ఢిల్లీలో ఇండియా, రష్యా రహస్య చర్చలు.. ఏం జరుగుతోంది?

అఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి పరిస్థితులన్నీ గంటగంటకు మారిపోతున్నాయి. సెప్టెంబర్ 11న తాలిబన్లు తమ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయనుండడటంతో ప్రపంచ మొత్తం అఫ్ఘన్ వైపే చూస్తోంది. తాలిబన్లు గద్దెనెక్కక ముందే వారు వ్యవహరిస్తున్న తీరు ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది. తాలిబన్లు తమ మిత్రదేశాలుగా చైనా, పాకిస్థాన్ ను మాత్రమే ప్రకటించాయి. వీరి చర్యలు భారత్, రష్యా, అమెరికా దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దేశాలకు చెందిన కీలక నేతలు ఢిల్లీలో రహస్యంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.

అప్ఘన్ ప్రభుత్వంలో ప్రధానిగా ముల్లా హసన్ వ్యవహరించబోతుండగా.. అతడి డిప్యూటీగా ముల్లా బరాదర్ ఉండనున్నారు. అమెరికా హిట్ లిస్టులో ఉగ్రవాదిగా ఉన్న హక్కానీ నెట్ వర్క్ నేత సిరాజుద్దీన్ హక్కానీ కీలకమైన హోంమంత్రి పదవి చేపట్టడం అన్ని దేశాలకు శరాఘాతంగా మారింది. మొత్తం 33 మందితో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు చేయనున్నట్లు తాలిబన్ అధికారి ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్, రష్యా, అమెరికా దేశాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా అప్ఘన్లో జరుగుతున్న పరిణామాలు భారత్ కు ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చేలా కన్పిస్తుండడంతో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.

తాలిబన్ల వ్యవహారశైలి పూర్తిగా భారత్ వ్యతిరేకంగా ఉన్నట్లే కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తమ మిత్రదేశాలైన అమెరికా, రష్యాకు చెందిన కీలక అధికారులను తాజాగా చర్చలకు ఆహ్వానించింది. రష్యా జాతీయ భద్రతా సలహాదారుతోపాటు అమెరికా సీఐఏ ఛీఫ్ విలియం బర్న్స్ కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. వీరంతా కూడా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల తరలింపులు, తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటుపై ధోవల్ చర్చించారు. ప్రస్తుతం అప్ఘన్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ నిర్ణయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

నేడు ప్రధాని మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, రష్యా జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ నికోలాయ్ పత్రుషేవ్ తో సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. తాలిబన్లతో భారత్ సంబంధాలు మెరుగుపర్చుకోవాలని.. గతంలో పుతినా్ ప్రధాని మోడీకి సూచించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటి కీలకంగా మారనుంది. ఈ భేటీలో విదేశాంగమంత్రి జై శంకర్ కూడా పాల్గొనే అవకాశముంది.

రష్యా నేరుగా తాలిబన్ల సర్కారులో జోక్యం చేసుకోవానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. గతంలో రష్యా సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్నప్పుడు తాలిబన్లు వారితో మంచి సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఈ నేపథ్యంలో రష్యా తాలిబన్ల సర్కార్ కు మద్దతిస్తోందని తెలుస్తోంది. ఆప్ఘనిస్తాన్ పరిణామాల్లో అమెరికా జోక్యాన్ని తప్పుబడుతున్న రష్యా, భారత్ విషయంలో మాత్రం సానుకూల వైఖరిని ప్రదర్శిస్తుంది. తాలిబన్లతో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తేనే మంచిదని రష్యా సలహా కూడా ఇస్తోంది. భారత్-రష్యా-చైనా కలిసి అమెరికా లేని ఆప్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని ప్రతిపాదిస్తోంది. ఇందులో రష్యా పాత్ర ఇక్కడ కీలకంగా మారిపోయింది.

ఈ నేపథ్యంలో భారత్ కొత్తగా ఏర్పాటయ్యే తాలిబన్ల సర్కార్ తో ఎలా వ్యవహరించాలనే దానిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనిలో భాగంగా మిత్రదేశాలైన అమెరికా, రష్యాలను సంప్రదిస్తోంది. త్వరలో జరిగే స్కో(sco), క్వాడ్ (quad) ఆవిర్భావ కార్యక్రమానికి వెళ్లనున్న మోడీ అక్కడే ఆప్ఘన్ పరిణామాలపై అమెరికా, రష్యా ప్రభుత్వ అధినేతలతో చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక్కడే ఆప్ఘన్లో అగ్రదేశాల భవిష్యత్ వ్యూహం ఖరారు కానుందని సమాచారం. రేపు బ్రిక్స్ సమావేశంలోనూ వర్చువల్ గా మోడీ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనే దేశాధినేతలతో కలిసి అప్ఘన్ పరిస్థితులపై చర్చించబోతున్నారు. ఏదిఏమైనా అప్ఘన్ పరిణామాల నేపథ్యంలో భారత్ మిత్రదేశాలతో రహస్యంగా చర్చలు జరుపడం ఆసక్తిని రేపుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-