హీరోగా బిజీ అవుతున్న బర్నింగ్ స్టార్!

(మే 9న సంపూర్ణేశ్ బాబు బర్త్ డే)
సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందరి దృష్టినీ ఆకర్షించి, సినిమాలపై సెటైర్ వేస్తూనే సినిమాల్లో అడుగుపెట్టిన ధీరుడు సంపూర్ణేశ్ బాబు. ఆయన తొలి చిత్రం ‘హృదయ కాలేయం’ టైటిల్ లోనే వైవిధ్యం చూపింది. ఇక మన తెలుగు సినిమాల్లోని స్టార్ హీరోల చిత్రాల్లోని జిమ్మిక్స్ నే ఆ చిత్రంలో వ్యంగ్యంగా చిత్రీకరించి, జనాన్ని ఆకట్టుకున్నాడు సంపూర్ణేశ్. జనం అభిమానంగా ‘సంపూ’ అని పిలుచుకుంటున్న ఈ బాబుకు ఉన్న క్రేజ్ తో మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’లో సెక్సిణి సన్నీ లియోన్ జోడీగా కనిపించాడు. కనిపించింది కాసేపే అయినా సంపూ భలేగా ఆకట్టుకున్నాడు. ఆ తరువాత పలువురు టాలీవుడ్ హీరోల చిత్రాలలో అతిథి పాత్రల్లో అలరించాడు సంపూ.

ఇక సంపూ హీరోగా నటించిన ‘సింగం 123’లో సూర్య ‘సింగమ్’కు పేరడీ చేసి నవ్వులు పూయించాడు. ‘కొబ్బరి మట్ట’ చిత్రంలో పాపారాయుడు, పెదరాయుడు, యాండ్రాయిడ్ గా త్రిపాత్రాభినయం చేసి కితకితలు పెట్టాడు. ప్రస్తుతం సంపూ హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ‘బజార్ రౌడీ’ చిత్రాన్ని వసంత నాగేశ్వరరావు రూపొందిస్తుంటే… మీరావలి దర్శకత్వంలో ‘పుడింగి నెంబర్ 1’ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో విద్యుల్లేఖా రామన్, సాఫీ కౌర్ హీరోయిన్లు. అలానే త్వరలోనే ఐదు పాత్రల్లో కనిపించే ప్రయత్నం చేస్తున్నానని సంపూ చెబుతున్నాడు. ఇక మే 9న అతని పుట్టిన రోజు సందర్భంగా మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ సంయుక్తంగా ఓ సినిమాను అనౌన్స్ చేస్తున్నాయి.

సోషల్ మీడియాతో బర్నింగ్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సంపూ, రియల్ లైఫ్ లో చాలా సాదాసీదాగా ఉంటాడు. కరోనా రాకముందు, బస్సులోనే ప్రయాణం చేసేవాడు. ఆపదలో ఉన్న వారికి చేతనైన సాయం అందించేవాడు. 2017లో యన్టీఆర్ హోస్ట్ గా సాగిన ‘బిగ్ బాస్’ సీజన్ 1లో కంటెస్టెంట్ గా ఉన్నాడు సంపూ. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలని తపించే సంపూ, మరి మునుముందు ఏ తీరున తెరపై అలరిస్తాడో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-