భళా అనిపించిన రోజా!

సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రోజా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. తెరపై అందాలతారగా జనానికి శ్రీగంధాలు పూసిన రోజా, కొన్ని అరుదైన పాత్రల్లోనూ అభినయంతో అలరించారు. మాతృభాష తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళంలోనూ తనదైన బాణీ పలికించారు రోజా. రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు రోజా. ఇక బుల్లితెరపై ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు సైతం ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్నాయని చెప్పవచ్చు.

రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. 1972 నవంబర్ 17న తిరుపతిలో జన్మించారు. పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. హైదరాబాద్ మకాం మార్చిన తరువాత కూచిపూడిలో శిక్షణ పొందారు. తిరుపతికే చెందిన నటుడు డాక్టర్ శివప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ తపస్సు’ చిత్రంతో రోజా తెరంగేట్రం చేశారు. తమిళంలో ఆర్.కె.సెల్వమణి దర్శకత్వంలో రోజా నటించిన ‘చెంబరుతి’ మంచి విజయం సాధించి, ఆమెకు నాయికగా పేరు సంపాదించి పెట్టింది. తెలుగులో “సర్పయాగం, సీతారత్నంగారి అబ్బాయి, ముఠా మేస్త్రీ, పోలీస్ బ్రదర్స్, అన్న, శుభలగ్నం, ముగ్గురు మొనగాళ్ళు, ఘటోత్కచుడు, అన్నమయ్య, సంభవం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశా” వంటి చిత్రాలలో అలరించారు రోజా. ఇక బాలకృష్ణతో రోజా జోడీ కట్టిన “భైరవద్వీపం, బొబ్బిలిసింహం, శ్రీకృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్” చిత్రాలలో నటిగా మురిపించారామె. ‘స్వర్ణక్క’ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డును దక్కించుకున్నారు రోజా. ఇప్పటికీ అడపా దడపా తెరపై కనిపిస్తూనే ఉన్నారామె. ఆమె న్యాయనిర్ణేతగా సాగే ‘జబర్దస్త్‌’ కార్యక్రమం విశేషంగా అలరిస్తోంది. ‘బతుకు జట్కా బండి’ వంటి కార్యక్రమాల్లోనూ రోజా తనదైన బాణీ పలికించారు.

‘చెంబరుతి’తో తనకు మంచి పేరు సంపాదించి పెట్టిన దర్శకుడు సెల్వమణిని రోజా వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి, ఆ పార్టీకి చెందిన ‘తెలుగు మహిళ’కు అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ పార్టీ టిక్కెట్ పై 2009లో చంద్రగిరి నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తరువాత జగన్ మోహన్ రెడ్డి నెలకొల్పిన వైసీపీలో చేరారు. 2014, 2019లో వరుసగా రెండు సార్లు నగరి నుండి వై.సి.పి. టిక్కెట్ పై గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్టర్ కార్పోరేషన్ ఛైర్ పర్సన్ గా రెండేళ్ళు ఉన్నారు. పంచులు దంచడంలో మేటి అనిపించుకున్న రోజా, రాజకీయాల్లోనూ తనదైన బాణీ పలికించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఆమె సిద్ధంగానే ఉన్నారు.

Related Articles

Latest Articles