వైవిధ్యంతో సాగిన టిన్నూ ఆనంద్

(అక్టోబర్ 12న టిన్నూ ఆనంద్ పుట్టినరోజు)
టన్నుల కొద్దీ ప్రతిభ ఉన్న ఘనుడు టిన్నూ ఆనంద్. దర్శకునిగా, రచయితగా, నటునిగా, నిర్మాతగా టిన్నూ ఆనంద్ చిత్రసీమలో తనదైన బాణీ ప్రదర్శించారు. హిందీ చిత్రసీమలో టిన్నూ ఆనంద్ తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. దక్షిణాది భాషల్లోనూ టిన్నూ ఆనంద్ నటించి మురిపించారు. ‘ఆదిత్య 369’లో టైమ్ మిషన్ ను తయారు చేసిన ప్రొఫెసర్ రామదాసుగా ఆయన నటించారు. ‘పుష్పక విమానం’, ‘ముంబయ్’, ‘నాయకుడు’ వంటి మరికొన్ని దక్షిణాది చిత్రాల్లోనూ టిన్నూ అభినయం ఆకట్టుకుంది.

టిన్నూ ఆనంద్ అసలు పేరు వీరేందర్ రాజ్ ఆనంద్. 1945 అక్టోబర్ 12న ఆయన జన్మించారు. టిన్నూ తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ ఆ రోజుల్లో పేరు మోసిన రచయిత. రాజ్ కపూర్ “ఆగ్, ఆహ్, అనారీ, సంగం” వంటి చిత్రాలకు ఇందర్ రాజ్ ఆనంద్ రచన చేశారు. ఆయనకు చిత్రసీమలో మంచి పేరుండేది. టిన్నూ ఆనంద్ తాను డైరెక్టర్ ను అవుతానని తండ్రితో చెప్పినప్పుడు, ఆయన టిన్నూను తీసుకు వెళ్ళి విఖ్యాత దర్శకులు సత్యజిత్ రే వద్ద చేర్పించారు. సత్య జిత్ రే వద్ద “గోపీ గైన్ బాగా బైన్, అరణ్యేర్ దిన్ రాత్రి, ప్రతిధ్వని, సీమబద్ధ, ఆషనీ సంకేత్” చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు టిన్నూ. కె.ఏ.అబ్బాస్ రూపొందించిన ‘సాత్ హిందుస్థానీ’లో అమితాబ్ బచ్చన్ నటించడానికి కారకులు టిన్నూ ఆనందే. ఆ కారణంతోనే టిన్నూ దర్శకత్వం వహించిన పలు చిత్రాలలో అమితాబ్ నటించారు.

టిన్నూ ఆనంద్ 1979లో ‘దునియా మేరీ జేబ్ మే’ చిత్రంతో దర్శకుడయ్యారు. ఈ చిత్రానికి ఆయన తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ రచన చేశారు. ఆయన సోదరుడు బిట్టూ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తరువాత అమితాబ్ బచ్చన్ హీరోగా ‘కాలియా’ రూపొందించారు టిన్నూ. ఈ చిత్రం మంచి విజయం సాధించి, టిన్నూకు దర్శకునిగా పేరు సంపాదించి పెట్టింది. తరువాత అమితాబ్ తో “షెహెన్ షా, మై ఆజాద్ హూ, మేజర్ సాబ్, ఏక్ హిందుస్థానీ” వంటి చిత్రాలు తెరకెక్కించారు టిన్నూ. “యే ఇష్క్ నహీ ఆసమ్, జీనా తెరీ గలీ మే” వంటి చిత్రాలు సైతం ఆయన దర్శకత్వంలో వెలుగు చూశాయి. నటునిగా, దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా సాగిన టిన్నూ ఆ తరువాత నటనలోనే ఎక్కువగా సంతృప్తి చెందారు. అనేక హిందీ చిత్రాలలో నటునిగా తనదైన ముద్ర వేశారు టిన్నూ.

-Advertisement-వైవిధ్యంతో సాగిన టిన్నూ ఆనంద్

Related Articles

Latest Articles