చిన్నమ్మ రీ-ఎంట్రీతో తమిళనాట కొత్త రాజకీయం..!

రేపటికి, అంటే అక్టోబర్‌ 17కి ఆలిండియా అన్నా డీఎంకే- AIADMK ఆవిర్భవించి 50 ఏళ్లవుతుంది. దానికి ఒక రోజు ముందు తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు ఆమె నెచ్చెలి శశికళ ఘన నివాళులర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్‌ దగ్గరున్న జయలలిత, ఎంజీఆర్‌ సమాధులపై పూల మాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఐతే, జయ సమాధి వద్ద ఆమె భావోద్వేగంతో కంటతడి పెట్టటం అందరి దృష్టిని ఆకర్శించింది. అలాగే ఆమె అక్కడకు వచ్చిన కారుపై అన్నాడీఎంకే జెండా ఉండటం విశేషం. కార్యకర్తలు కూడా అన్నాడీఎంకే జెండాలతో చిన్నమ్మకు స్వాగతం పలకటం కూడా మీడియా దృష్టిలో పడింది. గతంలో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను బహిష్కరించిన విషయం తెలిసిందే.

ఆక్రమ ఆస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి గత జనవరిలో విడుదలయ్యారు. జైలు నుంచి రిలీజైన తరువాత ఆమె జయ సమాధిని సందర్శించటం ఇప్పుడే. మామూలు పరిస్థితులలో అయితే ఇది పెద్ద విశేషం కాదు. కానీ ఇప్పుడు తమిళనాడులో రాజకీయ పరిస్థితులు వేరు. ముఖ్యంగా ఏఐఏడీఎంకే పరిస్థితి మునపటిలా లేదు. అందుకే జయ సమాధి సందర్శనకు విశేష రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

నాలుగేళ్ల క్రితం ..ఫిబ్రవరి 15, 2017న శశికళ జైలుకు వెళ్లే ముందు చివరిసారిగా ఇక్కడకు వచ్చారు. పోలీస్‌ వ్యాన్ ఎక్కే ముందు సమాధి మీద మూడు సార్లు పెద్దగా చరిచారు. జైలు నుంచి తిరిగొచ్చి ..కుట్రకు, ద్రోహానికి ప్రతీకారం తీర్చుకుంటానని ఆవేశంగా ప్రతిజ్ఞ చేశారు చిన్నమ్మ. ఐతే, ఇందుకు విరుద్ధంగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు ..అంటే ఈ ఏడాది మార్చిలో అనూహ్యంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించటం ఆశ్చర్యపరిచింది. మళ్లీ ఈ మధ్యనే తాను రీఎంట్రీ ఇస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె జయ సమాధిని దర్శించటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో అన్నాడిఎంకే ఘోరంగా ఓడిపోయింది. ఇది జరిగి వారం కూడా కాకముందే ఆమె ఇక్కడకు రావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. కాంచీపురం సహా తొమ్మిది జిల్లాల్లో డీఎంకేతో అలయెన్స్‌ విజయకేతనం ఎగరేసింది. 153 జిల్లా పంచాయతీ వార్డులకు గాను డీఎంకే 139 స్థానాలు గెలవగా ..ఏఐఏడిఎంకే కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. ఇక 1, 421 పంచాయతీ యూనియన్‌ వార్డులకు గాను DMKకు 977 దక్కగా, AIADMK కేవలం 212తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని శశికళ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

నిజానికి శశికళ ప్రభావానికి కార్యకర్తలు లోను కాకుండా ఉండేందుకు ఏఐఏడీఎంకే ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఫిబ్రవరి 24న జయలలిత జయంతి సందర్భంగా క్యాడర్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం లేఖలు రాశారు. ప్రలోభాలకు గురిచేసి కార్యకర్లను కొనలేరు అనే మెసేజ్‌ ఇచ్చారు ఆ లేఖ ద్వారా. అంటే శశికళకు దూరంగా ఉండాలని ఇచ్చిన పిలుపు అది.

కానీ అన్నా డిఎంకే ఇప్పుడు అధికారంలో లేదు. పార్టీ శ్రేణులు నిరాశలోకి వెళ్లిపోయాయి. ప్రజాకర్శన కలిగిన నేత పార్టీకి సారధ్యం వహిస్తేనే క్యాడర్‌లో ఉత్సాహం ఉంటుంది. ఇటు పళనీ స్వామికి గానీ అటు పనీర్‌ సెల్వంకు గానీ ఆ స్థాయి ప్రజాకర్శన ఉందని కర్యాకర్తలు విశ్వసించటం లేదు. అందుకే వారు తప్పక తన వైపు చూస్తారని శశికళ బావించవచ్చు. నిజానికి జయలలితకు అత్యంత సన్నిహితంగా మెలిగిన శశికళకు ఆమె రాజకీయం కూడా అబ్బింది. జయలలిత మరణం తరువాత పార్టీపై పూర్తి పట్టు సాధించారు. కానీ ఆక్రమ ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఆశనిపాతమైంది. సీఎం కుర్చీలో కూర్చునే ముందు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఐతనా చిన్నమ్మలో ఆశ చావలేదు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు పార్టీ 50వ ఆవిర్భావ వేడుకలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

శశికళ ప్రస్తుతం పార్టీ శ్రేణులకు దగ్గరయ్యే ప్లాన్‌లో ఉన్నారు. నమదు ఎంజీఆర్‌ పత్రిక కు ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనే దీనికి నిదర్శనం. నేనొస్తున్నాన్న సంకేతాన్ని ఆ ప్రకటన ద్వారా కేడర్‌లోకి పంపించారు. శశికళ తాజా కదలికలను బట్టి తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలవుతాయని స్పష్టమవుతోంది. తన భవిష్యత్ రాజకీయం పైన మద్దతుదారులతో కీలక మంతనాలు జరిపినట్టు సమాచారం.

మరోవైపు, డీఎంకే కూడా తమ అధినాయకుడు ఎం. కరుణానిధిని కోల్పోయింది. కానీ స్టాలిన్‌ రూపంలో ఆ పార్టీకి బలమైన నేత ఉన్నారు. తరువాత తరం కోసం ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ కూడా రెడీగా ఉన్నాడు అనుకోండి..అది వేరే విషయం. స్టాలిన్‌ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీని విజయవంతంగా నడిపించారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో డీఎంకే ప్రభుత్వం మునపటి కన్నా బలంగా కనిపిస్తోంది. ఆ పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఉరకలేస్తోంది. కానీ అన్నా డీఎంకే వైపు చూస్తే ఆ స్థాయి నేత ఎవరు? అనే ప్రశ్న ముందుకు వస్తుంది.

గత ఎన్నికల్లో ఫలణీ స్వామి సారధ్యంలో అన్నాడీఎంకే 75 స్థానాల్లో గెలిచింది. ఇవి సులభంగా తీసిపారేయాల్సిన సీట్లు కాదు. కానీ ముందు ముందు ఆయన పార్టీని ఎంత వరకు సక్సెస్‌ఫుల్‌ నడపగలరు అనేదానిపై పార్టీ శ్రేణులలో అనేక అనుమానాలు ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు శశికళ వేసే రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది.

అధికారం ఉన్నప్పుడు పార్టీని నడిపించటం పెద్ద లెక్క కాదు. అధికారానికి దూరమైన దానిని తిరిగి పవర్‌లోకి తీసుకురావటం పెద్ద విషయం. నాయకత్వ సామర్ధ్యానికి ప్రామాణికం. రాత్రికి రాత్రి జయలలిత చేతికి అన్నా డీఎంకే పార్టీ పగ్గాలు అందలేదు. అందుకు ఆమె ఎంతో శ్రమించారు. ఎన్నో వొడుదుడుకులు ఎదుర్కోన్నారు. ఎన్నో అవమానాలు భరించారు. అయినా పట్టువదల లేదు. ఎంజీఆర్ మరణం తరువాత జయలలితకు జరిగిన అవమానాలు అన్నీ ఇన్నీ కాదు. అదో పెద్ద ఎపిసోడ్‌. కానీ చివరకు ఆ పార్టీకి ఆమె ప్రజాకర్శనే దిక్కయింది. అయితే శశికళను ఆమెతో పోల్చటం ఏమాత్రం సరికాదు. కానీ పరిస్థితులు ఇప్పుడు ఒక బలమైన నేతకు ఆవకాశం ఇచ్చేలా ఉన్నాయి. దానిని శశికళ ఏ మేరకు తనకు అనుకూలంగా మలచుకుంటారో చూడాల్సివుంది.

Dr.Ramesh Babu Bhonagiri

Related Articles

Latest Articles