సీక్రెట్ సర్వేలు.. హుజూరాబాద్ లో గెలిచేదెవరు?

హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అందరి చూపు ఈ నియోజకవర్గంపైనే పడింది. సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా ఈ ఉప ఎన్నిక మారిపోయింది. రేసులో ఎంతమంది ఉన్నా వారంతా  థర్డ్ ప్లేసుకోసమో పోటీ పడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుజూరాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ లేదంటే బీజేపీ అభ్యర్థి మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక రిజల్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆయన్ని మంత్రి పదవి నుంచి పక్కన పెట్టారు. ఈక్రమంలోనే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. గతంలో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగి వరుసగా హుజూరాబాద్ నుంచి గెలుస్తూ వస్తున్న ఈటల రాజేందర్ ఈసారి బీజేపీని నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. హుజూరాబాద్‌లో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తనను ఆదరిస్తారని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

మరోవైపు టీఆర్ఎస్ నేతలు హుజూరాబాద్‌లో గెలిచి తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు. వ్యక్తి కంటే పార్టీనే సుప్రీం అని చాటేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే టీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో ఉన్నా గెలుస్తామనే ధీమాను ఆపార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు హుజూరాబాద్ ఉపఎన్నిక బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ లు ప్రతీరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

హుజూరాబాద్ లో గెలిచేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఈ నియోజకవర్గంలో రెండు లక్షల 36వేల ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీలు లక్షా 32వేలు ఉండగా దళితులు 45వేలు ఉన్నారు. మిలిగిన స్థానాల్లో ఇతర కులాల వాళ్లు ఉన్నారు. ఈటల రాజేందర్ బీసీ అభ్యర్థిగా పోటీ ఉండగా టీఆర్ఎస్ సైతం బీసీ అభ్యర్థినే బరిలో దింపింది. అలాగే దళితులను ఆకర్షించేలా హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ పథకం వల్ల దళిత ఓటు బ్యాంకు మొత్తం టీఆర్ఎస్ ఖాతాలో పడుతుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. అలాగే అడిగిన వారికి లేదనకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.

కాగా తాజాగా అటు టీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీలు ప్రజానాడి తెలుసుకునేందుకు నియోజకవర్గంలో సీక్రెట్ సర్వేలు చేయిస్తున్నాయట.. అందులో ఎవరికి మొగ్గు ఉంది.. ప్లస్ లు ఏంటి? మైనస్ లు ఏంటి? ఏం అమలు చేయాలి? ఎలా ముందుకెళ్లాలనే దానిపై శూలశోధన మొదలుపెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా దళితబంధు ఎఫెక్ట్ పనిచేస్తుందా?  బీసీ అభ్యర్థుల ఎంపికపై ఆరాతీస్తున్నారట.. ఈ రెండు అంశాలు టీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండలాల వారీగా బాధ్యతలను చూస్తూ ఇక్కడి గెలించేందుకు పావులు కదుపుతున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ సైతం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అనారోగ్య కారణాలతో ఆ బాధ్యతను ప్రస్తుతం బండి సంజయ్ కి ఆయన అప్పగించారు. ఇప్పటికే బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. త్వరలోనే ఆయన పాదయాత్ర హుజూరాబాద్ కు చేరుకోనుంది.

అక్టోబర్ 2న హుజూరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి పాదయాత్రను ముగించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రెండు పార్టీల నేతలు ఎవరికీ వారు తగ్గెదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగనుందని స్పష్టమవుతోంది. ఈక్రమంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఎలాంటి సస్పెన్స్ ను తలపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

-Advertisement-సీక్రెట్ సర్వేలు.. హుజూరాబాద్ లో గెలిచేదెవరు?

Related Articles

Latest Articles