవారం భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది.

మానవాతీత శక్తులు కలిగిన టెన్ రింగ్స్ వెన్వు (టోనీ ల్యూంగ్) అధీనంలో ఉంటాయి. దాంతో అతను సర్వశక్తి సంపన్నుడు అవుతాడు. టెన్ రింగ్స్ కు ఉన్న అసాధారణ శక్తి కారణంగా వెన్వు ఓ పెద్ద సామ్రాజ్యాన్నే నిర్మిస్తాడు. ప్రపంచంలోనే అతి వింతైన తాలూ గ్రామానికి వెన్వు వెళ్ళినప్పుడు అతనికి జియాంగ్ లీ (ఫలా చెన్) అనే యువతి తారసపడుతుంది. దైవీక శక్తులు ఉన్న జియాంగ్ లీ ముందు వెన్వు చేతిలో ఉన్న టెన్ రింగ్స్ ఎలాంటి ప్రభావం చూపించలేకపోతాయి. జియాంగ్ లీతో ప్రేమలో పడిన వెన్వు నేర ప్రవృత్తిని, అధికార కాంక్షను వదిలి ఆమెను వివాహం చేసుకుని సాధారణ జీవితాన్ని గడుపుతాడు. కానీ తాలూ గ్రామ పెద్దలు మాత్రం వీరి పెళ్ళిని అంగీకరించకుండా, గ్రామం నుండి బహిష్కరిస్తారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు కొడుకు షేంగ్ – ఛీ (సిము లియు), కూతురు జియా లింగ్ (మెంగేల్ జాంగ్)కు జన్మనిచ్చి జియాంగ్ లీ కన్నుమూస్తుంది. తన భార్య మరణానికి కారకులైన తాలూ గ్రామవాసులపై కక్షపెంచుకుంటాడు వెన్వు. గతంలో వదిలేసిన టెన్ రింగ్స్ ను తిరిగి ధరిస్తాడు. పాత జీవితాన్ని ప్రారంభిస్తాడు. కొడుకు షేంగ్ – ఛీ ని తన పగ తీర్చుకోవడానికి ఆయుధంగా మలుస్తాడు. అయితే… తండ్రి మాటలను ధిక్కరించి టెన్ రింగ్స్ ఆర్గనైజేషన్ ను వదిలేసి షేంగ్ – ఛీ కాలిఫోర్నియాలో సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. భార్య ఆత్మను సాక్షాత్కరింప చేసుకోవడానికి తాలూ గ్రామ శివార్లలోని చీకటి రాకాసీ గుహకు వెళ్ళాలనుకున్న వెన్వు కోరిక నెరవేరిందా? యుక్త వయసులో చెల్లిని వదిలేసి వచ్చిన షేంగ్ – ఛీ ఆమెను కలుసుకున్నాడా? షేంగ్ – ఛీ గతం గురించి ఏ మాత్రం తెలియకుండానే అతనంటే మనసు పడిన కాటీ (ఆక్వా ఫినా) జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే ఈ చిత్ర కథ.

‘షేంగ్ -ఛీ అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్’ బేసికల్ గా సూపర్ హీరో సినిమా. అయితే…. ఇది కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కు మాత్రమే పరిమితమైన చిత్రం కాదు… కావాల్సినంత వినోదంతో పాటు ఆకట్టుకునే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చిన 25వ సూపర్ హీరో చిత్రమిది. గత కొంతకాలంగా ఈ సినిమాపై భారీ అంచనాలతో కూడిన ప్రచారం జరుగుతోంది. ‘షేంగ్ – ఛీ’, అతని తండ్రి వెన్వు ఆధీనంలో ఉండే టెన్ రింగ్స్ కు సంబంధించిన కామిక్స్ ఇప్పటికీ పాపులర్. దాంతో సినిమాపైనా మార్వెల్ కామిక్ సీరిస్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను నిరాశ పరిచేలా అయితే సినిమా లేదు. ఇందులో ఫాదర్, మదర్, సిస్టర్ సెంటిమెంట్స్ కు కొదవలేదు.

ఏషియన్ ఆర్టిస్టులు అత్యధికంగా ఉన్న ఈ సినిమాలో నటీనటుల నటన పెద్దంత చెప్పుకోదగ్గదిగా లేదు. అయితే… దానిని యాక్షన్ ఎపిసోడ్స్ తో దర్శకుడు డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ కవర్ చేసేశాడు. సాంకేతిక నిపుణులలో అగ్రస్థానం యాక్షన్ కొరియోగ్రాఫర్ కు, ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ విలియమ్ పోప్, సంగీత దర్శకుడు జోయెల్ ప్వెస్ట్ కు ఇవ్వాల్సి ఉంటుంది. సినిమా ప్రథమార్ధంలో కాలిఫోర్నియాలో బస్ లో జరిగే పోరాటం, హీరో చెల్లిని వెతుక్కుంటూ మకావ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి బహుళ అంతస్తుల భవంతిలో జరిగే యాక్షన్ సీన్స్ రోమాంచితంగా ఉన్నాయి. క్లయిమాక్స్ లో చీకటి రాకాసితో హీరోతో పాటు తాలూ గ్రామ వాసులు జరిపే పోరాటం మూవీకి హైలైట్. విజువల్ వండర్ గా ఈ యాక్షన్ సినిమాను కెవిన్ ఫిగే, జోనాధన్ స్క్వార్జ్ బాగానే నిర్మించారు. అలానే హీరో బృందం అడవి మార్గం గుండా తాలూ గ్రామానికి చేరుకునే సన్నివేశాలూ గగుర్పొడిచేలా ఉన్నాయి. మొత్తంగా యాక్షన్ ప్రియులను ‘షేంగ్ – ఛీ అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్’ మెప్పిస్తుందని చెప్పొచ్చు. అయితే… అవుట్ అండ్ అవుట్ హాలీవుడ్ యాక్షన్ సినిమాలను చూసే వారికి ఈ సూపర్ హీరో సినిమా ఆ స్థాయిలో లేదనే కొద్ది పాటి నిరాశ కూడా కలిగే ఆస్కారం ఉంది.

ప్లస్ పాయింట్స్

  • భావోద్వేగ సన్నివేశాలు
  • యాక్షన్ కొరియోగ్రఫీ
  • విజువల్ ఎఫెక్ట్స్
  • పతాక సన్నివేశాలు

మైనెస్ పాయింట్

  • బలహీనమైన కథ
  • నటీనటుల నటన

ట్యాగ్ లైన్: యాక్షన్ ప్రియుల కోసం…

రేటింగ్ : 2.75 / 5

SUMMARY

Shang-Chi and the Legend of the Ten Rings Review

Related Articles

Latest Articles

-Advertisement-