సమంత ఆశలపై నీళ్ళు!

పోషించే పాత్ర కోసం ప్రాణం పెట్టే ఈ తరం తారల్లో సమంత పేరు కూడా ఉంటుంది. లేకపోతే ఇంత షార్ట్ టైమ్ లో ఆమె నటిగా, స్టార్ గా అంత టాప్ పొజిషన్ కు వెళ్ళలేదు. సమంత నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కమర్షియల్ సక్సెస్ ను పక్కన పెడితే, ఆమె ప్రయత్న లోపం మాత్రం ఎక్కడా కనిపించదు. ఎంత హెక్టిక్ షెడ్యూల్ లో అయినా సరే… సమంత తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తూ ఉంటుంది. రకరకాల వ్యాపకాలు ఉన్నా… సినిమా దగ్గరకు వచ్చే సరికీ దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం సమంత ఇస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే… తొలిసారి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2లో నటించిన సమంత దాని ప్రమోషన్స్ ను కూడా భారీ స్థాయిలో చేయాలనే భావించింది. వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ డేట్స్ కన్ ఫర్మ్ కాగానే నేషనల్ మీడియాకు రకరకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేసింది. ఇక మే ద్వితీయార్థంలో సౌత్ లో ఈ వెబ్ సీరిస్ కు ప్రచారం చేయాలనుకున్న సమంత ఆశలపై నీళ్ళు చల్లినట్టు అయిపోయింది.

‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్ సీజన్ 1న కాశ్మీర్ టెర్రరిస్టుల నేపథ్యంలో తీయడంతో అందరూ బాగానే కనెక్ట్ అయ్యారు. అక్కడ హీరో సాధించిన విజయానికి, అతని తెగింపుకు జోహార్లు పలికారు. కానీ సెకండ్ సీజన్ కు వచ్చేసరికీ ఇందులో హీరో తమిళనాడులో తిష్టవేసిన ఎల్.టి.టి.ఈ. తీవ్రవాదులతో పోరాటం చేస్తున్నట్టు చూపించడంతో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర స్థాయిలో ఎల్.టి.టి.ఈ.ని తీవ్రవాద సంస్థగా భావించినా, తమిళనాడులోనూ పైకి అదే మాటలు మాట్లాడినా… ఓటు బ్యాంక్ రాజకీయాల దగ్గరకు వచ్చే సరికీ ఎల్.టి.టి.ఈ.ని బాహాటంగా విమర్శించడానికి అక్కడి రాజకీయ పార్టీలు భయపడతాయి.

చెన్నయ్ సమీపంలోని చిత్తూరులో పుట్టి పెరిగిన ‘ది ఫ్యామిలీ మేన్’ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ విషయాన్ని గుర్తించకపోవడం చిత్రంగా అనిపిస్తుంది.

లేకపోతే… కాంట్రవర్శిని వారు ముందే ఊహించారా అనుమానమూ వస్తుంది. ఈ సీజన్ 2లో సమంత ఎల్టీటీఈ తీవ్రవాదిని పోలిన రాజీ అనే పాత్రను చేసినట్టు మనకు ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతోంది. సో… ఇప్పుడు తమిళులు కేవలం వెబ్ సీరిస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే మీదనే కాదు… సమంత మీద కూడా గుర్రుగా ఉన్నారు. ఇలాంటి వెబ్ సీరిస్ లో ఆమె ఎందుకు నటించిందని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో దీనిని బ్యాన్ చేయాలనే వాదనా గట్టిగా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ అండ్ డీకే వ్యూహాత్మక మౌనం పాటించడంతో పాటు సమంతను కూడా ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వవద్దని చెప్పారట. పైగా నాగార్జున అన్ని పార్టీలు, అన్ని వర్గాలతో సుముఖంగా ఉండే వ్యక్తి. అతను కూడా కోరి కోరి చిక్కులను కొని తెచ్చుకోవాలని అనుకోరు. ఆ రకంగా తొలిసారి వెబ్ సీరిస్ చేస్తూ, బోలెడంత ప్రచారం దాని ద్వారా ఆశించిన సమంత ఆశలపై నిజంగానే ఈ వివాదంతో నీళ్ళు కుమ్మరించినట్టు అయిపోయింది! మరి జూన్ 4న ఎలాంటి ఆటంకాలు లేకుండా ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతుందో లేదో చూడాలి!!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-