నీ చిత్రం చూసి: ఈ కాలం ‘లవ్ స్టోరీ’కి కలిసొస్తుందా?

కథ, కథనం బాగుంటే తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్స్ కి ఏమి ఢోకా లేదని ఇప్పటికే చాలా సినిమాలు రుజువుచేశాయి. కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్ల పట్ల అభిమానుల్లో ఆసక్తి వున్నా సరైన సినిమా రాలేదనిది ఓ వర్గ అభిమానుల ఆవేదన.. కరోనా సెకండ్ వేవ్ తరువాత ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో ఒకటి, రెండు మాత్రమే ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. పెద్ద సినిమాలు ఏవి రాకపోవడంతో కాస్త నిరాశగానే వున్నారు. అయితే ఓ క్లాసిక్, సెన్సిబుల్ డైరెక్టర్ సినిమాపై అందరికి ఆసక్తి నెలకొంది.

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. వినాయకచవితి సందర్బంగా సెప్టెంబర్ 10న థియేటర్లోకి రానుంది. ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం కరోనా ఓ కారణం అయితే.. ఓటీటీ చర్చలతో కూడా మరింత కాలాన్ని సాగదీశారు. మరి ఈ చిత్రానికి ఈ కాలపరీక్ష కలిసొస్తుందా.. లేదా అనడానికి ఆసక్తికరమైన కారణాలు కనిపిస్తున్నాయి.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల గూర్చి అభిమానులకు తెలియంది కాదు.. ఆయన సినిమాలు ఎలా వుంటాయో ప్రేక్షకులు అంచనా వెయ్యగలరు. ఇక లవ్ స్టోరీ నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్ కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. చాలా రోజుల నుంచి ఈ సినిమా నుంచి అప్డేట్ లేకున్నాను ప్రేక్షకులు ఓపిగ్గానే ఎదురుచూస్తున్నారు. అయితే ‘ఉప్పెన’ సినిమాకు కూడా ఇలాంటి ఆలస్యమే ఆ సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఉప్పెన పోస్టర్లు, పాటలు కూడా అభిమానుల్లోకి బాగా వెళ్ళడంతో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలిగింది. లవ్ స్టోరి కూడా ప్యూర్ ప్రేమకథే కావటం కలిసొచ్చే అంశం.

అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అక్కడక్కడ సినిమా థియేటర్లు తెరుచుకోలేదు. లవ్ స్టోరీ సినిమా కోసం ఎదురుచూస్తున్నా ప్రేక్షకుల అంచనాను బట్టి అవి కూడా తెరచుకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు కూడా ఇంకా 20 రోజులు మిగిలి ఉండటంతో అప్పటికి పరిస్థితి పూర్తిగా సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరో విశేషమేంటంటే, సెప్టెంబర్ మొదటి వారం నుంచి కాలేజీలు పూర్తిస్థాయిలో పునప్రారంభం కానున్నాయి. యూత్ లో ప్రేమకథ సినిమాలకి ఉంటే క్రేజ్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో శేఖర్ కమ్ముల తీసిన సినిమాలు ‘హ్యాపీ డేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ కథలు కూడా యువతను దృష్టిలో పెట్టుకొని కాలేజీ నేపథ్యంలో సాగించిన సినిమాలే.. అవి కూడా దగ్గరదగ్గరగా ఈ సీజన్లో వచ్చిన సినిమాలే.. ఇక, కరోనా సెకండ్ వేవ్ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లో మంచి ఫీల్ గుడ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సో, ఈ వినాయక చవితి సందర్బంగా వస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రం శేఖర్ కమ్ములకు కలిసిరావాలని కోరుకుందాం..!

-Advertisement-నీ చిత్రం చూసి: ఈ కాలం ‘లవ్ స్టోరీ’కి కలిసొస్తుందా?

Related Articles

Latest Articles