సంక్రాంతి బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ అలా.. టీఎస్ఆర్టీసీ ఇలా…

మరో 10 రోజుల్లో సంక్రాంతి పండగ రానుంది. అతి పెద్ద పండగ కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు అందరూ సొంతూళ్ల బాట పడతారు. ఈ సందర్భంగా రైళ్లు, బస్సులు కిటకిటలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ప్రత్యేకంగా 6,970 బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. పండుగకు ముందు 4,145 బస్సులు, ఆ తర్వాత 2825 బస్సులను తిప్పనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జనవరి 8వ తేదీ నుంచి ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలను ఏపీఎస్ఆర్టీసీ వసూలు చేయనుంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు 1500 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది.

Read Also: రాష్ట్రంలో దశ దిశలేని పాలన : సోము వీర్రాజు

మరోవైపు టీఎస్ఆర్టీసీ కూడా సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడపనుంది. సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం 4,360 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల టీఎస్ఆర్టీసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులను రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు సహా ఏపీలోని పలు పట్టణాలకు, కర్ణాటక, మహారాష్ట్ర వైపు వెళ్లే బస్సులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే టీఎస్ఆర్టీసీ మాత్రం అదనపు ఛార్జీలు లేకుండానే పండుగకు ప్రత్యేకంగా బస్సులను నడపనుంది.

Related Articles

Latest Articles