పండక్కి ఊరెళుతున్నారా? అయితే రైళ్ళన్నీ ఫుల్

సంక్రాంతి పండుగ అంటే పిల్లలు పెద్దలకి ఎంతో సరదా. ఉద్యోగాలు, పిల్లల చదువుల కోసం వేరే ఊళ్లలో వుండేవారు స్వంతూళ్ళకు వెళతారు. బంధువులు, కుటుంబ సభ్యులతో వారం గడిపేస్తారు. పాత రోజుల్ని గుర్తుచేసుకుంటారు. గోదావరి జిల్లాల వారైతే కోడిపందేలతో మజా చేస్తారు. సంక్రాంతి వంటకాలతో కడుపారా తింటారు. గతంలో కంటే ఈసారి సంక్రాంతి సందడి ఎక్కువగానే వుండేలా వుంది. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ళుగా సంక్రాంతిని ఎంజాయ్ చేయలేనివారు ఈసారి సంక్రాంతికి ఊరెళదామనుకుంటున్నారు.

అయితే, సంక్రాంతి పండక్కి ఊరెళదామంటే కుదిరేలా లేదు. 50 రోజుల ముందే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. చాలా రైళ్ళు చాంతాడంత వెయిటింగ్‌ లిస్ట్‌ తో కనిపించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి, గౌతమి, గరీబ్‌ రథ్‌ వంటి రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత వుంది. ఫలక్‌నుమా, ఎల్‌టీటీ, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లలో పరిమితి దాటి ‘రిగ్రెట్‌’కు చేరింది. ఈసారి సంక్రాంతికి స్వస్థలాలకు బయల్దేరేవారు, జనవరి 9 ఆదివారం కావడంతో అంతకు ముందురోజు నుంచి ప్రయాణాలకు రెడీ అవుతున్నారు. జనవరి 8 నుంచి 10-12 వరకు టికెట్లకు భారీగా డిమాండ్‌ ఉంది. 13వ తేదీ కూడా టికెట్లు దొరకడంలేదు.

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, నరసాపురం వైపు రద్దీ తీవ్రంగా ఉందని టికెట్ రిజర్వేషన్ల కోసం వచ్చినవారు చెబుతున్నారు. ఖమ్మం, విజయవాడ, రాజమండ్రికి వెళ్లాలనుకునే వారికీ టికెట్లు లేవు. ఒడిశా, బెంగాల్‌కు వెళ్లే రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ ఎక్కువగానే ఉంది. పుణె, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాల్లో ఉన్నవాళ్లు తెలుగు రాష్ట్రాల్లోని సొంతూళ్లకు ప్రయాణాలు పెట్టుకోవడంతో అటు నుంచి వచ్చే రైళ్లలోనూ రద్దీ బాగా వుందని తెలుస్తోంది.

సికింద్రాబాద్‌-విశాఖ మార్గంలో 10 రైళ్ళున్నాయి. వాటిలో జనవరి 11న 9, 12న అన్ని రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. కాకినాడకు 11, 12 తేదీల్లో ఏ క్లాస్‌లోనూ టికెట్లు లేవు. ఎల్‌టీటీ విశాఖపట్నం, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లలో థర్డ్‌ ఏసీలో టికెట్లకు అవకాశమే లేదు. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌ క్లాస్‌లో 472, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 327 వెయిటింగ్‌ లిస్టు నడుస్తోంది. ఇంత వెయిటింగ్ లిస్ట్ తో ప్రయాణాలు కష్టమే. ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు ప్రయాణికులు.

కోవిడ్ కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ బాగా సాగడంతో సంక్రాంతి రైళ్ల రిజర్వేషన్లకు డిమాండ్ పెరిగింది. కోవిడ్ కారణంగా అదనపు ఛార్జీలతో నడిపిన ప్రత్యేక రైళ్లను కొవిడ్‌కు ముందు మాదిరిగానే సాధారణ ఛార్జీలతో నడుపుతుండటం రైలు టికెట్లకు డిమాండ్‌ను పెంచుతోంది. రైల్వే శాఖ అదనపు రైళ్ళు వేయాల్సిన అవసరం వుందంటున్నారు ప్రయాణికులు.

Related Articles

Latest Articles