భరణి బహుముఖ ప్రజ్ఞ!

(జూలై 14న తనికెళ్ళ భరణి పుట్టినరోజు)
“ఆట కదరా శివా… ఆట కద కేశవా…” అంటూ ఈ తరం వారికి మరచిపోయిన మన సంప్రదాయంలోని మహాత్యాన్ని బోధిస్తున్నారు నటదర్శక రచయిత తనికెళ్ళ భరణి. ‘భూగోళమంతా ఓ నాటకరంగం… మనమంతా పాత్రధారులం…’ అన్నారు శాస్త్రకారులు. నిజమే! మనమంతా కనిపించని శక్తి చేతిలో ఆటబొమ్మలం. ఆ ఆట ఆడించేవాడు శివుడు అంటారు. ఆడించేది కేశవుడూ అనీ చెబుతారు. రచన, నటన రెండు కళ్ళుగా సాగుతున్న తనికెళ్ళ భరణి ఆడించేవారు ‘శివకేశవులు’ అంటూ రాగం తీస్తారు. శివుడు, కేశవుడు రూపభేదం- అది మానవ భ్రాంతి. ఉన్నది ఒక్కడే! హరియైనా, హరుడైనా ఒక్కటే అన్నదే భరణి భావన. భరణి కలం పలికించగా, ఆయనే గానం చేసిన “ఆట కదరా శివా” విశేషాదరణ పొందుతోంది. భరణి రచనలో రూపొందిన మరో ఆధ్యాత్మిక జ్యోతి “శభాషురా శంకరా” కూడా అలరిస్తోంది. ఇక తన కలం బలంతో భరణి సాగిన తీరు, నటనతో రాణించిన వైనం సైతం భావితరాలకు స్ఫూర్తి కలిగిస్తున్నాయి.

బాల్యం నుంచీ మాతృభాష తెలుగుపై భరణికి మమకారం మెండు. అలాగే చదువుకొనే రోజుల్లోనే హిందీ, ఆంగ్ల భాషల్లోనూ పట్టు సాధించారు. దొరికిందల్లా చదివారు. ఊహకొచ్చిందల్లా రాసేశారు. అదే ఆయనను రచయితగా మార్చింది. ప్రముఖ నటుడు రాళ్ళపల్లి పరిచయంతో మరింతగా చదివారు. రాళ్ళపల్లి సూచనతో చెన్నై చేరి ‘కంచు కవచం’తో మాటల రచయితగా మారిపోయారు. ఆ తరువాత నుంచీ మాటలు పలికిస్తూ ఆకట్టుకుంటూ సాగారు. వంశీ ‘లేడీస్ టైలర్’కు ‘జ’ భాష నేర్పించడమే కాదు, అందులో తానూ ఓ పాత్రలో చొరబడిపోయారు భరణి. అలా ఆరంభమైన రచన, నటనతో భరణి భలేగా సాగారు. తరువాత రాయడానికే సమయం సరిపోనంతగా నటనలో బిజీ అయిపోయారు. ఇంకేముంది, వందలాది పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. ‘సముద్రం’లో ప్రతినాయకునిగా ప్రదర్శించిన నటనకు ‘బెస్ట్ విలన్’గా నంది లభించింది. ‘నువ్వు-నేను’లో కనబరచిన అభినయానికి ‘బెస్ట్ కేరెక్టర్ యాక్టర్’గానూ నంది వరించింది. భరణి ధరించిన పలు పాత్రల్లో ఆయన కనిపించలేదు, ఆ పాత్రలే మన ముందు కదలాడాయి.

రచన, నటనతోనే కాదు మెగాఫోన్ పట్టినా, అందులోనూ తన మార్కు ప్రదర్శించారు భరణి. “సిరా, కీ, బ్లూ క్రాస్, ద లాస్ట్ ఫార్మర్” వంటి లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాక భరణి ‘మిథునం’ కథా చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీరమణ రాసిన ‘మిథునం’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో భరణి మార్కు మాటలు ఆయనకు ఉత్తమ సంభాషణల రచయితగానూ నందిని అందించాయి. కేవలం రెండు పాత్రలతోనే రూపొందిన ‘మిథునం’లోనూ మన సంస్కృతీ సంప్రదాయాలను ముచ్చటించిన తీరు జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తూ భలేగా సాగుతున్న భరణి మరిన్ని మంచి పాత్రలతోనూ, తనదైన రచనలతోనూ మనలను పలకరిస్తారని ఆశిద్దాం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-