దక్షిణాది నాయికలపై షారుఖ్ ఆసక్తి!

గత కొంతకాలంగా వరుస పరాజయాలతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కెరీర్ గ్రాఫ్ కిందకి పోతోంది. దానిని పైకి లేపాలని ఎంత ప్రయత్నిస్తున్నా షారుఖ్ వల్ల కావడం లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తన ఆశలన్నీ సిదార్థ్‌ ఆనంద్ తెరకెక్కిస్తున్న ‘పఠాన్’మూవీపై పెట్టుకున్నాడు. అంతేకాదు… ఆ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్న సినిమా కూడా తనకు కలసి వస్తుందనే విశ్వాసంతో ఉన్నాడు. ఈ సినిమాను షారుఖ్‌ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నాడట. హిందీ మూవీకి ‘రాజవర్థన్ ఠాగూర్’ అనే పేరును అనుకుంటున్నారు. అలానే తెలుగు వర్షన్ కు ‘కత్తి కొండలరాయుడు’, తమిళ వర్షన్ కు ‘వేలుస్వామి మురుగన్’ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

హిందీలో ఫ్లాపుల పర్వం కొనసాగుతున్నా షారుఖ్ ఖాన్ కు ఉన్న మార్కెట్ చెదిరిపోలేదు. అలానే తమిళంలో అట్లీకి దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది కాబట్టి… ఆ వర్షన్ గురించి కూడా షారుఖ్ ఖాన్ కు చింతలేదు. ఎటొచ్చి… తెలుగు జనాలను మెప్పించాలంటే తన ఛరిష్మా, అట్లీకి ఉన్న పేరు సరిపోదన్నది షారుఖ్ అభిప్రాయమట! అందుకనే పాపులర్ తెలుగు స్టార్ హీరోయిన్ కోసం షారుఖ్‌ అన్వేషణ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే నయనతారకు భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా ఇవ్వడానికి సిద్ధపడ్డారట. కానీ ఇంతవరకూ బాలీవుడ్ బాట పట్టని నయన్ కాస్తంత తటపటాయిస్తోందని అంటున్నారు. అయితే అట్లీతో ఉన్న అనుబంధం కారణంగా నయన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చనే వార్తలూ వస్తున్నాయి.

ఒకవేళ నయన్ కాదంటే… సమంత ను ఆల్టర్నేటివ్ గా అనుకుంటున్నారట. సమంత సైతం ‘ఫ్యామిలీ మ్యాన్ -2’ వెబ్ సీరిస్ లో చేసింది తప్పితే, స్ట్రయిట్ హిందీ సినిమా ఒక్కటీ చేయలేదు. అందువల్ల సమంత కూడా వెనకాడితే ఏమిటీ పరిస్థితి అనే అనుమానం అటు అట్లీ, ఇటు షారుఖ్ ఖాన్ కు లేకపోలేదు. ఇదే సరైన సమయంగా భావించిన పూజా హెగ్డే, రాశీఖన్నా, రశ్మిక మందణ్ణ వంటి యంగ్ హీరోయిన్స్ కూడా తమ అదృష్టం పరీక్షించుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. మరి ఈ అందాల భామలలో ఎవరిని షారుఖ్ ఎంపిక చేస్తాడో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-